Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

హైమాస్ట్ దీపాల వెనుక అక్రమాలు

Municipal funds with inferior devices

ప్రజాప్రతినిధుల బంధువుల ఇండ్ల వద్ద నిర్మాణం
నాసిరకం పరికరాలతో మున్సిపల్ నిధులకు ఎసరు
రూ. 67.43లక్షల నిధులకు కాకి లెక్కలు
మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

మనతెలంగాణ/మంచిర్యాల: మున్సిపాలిటీ  పరిధిలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ దీపాల వెనుక పలు అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం పరికరాలు తక్కువ ధరతో కొనుగోలు చేసి మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేశారనే విషయంపై  కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీలో రూ. 67.43 లక్షల  నిధులతో 58 హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రజా ప్రతినిధులు హైమాస్ట్ దీపాలను ప్రదాన కూడళ్లలో ఏర్పాటు చేయకుండా వారి బంధువులు, అనుచరుల ఇండ్ల ముందు ఏర్పాటు చేశారనే ఆరోపణలు  ఉన్నాయి.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల్లో  విద్యుత్ బిల్లులను  తగ్గించేందుకు పాత దీపాలను తొలగించి ఎల్‌ఈడి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే మంచిర్యాల పట్టణంలో అవసరం లేని చోట హైమాస్ట్ దీపాలను  ఏర్పాటు చేసి నిధులను  దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ నిత్యం ప్రజలు రద్దీగా ఉన్నప్రాంతాల్లో ప్రదాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదంతో పాటు దొంగతనాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే పాలక వర్గం, అధికారులు కమీషన్‌లకు కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేశారు.మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో మహిళ కౌన్సిలర్ భర్త ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాల్సిన హైమాస్ట్ దీపాలను అనుచరుల ఇండ్ల ముందు ఏర్పాటు చేశారు. దీంతో చుట్టు పక్కల ట్రాఫిక్ సమస్యతో పాటు దొంగతననాలు పెరుగుతున్నాయి. మున్సిపాలిటీలో మొదటగా 21 హైమాస్ట్ దీపాల కోసం అధికారులు ఈప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టర్‌లు పోటీపడి ఒక్కొక్క దీపం ఏర్పాటుకు ప్రభుత్వ అంచనా వ్యయం కంటే 17 శాతం నుంచి 25 శాతం వరకు తక్కువ కోట్ చేస్తూ పనులు దక్కించుకున్నారు. ఆన్‌లైన్ టెండర్లలో పాలక వర్గం సభ్యులు అధికారులకు కమీషన్‌లు రావడం లేదని పాలక వర్గం సభ్యుడు ఒక్కరు తనసోదరుని కుమారుని పేరుపైన అక్రమ పద్దతిలో 0.1 శాతం తక్కువ కోట్ చేస్తూ సింగిల్ టెండర్లు పొంది హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారు ఒక్కో దీపం ఏర్పాటుకు రూ. 90 వేలను ఖర్చుచేస్తున్నారు. ఇప్పటికే హైమాస్ట్ దీపాల ఏర్పాటుకు రూ. 67.43 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఇందులో ఒక్కో దీపం ఏర్పాటుకు దాదాపు రూ. 25 వేలు కమీషన్‌లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ ఐఎస్‌ఐ మార్క్‌తో నాణ్యత గల పరికరాలకు బదులు తక్కువ గేజి గల విద్యుత్ స్తంభాలు నాసిరకం ప్యానల్ బాక్స్ కాపర్ వైర్‌కు బదులుగా సర్వీస్ వైర్‌లు ఉపయోగిస్తున్నారు. పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ చెరువు కట్టపై, మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన హైమాస్ట్ దీపాల వెనుక అ క్రమాలు చోటు చేసుకున్నాయనే పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హైమాస్ట్ దీపాల వెనుక దాగి ఉన్న అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరుతున్నారు.

Comments

comments