Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

స్వచ్ఛభారత్ కు చెల్లు చీటీ

 Municipal governments are negligent In Works

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ఆదర్శంగా ఉండాల్సిన పట్టణాలు… అధ్వాన్నంగా తయారవుతున్నాయి. రోగాలను ఆహ్వానిస్తూ జనజీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. మారుమూల పల్లెలే నయమనిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ నినాదాల వరకే పరిమితమైంది. కావాల్సినంత సిబ్బంది,  దండిగా నిధులున్నప్పటికీ చిత్తశుద్ధ్ది లేకపోవడం పట్టణవాసులకు శాపంగా మారింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు అనేక పట్టణాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. వానాకాలం ప్రారంభమైన ఈ తరుణంలో అంటువ్యాధులకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన మున్సిపల్ పాలకవర్గాలు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడి చెత్త అక్కడే అన్న చందంగా పట్టణాలు కనబడుతున్నాయి. ఈ కారణంగా దారినపోయేవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక సమీపంలో నివాసం ఉండేవారు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అధికారులంతా నివాసం ఉండే సంగారెడ్డిలో ఇటీవల కురిసిన వానలకు కాలనీలన్నీ దుర్గందభరితంగా తయారయ్యాయి. చెత్తను తొలగించకపోవడంతో వానకూడా తోడై మురికి కూపాలుగా కాలనీలు కనిపిస్తున్నాయి.

శాంతినగర్ మొదలుకొని నారాయణరెడ్డికాలనీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. శాంతినగర్‌లో పిసిబి కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం డంపింగ్‌యార్డుగా మారింది. దీంతో సమీపంలో నివాసముండే వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సంగతిని ఎన్నిసార్లు విన్నవించినా మున్సిపల్ అధికారులకు పట్టలేదు. ఇక చాణిక్యపురి కాలనీలో కూడా ఇంతే.. ఇక్కడున్న ఒక పాఠశాల చుట్టూ మురికికూపంగా మారినప్పటికీ పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇక నారాయణరెడ్డి కాలనీ మరింత దారుణంగా తయారైంది. పందులకు ఆలవాలంగా మారింది. మదీనా, మంజీరానగర్, ప్రశాంత్‌నగర్, నాల్‌సాబ్‌గడ్డ, అహ్మద్‌నగర్, పాతబస్టాండ్, రైతుబజార్, భవానీనగర్, శివాజీనగర్, బాబానగర్, కల్వకుంట రోడ్డు, రెవెన్యూ కాలనీ, రాజంపేట, హాస్టల్‌గడ్డలలో నిలువఉన్న చెత్తకారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన అయ్యప్పకాలనీ, ఓడిఎఫ్ కాలనీ, బృందావన్‌కాలనీలు కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని జనం వాపోతున్నారు. పన్నుల రూపంలో వేలాదిరూపాయలను జనం చెల్లిస్తున్నారు.

అయినప్పటికీ కాలనీలను పాలకవర్గాలు విస్మరిస్తున్నాయి. ఈ కారణంగా చెత్తచెదారంతో రోగాల బారిన పడకతప్పడం లేదు. వానాకాలం ప్రారంభమైన ఈ సమయంలోనైన మున్సిపల్ పారిశుద్ద విభాగం అప్రమత్తంగా కనిపించడం లేదు. ఎవరికి వారు యమునా తీరు… అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికి స్పందిచడం లేదు. ఇక పిల్లిగాని కుక్కకానీ, పందికానీ చనిపోయిందంటే రెండు,మూడు రోజులు గడిస్తే తప్ప అక్కడి నుంచి తొలగించడం లేదు. కోట్లాది రూపాయల నిధులు వస్తున్నప్పటికీ పారిశుద్దాన్ని మెరుగుపర్చకపోవడం మున్సిపల్ పాలకవర్గ నిర్లక్ష్యాన్ని చాటిచెబుతోంది. ప్రభుత్వం ఎంతచెబితే మాత్రం మాకేంది..? అన్నట్లుగా..వీరి వ్యవహారం ఉంది.

Comments

comments