Home దునియా ప్రేమికుల స్వర్గధామం

ప్రేమికుల స్వర్గధామం

Nature-image

కేరళలోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్భుత పర్యాటక ప్రదేశం. పెళ్లయిన దంపతుల కలల రాజ్యం. పడమటి కనుమల్లోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలతో నిండి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ఈ ప్రదేశం మూడు నదులు కలిసే ప్రదేశంలో ఉంది. అవి మధురపుజ్జ, నల్లతాన్ని, కుండలే నదులు. ఈ ప్రాంతం తమిళనాడు సరిహద్దులో ఉండటం వల్ల, ఆ రాష్ట్రానికి చెందిన అనేక సాంస్కృతిక అంశాలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కావటం వల్ల ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. దేశ విదేశాల నుండి లక్షలాది పర్యాటకులు, పిక్నిక్‌లు కోరేవారు అద్భుతమైన ఈ ప్రాంతానికి వచ్చి తనివి తీరా విశ్రాంతి పొందుతారు.మున్నార్ పర్వత శ్రేణుల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శించేలా చేస్తాయి.

మున్నార్ చరిత్రలోకి వెళ్తే… బ్రిటిష్ కాలం నాటి ప్రాచీన, నేటి ఆధునిక కాలాల నాగరికతలు కనపడతాయిక్కడ. ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వారు ఈ ప్రదేశాన్ని చూసి, ఇక్కడి ఆహ్లాద వాతావరణానికి, అందమైన ప్రదేశాలకు అబ్బురపడ్డారు. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారికి అప్పట్లోనే ఒక వేసవి విడిదిగా ఖ్యాతి పొందింది. నేటికీ ఈ ప్రదేశం దాని అసమాన సౌందర్యంతో, అద్భుత పరిసరాలతో, చల్లని వాతావరణంతో ఒక ఆదర్శవంతమైన వేసవి విడిదిగా ఉపయోగ పడుతోంది.మున్నార్‌లో ఒక ఔత్సాహిక పర్యాటకుడు కోరే అంశాలన్నీ ఉన్నాయి. విహారానికి సరైన ప్రదేశం. విస్తృతమైన తేయాకు తోటలు, అందమైన లోయలు, మెలికలు తిరిగే పర్వత శ్రేణులు, పచ్చటి భూములు, అరుదైన మొక్కలు, జంతుజాలం, దట్టమైన అడవులు, వన్య సంరక్షణాలయాలు, తాజా గాలి, స్వాగతించే వాతావరణం ఇలా ఎన్నో ఎన్నెన్నో చూడాలంటే మున్నార్ వెళ్లాల్సిందే.

సైట్ సీయింగ్ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. రకాల అరుదైన పక్షులు ఇక్కడ తిరగటం వల్ల బర్డ్ వాచింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ట్రెక్కర్లకు, బైకర్లకు అనువైన ప్రదేశం ఎరావికులం నేషనల్ పార్క్. ఇది మున్నారులో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. కనుమరుగవుతున్న నీలగిరి టార్ అనే ఒక రకమైన దుప్పికి నివాసం. అనముడి శిఖరం దక్షిణ ఇండియాలోని ఎతైన శిఖరం ఈ నేషనల్ పార్క్ లో ఉంది. పర్యాటకులు సుమారు 2700 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించడానికి ముందుగా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలి. మట్టుపెట్టి మున్నార్‌కు 13 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి డ్యామ్, సరస్సు, ఇండో స్విస్ ప్రాజెక్టుగా నడుపుతున్న పశువుల పాల కేంద్రాలు ప్రసిద్ధిచెందాయి.మున్నార్ చుట్టుపక్కల జలపాతాలను చూసితీరాల్సిందే. పల్లివాసల్, చిన్నకనాల్ (దీనినే పవర్ హౌస్ వాటర్ ఫాల్స్ అంటారు) అనే ఈ రెండు జలపాతాలు మున్నార్ పర్యటనలో తప్పక చూడదగినవి. అనయిరంకాల్ రిజర్వాయర్ మున్నార్ లో చూడదగిన మరో ప్రదేశం. ఈ కొండ ప్రాంతాలలో అనాదిగా వస్తున్న తేయాకు తోటల పెంపక ప్రదర్శన టాటా టీ కంపెనీ వారు నిర్వహిస్తున్న ఒక మ్యూజియంలో చూడొచ్చు. అంతేకాకుండా పోతనమేడు, అట్టుకాల్, రాజామల, ఎకో పాయింట్, మీనెలి, నడుకాని టాప్ స్టేషన్ మున్నార్ – కొడైకెనాల్ రోడ్ లో బహు సుందరంగా కనపడే ప్రదేశాలు. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు అలరిస్తాయి. మున్నార్ చేరాలంటే కేరళ, తమిళనాడు, రెండు రాష్ట్రాల నుండి వెళ్లొచ్చు. ఈ ప్రదేశానికి సౌత్ ఇండియాలోని అన్ని ప్రాంతాల నుండి టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. పర్యాటకులు ఈ ప్రాంతంలోని అనేక హోటళ్ళు, రిసార్టులు, హోమ్ స్టేలు, రెస్ట్ హౌస్ లలో తమ వసతిని తమ తమ బడ్జెట్ల మేరకు ఎంపిక చేసుకోవచ్చు.