Home మంచిర్యాల పలు చోట్ల నత్తనడకన సాగుతున్న పనులు భారంగా ‘భగీరథుడి’ పయనం

పలు చోట్ల నత్తనడకన సాగుతున్న పనులు భారంగా ‘భగీరథుడి’ పయనం

Munsipalitiki Rs. 58 crores grant

మంచిర్యాల మున్సిపాలిటీకి రూ. 58 కోట్లు మంజూరు
రూ. 1.05 కోట్ల నిధులకు లెక్కలు చూపని అధికారులు
అటవీశాఖ అనుమతులు పొందకుండానే పైపులైన్ల తవ్వకాలు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: మిషన్ భగీరథ పనులు పలుచోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఆశించిన మేరకు ఇంటింటికి నల్లా కనెక్షన్‌లు ఇప్పట్లో అందే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వ , ప్రైవేట్ భూములతో పాటు అటవీ శాఖ భూముల్లో యదేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు పొందకుండానే కాంట్రాక్టర్‌తో పాటు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 18 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ పనులను ఇప్పటికే 8 నెలలు గడిచిపోయినప్పటికీ నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. శివారు ప్రాంతాలకు మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా గోదావరి నీటిని అందిస్తున్నారు. ప్రధాన, అంతర్గత పైపులైనల నిర్మాణానికి అవసరమైన పైపుల సరఫరాలలో జాప్యం జరుగుతుంది. మిషన్ భగీరథ కింద మంచిర్యాలలో మూడు నీటి ట్యాంక్‌లు, అండాలమ్మకాలనీలో సంపుతో పాటు జాలగుట్టపై ట్యాంక్ నిర్మించాల్సి ఉంది. గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చెన్నూర్ వరకు తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌కు పాత మంచిర్యాల శివారు నుంచి మున్సిపల్ ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు నిర్మించే పైపులైన్‌కు కలుపుతారు. ఈ పైపులైన్ ద్వారా రోజుకు 10ఎంఎల్‌డి నీటిని ముందుగా అండాలమ్మ కాలనీలో నిర్మించే సంపులోకి పంపించి, అక్కడి నుంచి జాలగుట్టపై నిర్మించే ట్యాంక్‌లోకి విద్యుత్ మోటర్లతో నీటిని ఎక్కించి అనంతరం ప ట్టణంలోని కులాయిలకు నేరుగా సరఫరా చేస్తారు. ఈ పనులు నత్తనడకన సాగడం వలన ఈవేసవిలో ప్రజలకు తాగునీరు అందే అవకాశాలు కనిపించడం లేదు.
పైపులైన్‌ల నిర్మాణంలో భారీగా అక్రమాలు ……
మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పైపుల నిర్మాణంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ పాలక వర్గం, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కమీషన్‌లు పొందుతూ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం కింద ముఖ్యమంత్రి కేసిఆర్ ఇంటింటికి గోదావరి నీరు అందించాలనే లక్షంతో మంచిర్యాల మున్సిపాలిటీకి రూ. 58 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులన్నింటిని వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే కమీషన్‌లు తక్కువ వస్తాయని భావించిన పాలక వర్గం , అధికారులు పనులన్నింటిని ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించి చేయించారు. ప్రజల అవసరాలను గుర్తించి, పైపులైన్‌లు వేయాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకుండా కౌన్సిలర్లు చెప్పిన చోటమాత్రమే పనులను పూర్తి చేసి, నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం కింద పైపులైన్‌ల నిర్మాణానికి నిధులు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ నిధులను వినియోగించి, పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. 2017 జనవరి నుంచి దాదాపు 1.05 కోట్ల మున్సిపాలిటీ నిధులను వెచ్చించి ప్రస్తుతం అధికారులు కాకిలెక్కలు చూపుతున్నారు. భగీరథ నిధులు ఉండగా మున్సిపల్ నిధులను వెచ్చించడం ఏమిటని , ఇప్పటికే విపక్షాల నేతలు ఆరోపించారు. మంచిర్యాల గ్రేడ్-1 మున్సిపాలిటీలో దాదాపు 1.10 లక్షల జనాభ ఉండగా వీరికి ప్రతిరోజు 16.5 ఎంఎల్‌డి నీరు అవసరం ఉంటుంది. అయితే పైపుల కంపెనీ యాజమానులు కొంత మంది సబ్ కాంట్రాక్టర్‌లను నియమించుకొని, జిల్లా కేంద్రాల్లోని మున్సిపాలిటీలలో పైపులైన్‌లను నిర్మిస్తున్నారు. ఈ -ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్ టెండర్‌లు నిర్వహించినప్పుడు కొంత మంది బినామీ కాంట్రాక్టర్లతో ప్రభుత్వం అంచనా వ్యయం కంటే ఎక్కువ కోట్ చేస్తూ టెండర్లు దాఖలు చేయించి, కాంట్రాక్టర్ జగదీశ్వర్ మాత్రం 0.10 శాతం తక్కువ కోట్ చేసి, పనులను దక్కించుకున్నారు. అత్యవసర పైపులైన్‌ల నిర్మాణం పేరుతో ముందుగా పనులు చేయించి, తరువాత టెండర్‌లు నిర్వహించినట్లు కౌన్సిల్ సభ్యుల ఆమోదం తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారు. ఏదిఏమైనా మిషన్‌భగీరథ పనులు నత్తనడకన సాగడం ప్రజలకు శాపంలా మారింది.