Home తాజా వార్తలు పట్టపగలు పరువు హత్య

పట్టపగలు పరువు హత్య

భార్య ఎదుటే భర్త నరికివేత
మిర్యాలగూడలో నడిరోడ్డుపై దారుణం

Murder

మిర్యాలగూడ: పట్టపగలు అందరూ చూస్తుండగా నే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం పెరుమాళ్ళ ప్రణయ్(25) అనే యువకుడిని అత్యంత దారుణంగా నరికి చంపారు. గర్భవతైన తన భార్య అమృతవర్షిణికి పరీక్షలు చేయించి తిరిగి వెళ్తుండగా అక్కడే కాపుగాసిన హంతకుడు వెదురు నరికే కత్తితో వెనుకనుండి దాడిచేసి మెడ నరికి హత్య చేశాడు. స్థానిక జ్యోతి హాస్పిటల్ వద్ద ఈ దారుణం జరిగింది. హత్యకు కులాంతర ప్రేమ వివాహమే కారణమని ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ళ బాలస్వామి, ప్రేమలతలు ఆరోపించారు. ప్రణయ్, అమృతవర్షిణిలు మిర్యాలగూడలో ఒకే పాఠశాలలో 10 తరగతి వరకు చదువుకున్నారు. అప్పడే వారి మధ్య పరిచయం పెరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దళితుడైన ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్‌ఐసి ఉద్యోగి కాగా, అగ్రకులానికి చెందిన అమృతవర్షిణి తండ్రి తిరునగరు మారుతిరావు వ్యాపారి. తన బిడ్డ ప్రేమలో పడిందని తెలిసి బిటెక్ చదువును మధ్యలో మాన్పించాడు. కాగా అమృతవర్షిణి ప్రణయ్‌లు ఇంటి నుండి పారిపోయి గత ఏడెనిమిది నెలల క్రితం హైద్రాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్ళి చేసుకున్నారు. అనంతరం మిర్యాలగూడకు తిరిగి వచ్చి తమకు తన తండ్రితో ప్రాణహాని వుందని డిఎస్పీ కార్యాలయంలో అమృత ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మీ అమ్మాయిని తీసుకవెళ్లండని ప్రణయ్ తల్లిదండ్రులు మారుతిరావుకు పలుమార్లు పెద్దల సమక్షంలో చెప్పినప్పటికీ అమృత ప్రణయ్‌తోనే కలిసి వుంటానని తెగేసి చెప్పడంతో చేసేదిమి లేక మిన్నకుండిపోయారు. అప్పటి నుండి మిర్యాలగూడలో వినోభానగర్‌లో అమృ త, ప్రణయ్‌లు నివాసం వుంటున్నారు. నెల క్రితం ప్రణ య్ తల్లిదండ్రులు స్థానిక ఫంక్షన్ హల్‌లో ఘనంగా రిసెఫ్షన్ ఏర్పాటు చేశారు. అమృత గర్భిణీ కావడంతో వైద్య పరీక్షలు చేయించేందుకు ప్రణయ్ తన తల్లి, భార్యతో కలిసి శుక్రవారం జ్యోతీ హాస్పిటల్ కు వచ్చి పరీక్షల అనంతరం తిరిగి కారువద్దకు వెళ్తుండగా వెనుకనుండి వచ్చిన అగంతకుడు ప్రణయ్‌ని కత్తితో మెడపై నరకగా కిందపడ్డాడు. తరువాత అంగతకుడు మరోసారి బలంగా నరికి చనిపోయాడని నిర్ధారించుకన్న తరువాత కత్తి అక్కడే పడేసి మరో ఇద్దరితో కలిసి పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హంతకుణ్ణి అడ్డుకోవడానికి తల్లి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భయంతో హస్పటల్‌లోకి పరుగెత్తి పడిపోయిన అమృతవర్షిణిని హాస్పటల్‌లోని ఐసియు వార్డులో చేర్చి చికిత్స చేస్తున్నా రు. ప్రణయ్‌ను వెనకగావచ్చి నరుకుతున్న దృశ్యాలు హస్పటల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హత్య వార్త తెలుసుకున్న మృతు డి బంధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగడంతో పరిస్థితిఉద్రిక్తతంగా మారింది.
ముమ్మాటికి పరువు హత్యే: తల్లిదండ్రుల ఆరోపణ
దళితకులానికి చెందిన వ్యక్తి తన కూతురును చేసుకున్నాడనే అక్కసుతోనే అగ్రకులానికి చెందిన మారుతీరావు తమ కొడుకును హత్య చేయించాడని మృతుని తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతలు వారి బంధువులు ఆరోపించారు. పెళ్లిచేసుకున్నారని తెలిసినాడే ఎన్ని రోజులకైనా నిన్ను చంపుతానని నా కొడుకును మారుతిరావు బెదిరించాడని రోదిస్తూ చెప్పారు. నీ డబ్బులు వద్దు నీ కూతురు వద్దు తీసుకపో అని పలు మార్లు చెప్పినా అమ్మాయి వెళ్ళక పోవడంతో మారుతిరావు ప్రేమ నటిస్తూ ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. హత్య జరగడానికి 5 నిమిషాల ముందే మారుతీరావు ఫోన్‌లో కూతురుతో మాట్లాడడాని ఎక్కడున్నారు, పరీక్షలు అయిపోయాయా అని ఆరా తీసాడని అన్నారు. టెస్టులు పూర్తయ్యాయి ఇక ఇంటికి బయలుదేరుతామని చెప్పిన 10 నిమిషాలకే ముగ్గురు వ్యక్తులు వచ్చారని ఒకరు దాడిచేయగా మిగతా ఇద్దరు బయట వుండి హత్య చేసిన తరువాత పారిపోయారని ఆరోపించారు. మారుతీరావు కుట్రతోనే ఈ హత్య జరిగిందని వారు ఆరోపించారు.
పరువు హత్యగానే భావిస్తున్నాం: ఎస్‌పి రంగనాధ్
ప్రాధమిక ఆధారాలు బట్టి ప్రణయ్‌ది పరువు హత్యగా భావిస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్‌పి రంగనాధ్ అన్నారు. మిర్యాలగూడలో సంచలనం రేకెత్తించిన యువకుడి హత్య జరిగిన సంఘటనా స్థలానికి ఎస్పీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌టీం ఆధ్వర్యంలో ఆధారాలు సేకరిస్తున్నామని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఆసుపత్రిలో రికార్డైన సీసీ పుటేజీలను, హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఎ1 నిందితుడు తిరునగర్ మారుతీరావు, ఎ2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ తెలిసిన వారు జిల్లా ఎస్‌పి రంగనాధ్ సెల్. 9440795600, మిర్యాలగూడ డిఎస్‌పి సెల్. 9440795636 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా వుంచుతామన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలాన్ని మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాధరావు, డిఎస్పీ శ్రీనివాస్, సిఐ ఆదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మార్వో కృష్ణారెడ్డి లు సందర్శించారు.
నిందితుల ఆచూకీ తెలిపితే పారితోషికం: ఎస్పీ
మన తెలంగాణ/నల్లగొండ రూరల్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన దారుణహత్యకు గురైన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ1నిందుతుడు తిరునగరు మారుతీరావు, ఏ2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకి తెలిపిన వారికి తగినపారితోషికం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ రంగనాధ్ తెలిపారు. ఆచూకిని నల్లగొండ ఎస్పీ సెల్‌నెంబర్ 9440795600, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ నెంబర్ 9440795636లకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యం ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఆచూకి విషయంలో సహాయం చేసిన వారికి పోలీస్ శాఖ తరపున పారితోషికం ఇవ్వబడుతుందన్నారు. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఈ పరువు హత్యకు సంబందించి నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సాద్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు