Home దునియా అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనం మురుడేశ్వర క్షేత్రం

అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనం మురుడేశ్వర క్షేత్రం

Loard-shiva-temple

మురుడేశ్వర దేవాలయం, ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేషప్రతిభకు ప్రముఖ నిదర్శనం. ఎత్తైన ఈ దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా విశిష్టమయిన పాలరాతితో జరిగింది. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు రెండేళ్లు పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు, ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ప్రాచీనకాలంనాటి ఈ దేవాలయం కాలప్రవాహంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలావస్థ నుండి, అందరి ప్రశంసలను అభినందనలను అందుకునే స్థితికి రావడానికి ఆర్.ఎన్. శెట్టి అనే భక్తుడు ముఖ్య కారకుడు.

అతని అకుంఠిత దీక్ష, భక్తి, పట్టుదల వల్ల ఈ మురుడేశ్వర దేవాలయ పునర్నిర్మాణం ఎంతో ఘనంగా జరిగింది. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరుపక్కల ఏనుగు ప్రతిమలు నిజమైన ఏనుగుల్లా భ్రమింపజేస్తుంటాయి. ఈ క్షేత్రం ప్రపంచంలోని వారందరినీ ఆకర్షిస్తుంది. అందుకే సంవత్సరమంతా రద్దీగా ఉంటుంది. మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అందులో ముఖ్యమైనవి. ఈ తీర్థాలన్నీ దేవాలయం అవతల నగరంలో వున్నాయి. ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, దీర్ఘకాల రోగాలు నయమవుతాయని అంటారు. మురుడేశ్వరక్షేత్రం, కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది. ఈ పర్వతం బంతి మాదిరిగా (కందూకం అంటే బంతి ) ఉంది కాబట్టి, ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది.

చిన్నమందిరాలు అనేకం…. మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమయినవి. ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతుంటారు. యాత్రికులు ఉండడానికి వసతి గృహాలు, హోటళ్ళూ ఉన్నాయి.

స్థలపురాణం: రావణాసురుడు కైలాసం నుంచి పరమేశ్వరుడిని వేడుకుని తెచ్చిన ఆత్మలింగానికి, మురుడేశ్వర క్షేత్రంలోని లింగానికి సంబంధం ఉంది. రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణక్షేత్రంలో బ్రాహ్మణవటువు రూపంలో వచ్చిన గణపతి భూమ్మీద పెడతాడు. వెంటనే ఆత్మలింగం భూమి నుండి బయటకి తీసుకురావడానికి వీలుకాకుండా భూస్థాపితమయింది. సాయంసమయాన అర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు, భూమిలో నుండి బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం బయటకు రాదు. రావణాసురుడు ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరిపారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అవి గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు, గోకర్ణక్షేత్రంతో కలిపి ఇవన్నీ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి అదే మురుడేశ్వరం అయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. అంటే సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కనుక ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు.

పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ఐదుక్షేత్రాలను దర్శించి, అక్కడి శివలింగాలను పూజించారట. పార్వతీపరమేశ్వరులు ఈ ఐదుక్షేత్రాలలో ఒక్కొక్కచోట వారం రోజులపాటు ఉండి పూజలు చేశారట. ఇక్కడికి దేవతలతో పాటు రుషులు, మునులు కూడా వచ్చి పూజలు చేశారట. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని తయారు చేయడానికి, దేవశిల్పి విశ్వకర్మను పరమేశ్వరుడు పిలిపించి అభ్యర్థించగా, విశ్వకర్మ పానవట్టాన్ని తయారుచేశారట. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. మురుడేశ్వరస్వామికి, శివరాత్రినాడు, బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి మరణభయం లేకుండా స్వర్గప్రవేశం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీదేవత, తూర్పున మహాదుర్గ, ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువై ఉండి రక్షిస్తున్నారట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పత్రాలు, పూలు, పండ్లతో పూజిస్తాడట.బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో చల్లిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట. ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారని ఓ కథనం. అప్పుడు ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. పరమేశ్వరుడిని ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందనుకున్న భీముడు పరమేశ్వరుడిని ధ్యానం చేసాడు. కానీ, పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమిమీద కొట్టుకున్నాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి గంగామాతని హిమతీర్థంగా సృష్టించాడు. భీముడు తన నెత్తిని నేలపై కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థం అని పిలుస్తున్నారు. బ్రహ్మహత్యా పాతకానికి శిక్షను తప్పించుకోవడానికి, ఇంద్రుడు స్వర్గాన్ని వదలి, మురుడేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుడేశ్వరస్వామి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి పూజలు చేశాడని స్థానికులు చెబుతారు.

దేవాలయ విశిష్టత: ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామికి పూజలు చేస్తూంటారు. దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలయిన ఆరాధనలు జరుగుతాయి. అన్నసంతర్పణ సేవ, నిత్యసేవ, నందదీపసేవ, ఒక రోజు అన్నసంతర్పణం, సర్వదేవపూజ అంటూ సుమారు 50 రకాల పూజావిధానాలున్నాయి. శివరాత్రి ఉత్సవాలు, పుష్యమాసంలో రథోత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కొన్ని లక్షలమంది భక్తులు వస్తుంటారు.

మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో బత్కల్ తాలూకాలో ఉంది. ఇక్కడికి కర్ణాటకలో ముఖ్య నగరాలైన బెంగళూరు, మంగళూ రు, హుబ్లీ, ధర్మస్థల మొదలైన నగరాల నుండి బస్సులున్నాయి. మురుడేశ్వరానికి రైలుమార్గం కూడా ఉంది. కొంకొణ రైల్వేవిభాగంలో    మురుడేశ్వర రైల్వేస్టేషన్ ఉంది. గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.