Home ఎడిటోరియల్ విశ్వనగరంపై ‘మూసీ’ సంతకం

విశ్వనగరంపై ‘మూసీ’ సంతకం

moosiతాగునీరు, సాగునీరు అందించిన మూసీ, తిరిగి పూర్వ వైభవాన్ని పొందేందుకు పరుగులు పెడు తోంది. తెలంగాణ వచ్చిన సంబురంలో తన అస్తిత్వాన్ని పదిలపరుచుకోవడానికి ఉరకలు వేస్త్తోంది. ఉమ్మడిరాష్ర్టంలో ‘మురికి మూసీ’గా పేరుగడించి కాలుష్య కాసారంగా మారింది. నేటి తరానికి దాని వాస్తవ రూపం చిత్రాలకే పరిమితమైంది. నాటి తరానికి మాత్రం అదో జీవనది. పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తుంటే భాగ్యనగరం దప్పిక తీర్చుకునేది. ‘బాగ్’లన్నీ పచ్చగా కళకళలాడు తుండేవి. ఇప్పు డిది జీవం కోల్పోయిన నది. నగరీకరణతో తప్పటడుగులు వేసింది. పారిశ్రామికీకరణతో వ్యర్థాలు నిండి మురికి కూపంగా మారింది. నగరం మధ్యలోంచి పారుతున్న అతి పెద్ద మురికి కాలువగా మనుగడ సాగిస్తుంది. హైదరాబాద్ నగరం గుండెపై మాయని అతిపెద్ద గాయంగా సలుపుతుంది. మూడువేల కోట్లతో మూసీకి పునరుజ్జీవం కల్పించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేసింది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తూ చారిత్రాత్మక పాతబస్తీ, కొత్త నగరాన్ని వేరుచేసిన నది మూసీ. 2,168 అడుగుల ఎత్తులో ఉన్న అనంతగిరి కొండల్లో పుట్టి తూర్పు దిశగా పయనిస్తూ కృష్ణా నదిలో కలుస్తుంది. హైదరాబాద్ నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్న మూసీ నది, ఆలేరు నదులను కలుపుకుని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీ ఆలేరులో కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాలేరు నదిని కలుపుకుని వజీరాబాద్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. చిన్న వాగులో ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సం సృష్టించి, జననష్టం కలిగించిన చరిత్ర ఉంది. మూసీ నదిపై ఏడు వంతెనలు ఉన్నప్పటికీ ‘పురానాపూల్’ అత్యంత పురాతనమైనది. భాగ్యనగర రూపకల్పనకు ఈ వంతెన వారధిలా నిలిచింది.
ఇరవైవ శతాబ్దపు తొలినాళ్ళలో మూసీ తరచుగా వరదలొచ్చి నగరానికి అపార నష్టం కలిస్తుండేది. 1908 సెప్టెంబర్ 28న ఒకరోజులో కురిసిన భారీ వర్షానికి మూసీ నీటిమట్టం పదకొండు అడుగుల ఎత్తుకు చేరి హైదరాబాద్ నగర జనజీవనాన్ని స్తంభింపజేసింది. అపార ఆస్తినష్టం కలిగింది. దీంతో ప్రణాళికాబద్ధ్దమైన నగరాభివృద్ధి అనివార్య మైంది. అభివృద్ధి ప్రణాళికను తయారుచేయడానికి ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రంగం లోకి దిగాడు. వరదల నివారణతో పాటు నగరంలో మౌలిక పౌర సౌకర్యాల కల్పనకు నిర్ధిష్టమైన ప్రణాళికతో కూడిన నివేదికను 1909, అక్టోబర్ 1న అందించాడు. ఈ మేరకు ఏడవ నిజాం 1912లో నగరాభివృద్ధి ట్రస్టును ఏర్పాటు చేశాడు. వరదల నివారణ నిమిత్తం ఈ ట్రస్టు కీలకమైన చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే 1920లో మూసీ నదిపై, నగరానికి పదిహేను కిలోమీటర్ల ఎగువన ఉస్మాన్‌సాగర్ ఆనకట్టను నిర్మించారు. అలాగే 1927లో మూసీకి ఉపనది ఈసీ నదిపై హిమాయత్‌సాగర్ జలశయం ఏర్పాటు చేశారు. ఈ రెండు జలాశయాలు మూసీకి వరదలు రాకుండా వారించడమే కాకుండా, హైదరాబాద్ నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా వినియోగంలోకి వచ్చాయి.
మూసీ తన ప్రాభవాన్ని కోల్పోవడం 1980 దశకం నుండి మొదలయింది. నగర శివార్లు పారిశ్రామిక ప్రాంతా లుగా మనుగడలోకి రావడం ఒక ఎత్తయితే, ఈ పారిశ్రామిక ప్రాంతాలలో వెలిసిన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధ పదార్ధాలు, రసాయనిక నీరు చిన్న చిన్న నాలాల్లోకి వదలడం, ఈ నాలాలన్నీ మూసీకి జత కలవడంతో నది పూర్తిగా కలుషితమైంది. దీనికి తోడు జంటనగరాల నుండి వెలువడుతున్న నాలుగు వందల మిలియన్ లీటర్ల మురికినీరు కూడా మూసీలో కలుస్తున్నది. మురికికూపంగా మారిన మూసీ పరిస్థితిని గుర్తించి, 1990 దశకంలో అప్పటి ప్రభుత్వం మురికినీటిని శుద్ధి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా మురికినీటిని శుద్ధిపరిచే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ప్రారంభించారు. అయితే ఈ ప్లాంట్లు కేవలం 20 శాతం నీటిని మాత్రమే శుద్ధిపరిచే సామర్థ్యం ఉండటంతో మూసీ ప్రక్షాళన అంతంత మాత్రం గానే సాగింది. 2000వ సంవత్సరంలో మూసీలోని నీటిని చిన్న కాంక్రీటు కాలువ ద్వారా పంపించి, ఈ నీటి ద్వారా నదీ పరివాహక ప్రాంతాన్ని ‘నందనవనం’ పేరిట ఉద్యాన వనంగా అభివృద్ధి చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టింది. అయితే ఇది మధ్యలోనే ఆగిపోయింది. నందన వనం ప్రాజెక్టు కింద మూసీలోని మురికివాడలను నిర్మూలిం చాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని సామాజిక సంస్థలు, రాజకీయ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ‘మూసీ బచావ్’ ఆందోళన చేపట్టి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాయి.
ఉమ్మడి రాష్ర్టంలో చేపట్టిన మూసీ ప్రక్షాళన రెండవ దశ ప్రహసనంగా మారింది. జాతీయ నదీ పరిరక్షణ పథకం ఎన్‌ఆర్‌సిడి కింద ఇందుకు అవసరమైన రూ.923 కోట్ల నిధుల్లో 70 శాతం నిధులిచ్చేందుకు కేంద్ర అటవీ పర్యా వరణ మంత్రిత్వశాఖ ముందుకు వచ్చినప్పటికీ, ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం తూతూ మంత్రంగా సాగింది. ప్రక్షాళనలో భాగంగా నిర్మించాల్సిన ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల కేటాయింపు సర్కారు నిర్లక్ష్య వైఖరితో వీటి ఊసులేకుండా పోయింది. అంతకుముందు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో మొదటి దశ ప్రక్షాళన చేపట్టారు. ఇందులో భాగంగా అంబర్ పేట, నాగోలు, నల్లచెరువు, అత్తాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఐదు ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించారు. రెండవ దశ ప్రక్షాళనలో ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడటంతో కేంద్ర నిధులకు గండిపడింది. ఫతేనగర్, ఐడిపిఎల్ టౌన్‌షిప్, నాగారం, కాప్రాలలో ఏర్పాటు చేయవలసిన రీసైక్లింగ్ యూనిట్లతో పాటు మరో ఐదు ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది.
మూసీ పరివాహ ప్రాంతంలోని పారిశ్రామికవాడలు, నాలాలు, ఇళ్ల నుంచి ప్రతినిత్యం 1250 మిలియన్ల లీటర్ల మురుగు నీరు బయటకు వస్తుంది. ఇందులో 93 శాతం మురుగు మూసీలోకి చేరుతుంది. ప్రస్తుతం 685 మిలియన్ల లీటర్ల వ్యర్థజలాలను అత్తాపూర్, నల్లచెరువు, నాగోలు, అంబర్‌పేట సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో అరకొరగా శుద్ధిచేసి నదిలోకి వదులుతున్నారు. మిగిలిన 565 మిలియన్ల లీటర్ల మురుగునీరు నేరుగా నదిలో కలుస్తుంది. హైదరాబాద్ నగరంలో సుమారు 25 కిలోమేటర్ల మేరకు ప్రవహించే మూసీ, చెత్తా చెదారం, పేరుకుపోయిన వ్యర్థాలు, దుర్గంధం వెలువడుతూ కనిపిస్తుంటుంది. ఈ నీటిని తాగుతున్న పశువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నది పరివాహ ప్రాంతాల భూజలాలు కలుషితమయ్యాయి. ఈ నీటిని వాడుతున్న ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడు తున్నారు. మూసీ వెంబడి సాగుచేస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లో ప్రమాదకరమైన ‘సీసం(లెడ్)’ వంటి అవశేషాలు ఉంటున్నాయి. జాతీయస్థాయిలో కాలుష్యకాసా రాలుగా మారిన నదుల్లో మూసీ నాలుగో స్థానంలో ఉన్నట్లు రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. నదిలోని నీళ్లు విషతుల్యంగా మారినట్లు తెలిపింది. నీటిలో బయలాజి కల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడి), టోటల్ డిజాల్వ్‌డ్ సాలిడ్స్ (టిడిఎస్) ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు పిసిబి చేసిన నీటి పరీక్షలో స్పష్టమైంది. జలాల్లో ప్రాణవాయువు పరిమాణం అత్యంత కనిష్టస్థాయికి చేరడంతోపాటు వ్యర్థ రసాయనాల వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సిఒడి) విపరీతంగా పెరిగినట్లు గుర్తించింది. నీటి క్షారత (పీహెచ్) అనూహ్యంగా ఏడు యూనిట్లను మించడంతో కాలుష్యం పెరిగి పర్యావరణం, జీవావరణ సమతుల్యత దెబ్బతింటున్నట్లు పిసిబి స్పష్టం చేసింది.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మురికినీటిని మూసీలోకి రాకుండా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూసీనదికి పూర్వ వైభవం తీసుకువచ్చి హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు సుందరీకరణ తర్వాత ఆ పరిసరాలు ఎలా ఉంటాయోనన్న ఊహాచిత్రాలను కూడా తయారుచేసింది. నదిపై తూర్పు, పశ్చిమ కారిడార్‌లో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించడంతో పాటు నది వెంట సుందరీకరణ చేపట్టాలని యోచిస్తోంది. నగరపరిధిలో 30 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేపట్టడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. నాలాల నుంచి మురుగునీరు నేరుగా నదిలోకి చేరకుండా రూ.3 వేల కోట్లతో పది ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. ఇందుకు అవసర మయ్యే నిధులను దక్షిణ కొరియాలోని గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీపీ) సంస్థను నాబార్డు సహాయంతో సమకూర్చు కునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సుందరీకరణలో భాగంగా రెండు కిలోమీటర్ల మేరకు నదికి ఇరువైపులా రోడ్లు వేసి పచ్చదనాన్ని పెంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు. మూసీ వెంట దోమలను నివారించడం, సుగంధ భరిత మొక్కలను పెంచడం వంటి చర్యలు చేపడుతారు. ఇందు కోసం హైదరాబాద్ నగరపాలక సంస్థ(హెచ్‌ఎంసీ), హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ), పర్యటన, సాగునీటి శాఖల అధికారులతో కమిటీని వేసి ఎప్పటికప్పుడు మూసీ ప్రక్షాళన పనులను సమీక్షిస్తారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్లు మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగినట్లయితే మంచినీటి నదిగా మారే అవకాశాలుంటాయి. మూసీ పాలనురుగు నీటితో విశ్వనగరంపై సంతకం చేసిన అనుభూతిని సొంతం చేసుకోగలదు.

Kodam pavankumar

కోడం పవన్‌కుమార్

9948992825