Home తాజా వార్తలు వీరు ఎటు మొగ్గితే అటే

వీరు ఎటు మొగ్గితే అటే

Muslim minorities, which constitute about 12.5% of the state population

కీలకం కానున్న ముస్లిం ఓటర్లు
దాదాపు 40 చోట్ల గణనీయం
12 స్థానాల్లో 20-౩౦ వేల ఓట్లు
అధికంగా టిఆర్‌ఎస్ వైపే
పథకాల ప్రభావంపై పాలక పక్షం ధీమా
చీలుతారని కాంగ్రెస్ ఆశ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో దాదాపు 12.5%గా ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్లు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. నాలుగున్నరేళ్ళలో ముస్లింలకు టి ఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం తమకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ భావిస్తుండగా, టిఆర్‌ఎస్ బిజెపికి దగ్గరగా మసులుతున్నందున ఈసారి వారి ఓట్లలో చీలిక వచ్చి తమకే లాభిస్తుందనేది కాంగ్రెస్ భావన. సాధారణంగా ముస్లిం మైనారిటీలు ఎప్పుడూ ఒక పక్షమే ఉంటారని, ఈసారి కూడా అదే కొనసాగుతుందన్నది టిఆర్‌ఎస్ ధీమా. ఏక కాల ంలో అటు బిజెపితో, ఇటు ఎంఐఎంతో టిఆర్‌ఎస్ దోస్తీ కొనసాగిస్తున్నందున ఒక సెక్షన్ ముస్లింలు భిన్నమైన నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు నలభై చోట్ల ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. సు మారు యాభై నియోజకవర్గాల్లో సగటున పది శాతం కంటే ఎక్కువ ఓటర్లు ముస్లిం మైనారిటీలే. రాష్ట్రంలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై వేల నుంచి ముప్పై వేల చొప్పున ముస్లింఓటర్లు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

గత ఎన్నికల్లో నగరంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందగా మరికొన్ని చోట్ల ముస్లిం ఓట్లు గణనీయంగానే పోలయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 39% మంది జనాభా (ఓటర్లు కూడా ఇంచుమించుగా) ముస్లింలే. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 20% ఓటర్లు ముస్లింలే. ముస్లిం పార్టీగా పేరొందిన ఎంఐఎం గత ఎన్నికల్లో సమైక్య రాష్ట్రంలో మొత్తం 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టగా ఇందులో ఇరవై తెలంగాణ ప్రాంతంలోనివే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 3.8% ఓట్లు పోలైతే తెలంగాణలో పోటీచేసిన స్థానాల్లో దాదాపు 12.42% ఓట్లు ఈ పార్టీకి పోలైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12.5% శాతం కంటే ఎక్కువే ఉన్న ముస్లింలు ఓటర్ల సంఖ్య రీత్యా చూసినా కూడా దాదాపు అదే నిష్పత్తిలో ఉంటారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఐదుఅసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన ఎంఐఎం గత పదేళ్ళుగా మలక్‌పేట, కార్వాన్ స్థానాలను సైతం తన ఖాతాలోకి తెచ్చుకుంది.

గత ఎన్నికల్లో ఈ రెండింటితో కలిపి మొత్తం ఏడు స్థానాలను నగరంలోనే గెల్చుకుంది. ముస్లిం ఓటర్లు కరీంనగర్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో గణనీయంగా ఉన్నప్పటికీ ఎక్కువగా నగరంలోని ఓటర్లనుమాత్రం ఎంఐఎం తన వైపు తిప్పుకోగలిగింది. సాధారణంగా జిల్లాల్లోని ఓటర్లు కాంగ్రెస్‌వైపు ఉంటారనే ఒక సాధారణ అభిప్రాయానికి అనుగుణంగానే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన నాలుగు స్థానాల్లో మూడు చోట్ల ఆ పార్టీ ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. ఎంఐఎం తరఫున గత ఎన్నికల్లో ఇరవై స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెడితే నగరంలో ఏడు చోట్ల మినహా మరెక్కడా ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేదు. జూబ్లిహిల్స్‌లో 25.19% ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి రెండవ స్థానంలో నిలిచారు. అంబర్‌పేట, రాజేంద్రనగర్ స్థానాల్లో మూడవ స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల్లో గెలిచిన మొత్తం పదకొండు మంది ముస్లిం అభ్యర్థుల్లో ఏడుగురు నగరం నుంచి గెలుపొందినవారే.

నాలుగేళ్ళ కార్యాచరణతో సానుకూల స్పందన :
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ ముస్లింల ఓట్లు ఎక్కువగా టిఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఇందుకు కారణం ఈ నాలుగున్నరేళ్ళలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలేనని, ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీ ముస్లిం వ్యక్తిని ఎంపిక చేసుకోవడమని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో పాటు టిఆర్‌ఎస్‌కు కూడా ఈసారి స్పష్టమైన ఓటుబ్యాంకు ఏర్పడడానికి అవి కారణమవుతున్నాయని వారి వాదన. మరోవైపు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సైతం మళ్ళీ అధికారంలోకి వచ్చేది టిఆర్‌ఎస్ పార్టీయేనని, ముఖ్యమంత్రి కెసిఆరేనని ఇటీవల పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌తో ఎంఐఎం పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ బలమైన ఫ్రెండ్లీ పార్టీగా అన్ని రకాల మద్దతు అందిస్తోంది. ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ సైతం ఈసారి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వంలోకి రావడానికి ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం వారికి అందించిన ప్రోత్సాహం, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు వారిలో భరోసా నింపాయని ‘మన తెలంగాణ’కు వివరించారు.

ఈ నాలుగున్నరేళ్ళలో ‘గంగా జమునా తహజీబ్’ పాలనను అందించి ముస్లిం మైనారిటీలకు గతంలో ఎన్నడూ లేనంతటి ప్రాముఖ్యతను ఇవ్వడం ఈసారి వారి ఓట్లు టిఆర్‌ఎస్‌కు కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. తాను పుట్టిపెరిగినప్పటి నుంచి సమైక్య రాష్ట్ర పాలనలో హైదరాబాద్ నగరంలో ఎన్నో కర్ఫూలను చూశానని, ఏ సమయంలో పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారోననే ఆందోళన ఉండేదని, కానీ ఈ నాలుగున్నరేళ్ళ టిఆర్‌ఎస్ పాలనలో మాత్రం అలాంటి భయమే లేకుండా ముస్లిం సమాజం ప్రశాంతంగా ఉందని ఉదహరించారు. నాలుగున్నరేళ్ళ టిఆర్‌ఎస్ పాలనలోని రెండేళ్ళలో 200కు పైగా ముస్లిం రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చాయని గుర్తుచేశారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్ళడానికి విద్యార్థులకు ఇరవై లక్షల ఆర్థిక సాయం ‘ఓవర్సీస్ విద్యా పథకం’ ద్వారా అందడంతో చాలా మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులు ప్రయోజనం పొందారని వివరించారు. ఇక పేదరికంతో ఉన్న సుమారు ఇరవై వేల ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ‘షాదీ ముబారక్’ పథకం లబ్ధి చేకూర్చిందని గుర్తుచేశారు.

కెసిఆరే మళ్ళీ సిఎం : ఒవైసీ
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలి పలు సందర్భాల్లో టిఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, మళ్ళీ కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. గతంలోకంటే ఈసారి ముస్లింల ఓట్లన్నీ సమీకృతమవుతాయని, ఎంఐఎం పార్టీకి కూడా ఆదరణ ఎక్కువగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తమ పార్టీకి మరిన్ని సీట్లలో విజయం లభిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. వరుసగా నాలుగు సార్లు చాంద్రాయన్‌గుట్ట నియోజకవర్గం నుంచి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ముస్లిం ఓటుబ్యాంకు ఈసారి పెరుగుతుందన్న ధీమాను వ్యక్తం చేయడంతో పాటు కర్నాటకలో తక్కువ స్థానాలతో గెలిచిన జెడిఎస్ అధికారంలోకి వచ్చినట్లు తెలంగాణలో తాము అధికారంలోకి రావడంలో ఆశ్చర్యమేముందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అసదుద్దీన్ జోక్యం చేసుకుని, తమ పార్టీకి అలాంటి ఆలోచన లేదని సవరణ ఇచ్చారు.

                                                                 2011 లెక్కల ప్రకారం
                                                                     ముస్లింల జనాభా
 జిల్లా                                                                       ముస్లిం జనాభా (శాతంలో)
ఆదిలాబాద్                                                                      10.07
హైదరాబాద్                                                                     ౩౦.౧౩
కరీంనగర్                                                                          6.48
ఖమ్మం                                                                             5.68
మహబూబ్‌నగర్                                                                8.24
మెదక్                                                                              11.29
నల్లగొండ                                                                           5.41
నిజామాబాద్                                                                    15.35
రంగారెడ్డి                                                                            11.68
వరంగల్                                                                            5.62