Home ఎడిటోరియల్ కతియార్ వ్యాఖ్యల అద్దంలో…

కతియార్ వ్యాఖ్యల అద్దంలో…

edit

ఆయన బిజెపి లోక్‌సభ సభ్యుడు. కాబట్టి ఆయన మాటలను బిజేపి మాటలుగా మనం భావించవచ్చు. ఇటీవల వరుసగా ఆయన చేసిన వ్యాఖ్యలు బిజేపి నిజరూపాన్ని మనందరి ముందు ఆవిష్కరిస్తున్నాయి.“ముస్లిములు భారతదేశంలో ఉండరాదు. వాళ్ళు దేశాన్ని జనాభా ప్రాతిపదికన విభజించారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎందుకుండాలి? వారికి భూమి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి పోవాలి. లేదా బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలి.” ఇదీ వినయ్ కతియార్ తాజా ఉవాచ. భారతదేశ విభజనకు కారకులెవ్వరు, ముహమ్మద్ అలీ జిన్నానా నెహ్రూ నా, పటేల్ కారకుడా వంటి ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిక కాదు. దేశ విభజనకు బీజాలు విభజనకు పూర్వం 80 సంవత్సరాల క్రితమే నాటడం జరిగింది. బి.ఆర్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం నిజానికి బ్రిటీషు ప్రభుత్వంపై ముస్లిములు ప్రకటించిన జిహాద్. బ్రిటీషువారిపై జిహాద్ పిలుపు నిచ్చిన అనేక ఫత్వాలు ఆ కాలంలో వచ్చాయి. 1857 తిరుగుబాటు విఫలమైన తర్వాత సహజంగానే బ్రిటీషు పాలకులు ముస్లిములను లక్ష్యంగా చేసుకున్నారు. విభజించు పాలించు సూత్రాన్ని ఆచరణలో పెట్టారు. సర్దార్ పటేల్ ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. “హిందూ ముస్లిమ్ కలహాల గురించి బ్రిటీషు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ కలహాలకు సంబంధించిన సమస్యను తమ భుజాల మీద వాళ్ళెందుకు వేసుకుంటున్నారు. బ్రిటన్‌ను ఒక వారం పాలించే అవకాశం నాకిచ్చి చూడండి. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ మధ్య శాశ్వత వైరంతో పోరాటాలు ప్రారంభమయ్యేలా చేసి చూపిస్తాను.“ అన్నారు. అంటే బ్రిటీషు వారు ఎలా ఇక్కడ చిచ్చు పెడుతున్నది ఆయన స్పష్టంగా చెప్పేశారు. భారత విభజన గురించి స్పష్టంగా అర్ధం చేసుకోవాలంటే అంబేద్కర్ రాసిన ”థాట్స్ ఆన్ పాకిస్తాన్‌“ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఏమైనా గాని సగటు భారత ముస్లిములు, ఇక్కడి మూలవాసులు, వారికి దేశవిభజనతో ఎలాంటి సంబంధమూ లేదు. అయినా వినయ్ కతియార్ లాంటి నాయకులు భారత ముస్లింలను పాకిస్తానీ అంటూ మాట్లాడడం ఇది మొదటి సారి కాదు. గొడ్డుమాంసం తినకుండా ఉండలేకపోతే పాకిస్తాన్ వెళ్ళాలంటూ ఇంతకు ముందు ముక్తార్ అబ్బాస్ నక్వీ ఒక టి.వి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యను కూడా ఇక్కడ దృష్టిలో ఉంచుకుంటే, గొడ్డుమాంసం తినేవారు కేవలం ముస్లింలే కాదు ఇంకా ఇతరులు, స్వయంగా హిందువులుగా పిలువబడే వారిలో కొన్ని కులాల వారు కూడా ఉన్నారని గ్రహిస్తే ముక్తార్ అబ్బాస్ నక్వీ లాంటి నోటిదురుసు నాయకుడు ఎవరెవర్ని పాకిస్తాన్ పంపాలనుకుంటున్నట్లు? అనే ప్రశ్న తలెత్తుతుంది. బిజెపి కేబినెట్‌లో మంత్రి కిరణ్ రిజిజు అప్పుడే ముక్తార్ అబ్బాస్ నక్వీ గారికి జవాబిస్తూ, నేను గొడ్డు మాంసం తింటాను, నన్నెవరు పాకిస్తాన్ పంపుతారని ప్రశ్నించాడు. ఆ తర్వాత తన మాటలను మీడియా వక్రీకరించిందంటూ రిజిజు బిజెపికి ఇబ్బంది కలుగకుండా చేశాడన్నది వేరే విషయం. కాబట్టి బిజెపి నాయకులకు నోరిప్పితే ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా పాకిస్తాన్ పంపేస్తామనడం పరిపాటి. వినయ్ కతియార్ ఇప్పుడు ముస్లిములు అస్సలు ఇండియాలో ఉండడానికి వీల్లేదంటూ పాకిస్తాన్ పోవాలన్నాడు. ముక్తార్ అబ్బాస్ నక్వీ ఇప్పుడేం చేస్తాడు? పాకిస్తాన్ పోతాడా? షా నవాజ్ హుస్సేన్ ఇప్పుడేం చేస్తాడు? పాకిస్తాన్ పోతాడా?
మొన్న కాస్‌గంజ్ అల్లర్ల సందర్భంగా వినయ్ కతియార్ ఈ మాటలే చెప్పాడు. కాస్ గంజ్ లో తిరంగా ర్యాలీ తీస్తున్న సోకాల్డ్ దేశభక్తులను ముస్లిములు అడ్డుకున్నారని, ముస్లిములు అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చారని, పాకిస్తాన్ జెండా ఎగరేయాలని చెప్పారంటూ వ్యాఖ్యలు చేశాడు. కాని కాస్ గంజ్ లో అలాంటివేమీ జరగలేదు. నిజానికి అక్కడ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటూ, పతాకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ముస్లిముల కార్యక్రమాన్ని తిరంగా ర్యాలీ ‘దేశభక్తు’లే అడ్డుకుని, కాషాయ జెండా ఎగరేయాలంటూ బలవంతం చేసిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు ఏవీ వినిపించలేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు. మరి వినయ్ కతియార్ ఈ మాటలు ఎలా చెప్పాడు. అదే విషయాన్ని ఒక ఇంగ్లీషు చానల్ రిపోర్టర్ ఎన్ని సార్లు అడిగినా ఈ అబద్దాల కోరు నాయకుడు ముఖం చాటేసి వెళ్లిపోయాడు. ఇంతకు ముందు జవహర్ లాల్ విశ్వవిద్యాలయం సంఘటనలోనూ దొంగ విడియోలు ప్రచారంలో పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలకు సంబంధించి గగ్గోలు లేవదీశారు. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమంటే, పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ఈ దేశంలో ముస్లింలు చేస్తుంటారని, పాకిస్తాన్ జెండా ఎగరేస్తుంటారన్న బిజెపి నాయకులు కావాలని అబద్దపు ప్రచారంతో ముస్లిముల పట్ల విద్వేషంతో అధికారం కాపాడుకునే ప్రయత్నాలుకొనసాగిస్తున్నారు.
ఆగ్రాలో తాజ్ మహోత్సవ్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. యోగి ప్రభుత్వానికి, బిజెపికి తాజ్ మహల్ పై ఎంత నిరసన, ఆగ్రహాలు ఉన్నప్పటికీ తాజ్ మహోత్సవం జరపడం తప్పనిసరి అవసరంగా మారిం ది. ఈ సందర్భంగా వినయ్ కతియార్ మాట్లాడుతూ తాజ్ మహోత్సవ్ అన్నా తేజ్ మహోత్సవ్ అన్నా ఒక్కటే. మా తేజ్ మహల్ ను ఔరంగజేబు తాజ్ మహల్ గా ఒక సమాధిగా మార్చాడని చెప్పాడు. ఆ తాజ్ మహల్ ను త్వరలో తేజ్ మహల్‌గా మార్చేస్తామన్నాడు. “మా” తాజ్ మహల్ అంటే అర్థమేమిటి? అంటే బిజెపి స్వంతమా. తాజ్ మహల్ భారత ప్రజలందరిదీ. అందులో హిందువులు, ముస్లింలు అందరూ ఉన్నారు. కాని వినయ్ కతియార్ విషయంలో మా తాజ్ మహల్ అంటే అర్థం హిందువుల తాజ్ మహల్ అని. మేము అంటే హిందువులం, వాళ్ళు అంటే ముస్లింలు ఈ విభజన మాటలు ఈ విద్వేషపు మాటలే బిజెపి నేతల నోటి నుంచి వస్తుంటాయి. మనం భారతీయులం అనే మాట వారి నోట వినబడదు. మరో విచిత్రమేమంటే తాజ్ మహల్ కట్టించింది ఔరంగజేబు కాదు, షాజహాన్. చరిత్ర గురించి ఒనమలు తెలియని ఈ నాయకులు దేశ చరిత్రను మార్చేస్తామంటున్నారు. వినయ్ కతియార్ తాజ్ మహల్ కూడా ఒక శివాలయమే అంటున్నాడు. తాజ్ మహల్ విషయమై విద్వేషపు వ్యాఖ్యలు చేసి తర్వాత తాజ్ సందర్శించి చీపురు పట్టిన యోగీ ఆదిత్యనాథ్ వ్యవహారం మనందరికీ తెలిసిందే. ఒక్క తాజ్‌మహల్ విషయంలోనేనా, ఢిల్లీలో జామా మసీదు అసలు జమునాదేవీ మందిరమట, మొగల్ పాలకులు రాకముందు, మొగల్ పాలకులు వచ్చి హిందువులకు సంబంధించిన 6000 హిందూ మందిరాలు పడగొట్టారట. జామా మస్జిదు కట్టింది కూడా షాజహాన్. ఆయనే తాజ్ మహల్ కట్టించాడు. ఎర్రకోట కట్టించింది కూడా షాజహానే. భారత ముస్లిములను పాకిస్తానీ అని నిందించే వారిని శిక్షించే చట్టం కావాలని మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దానికి జవాబిస్తూ అసలు ముస్లిములు దేశంలో ఉండరాదని పాకిస్తాన్ పోవాలని వినయ్ కతియార్ అన్నాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రజ ల్లో చిచ్చుపెట్టే వినయ్ కతియార్ ఇంతకు ముందు ప్రియాంకా వాద్రాను ఉద్దేశించి ఆమె కన్నా అందమైన వాళ్ళు బిజెపి ప్రచారంలో ఉన్నారని చేసి న వ్యాఖ్య కూడా ఆయన వ్యక్తిత్వం ఎంత చవుకబారుదో అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అంటే బిజెపి అసలు స్వరూపాన్నే ఈ నాయకులు ప్రదర్శిస్తున్నారని అర్ధం చేసుకోవాలి.

– * వాహెద్