Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అక్రమాల పూడికలో మిషన్ కాకతీయ..!

collector

*నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
*చెరువుల పునరుద్ధరణ పేరిట నిధుల కైంకర్యం
*నత్తనడకన సాగుతున్న చెరువుల పనులు
*అసంపూర్తి పనులకే బిల్లులు పొందుతున్న వైనం
*కాంట్రాక్టర్లతో అధికారుల మిలాఖత్

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు పక్కదారి పడుతున్నాయి. అంతంత మాత్రంగానే నాసిరకంగా పనులను నిర్వహించి లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్లు మింగేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తుండగా అధికారులు సైతం వారితో కుమ్మక్కై పనులను పర్యవేక్షించకుండానే బిల్లులు చెల్లిస్తున్నారు. జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను ఇటీవల పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారిణి స్మిత సబర్వాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వెంటనే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే కాకుండా ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాల కాలంగా పూడిక తీతకు నోచుకోని చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టగా ఆశించిన మేరకు లక్షాలు నెరవేరడం లేదు. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం వలన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు. ఒక్కో చెరువు పనులను రెండు మూడు రోజుల పాటు చేపట్టి పని ముగిసిందని అధికారులుకు తెలుపుతూ లక్షలాది రూపాయల బిల్లులను స్వాహా చేస్తున్నారు. జిల్లాలో మొదటి, రెండవ, మూడవ విడత కింద చెరువుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేసినప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.

మూడవ విడత పనులకు గాను టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగడంతో పాటు సాంకేతిక పరమైన అనుమతి కాంట్రాక్టర్లకు పనుల అప్పగింత విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఫలితంగా కాంట్రాక్టర్లు నామమాత్రపు పనులు చేసి, చేతుల దులుపుకోగా బిల్లులను చెల్లించే అధికారులు సైతం చెరువుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడవ విడత కింద జిల్లాలో 140 చెరువుల పునరుద్దరణ పనులకు రూ. 34.76 కోట్ల నిధులను మంజూరు చేశారు. చెరువుల పునరుద్ధరణతోజిల్లాలో 10.059 ఎకరాల భూములకు అధనంగా సాగు నీరు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. కాగా మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని మంచిర్యాల, హజీపూర్, నస్పూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 25 చెరువుల పనులను చేపట్టారు. అదే విధంగా చెన్నూర్ సబ్ డివిజన్ పరిధిలోని చెన్నూర్, భీమారం, జైపూర్ మందమర్రి, కోటపల్లి మండలాల్లో 58 చెరువులు, బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి,భీమిని, కన్నెపల్లి, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి, తాండూర్ మండలాల్లో 56 చెరువుల పనులను ప్రారంభించారు.చెన్నూర్ సబ్ డివిజన్‌లో 6 చెరువులు, బెల్లంపల్లి సబ్ డివిజన్‌లో 12 చెరువుల పనులను మాత్రమే చేపట్టి నామమాత్రంగా పనులు నిర్వహించి, కాంట్రాక్టర్లు బిల్లులు పొందారు.  కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టినప్పటికీ వర్షపు నీరు చెరువుల్లో నిలిచే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌కాకతీయ పనులు కమీషన్ కాకతీయ పనులుగా మారాయని విపక్షాల నేతలు ఇప్పటికే పలు సార్లు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా జిల్లాల్లో చేపట్టిన మిషన్ కాకతీయ పనులపై సమగ్ర విచారణ జరిపినట్లయితే కోట్లాది రూపాయల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments