Home సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీ

మ్యూజికల్ లవ్ స్టోరీ

naa-nevve

నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్‌బ్రీజ్ సినిమాస్ పతాకంపై జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన చిత్రమిది. శరత్ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “జయేంద్ర డైరెక్ట్ చేసిన ‘180’ సినిమా చూశాను. చాలా బాగుంది. ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేయాలనగానే… జయేంద్ర లవ్‌స్టోరీస్ చేస్తారు… నేనేమో మాస్, కమర్షియల్ సినిమాలు చేస్తాను కదా అనుకున్నాను. కానీ ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ కెమెరామెన్ అని చెప్పగానే…. ఇది కలా, నిజమా అనిపించింది. ఘర్షణ, గీతాంజలి వంటి సినిమాలు చూసి ఆయనలాంటి కెమెరామెన్‌తో ఎప్పుడు వర్క్ చేస్తానోనని అనుకున్నాను. అయితే జయేంద్ర వల్ల నా కల నిజమైంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే నన్ను ఈ సినిమాలో కొత్త యాంగిల్‌లో చూపించారు.  సినిమాలో చాలా కొత్తగా కనపడతాను. శరత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. తమన్నా తప్ప మరో హీరోయిన్ ఉంటే ఈ సినిమాలో నేను నటించకపోయేవాడిని. ఇప్పటివరకు నేను చేసిన వారిలో బెస్ట్ కోస్టార్ తమన్నాయే. నేను లవ్‌స్టోరీలో నటించాలని బలంగా కోరుకుంది మహేశ్ కోనేరు. ఈ సినిమా కోసం జయేంద్ర అండ్ టీమ్‌ను నమ్మమని చెప్పి మహేశ్ నన్ను ముందుకు నడిపించారు”అని అన్నారు. తమన్నా మాట్లాడుతూ “ఇలాంటి స్పెషల్ మూవీ చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. శరత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ మంచి సాహిత్యాన్నిచ్చారు. కల్యాణ్‌రామ్ లేకుంటే ఈ సినిమా  చేసేదాన్ని కాదు”అని తెలిపారు. దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ “శరత్ వండర్‌ఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు. పాటలు విన్న వారందరూ ప్రశంసిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్  చక్కటి సాహిత్యాన్ని అందిస్తే… బృంద కొరియోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. కల్యాణ్‌రామ్ రొమాంటిక్ జోనర్‌లో ఈ సినిమా చేయడానికి కారణం నాపై తను ఉంచిన నమ్మకమే. తమన్నా ఓ కొత్త హీరోయిన్‌లా నటించింది”అని పేర్కొన్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా ప్రయాణిస్తున్నాను. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి వద్ద నా జర్నీ ప్రారంభమైంది. ఆతర్వాత ఆర్కా మీడియా, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, హరి… ఇలా అందరితో పనిచేసే అవకాశం కలిగింది. తారక్, కల్యాణ్‌రామ్, హరి సహకారం లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరాం, ఆర్.జె.వింద్య, బాబ్జీ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.