Home సినిమా నాన్నకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి బన్నీ: రామ్‌చరణ్

నాన్నకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి బన్నీ: రామ్‌చరణ్

BNNY

అల్లుఅర్జున్ హీరోగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య- ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీష, శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. బన్నీ అంకితభావం గురించి, నటన గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు నేను పెద్దగా డ్యాన్సులు చేసేవాడిని కాదు. కానీ మా ఇంట్లోవాళ్లందరినీ ఎంటర్‌టైన్ చేసే వ్యక్తి బన్నీ. తనలో చిన్నప్పటినుంచి ఆతృత ఎక్కువగా ఉండేది. మా నాన్న కూడా వాడిని చూసి నేర్చుకోరా అని అనేవారు. నాన్న ఒకసారి బన్నీని పిలిచి వీడికి డ్యాన్సు వస్తుందా, రాదా? మన పరువు తీస్తాడా? అని అంటే… ఆరోజు నాన్నకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి బన్నీ. మన దగ్గర క్రిటికల్, కమర్షియల్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ గత రెండేళ్లుగా విమర్శనాత్మక చిత్రాలు పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. నా ‘రంగస్థలం’ కూడా అలాంటి చిత్రమే. అలాంటి మరో చిత్రమే ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’. చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. నా ‘ఎవడు’ సినిమాకు రచయితగా పనిచేసిన వంశీ ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. ఒక నటుడిగా ఓ ఆర్మీ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకొని చివరికి ‘ధృవ’ సినిమా చేశాను. నా బ్రదర్ బన్నీ అలాంటి స్ఫూర్తినిచ్చే ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. బన్నీ ఇప్పటివరకు మంచి పర్‌ఫార్మర్‌గా, డాన్సర్‌గా అందరికీ తెలుసు. తను ఇంటెన్స్‌తో కూడిన పాత్రలను చేయాలని కోరుకుంటాడు. అలా చేసిన పాత్రే గోనగన్నారెడ్డి. ఆ పాత్ర నిడివి తక్కువే. ఆ పాత్రకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అలాంటి పాత్ర రెండున్నర గంటలు ఉంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమాకు ఎన్ని అవార్డులు, ప్రశంసలు వస్తాయో చూడాలి. మే 4 కోసం ప్రేక్షకులలాగే నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను”అని తెలిపారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ సినిమా పరంగా నేను ముందు థాంక్స్ చెప్పాల్సింది ఇండియన్ ఆర్మీకి. వారు సినిమా షూటింగ్ కోసం ఎంతగానో సహకరించారు. ఈ కథను నా వద్దకు తీసుకొచ్చింది నల్లమలుపు బుజ్జి. నేను అడగగానే నా కోసం కథను ఇచ్చేశారు. ఈ సినిమా లగడపాటి శ్రీధర్ చేస్తే బావుంటుందని అనుకున్నాను. ఆయన నాకు ‘స్టైల్’ సినిమా నుండి తెలుసు. ఎంతో ప్యాషన్‌తో సినిమాలు చేసే ఆయనతో ఈ సినిమా చేయాలనిపించింది. ఓ డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి… ఓ స్టార్ డైరెక్టర్ సినిమాకు ఎంత ఖర్చు పెడతారో అంతకంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు నిర్మాత శ్రీధర్. విశాల్, శేఖర్ మేం ఊహించిన దానికంటే అద్భుతమైన సంగీతాన్ని అందించారు”అని అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ “ఒక మనిషిగా కల కంటే… ఆ కలను నెరవేర్చడానికి ఎన్నో చేతులు కలిసిన తర్వాతే నేను ఇక్కడ నిలబడిగలిగాను. ఓ మంచి కథ రాసుకున్నాను. బన్నీకి ఈ కథ ఎలా చెప్పాలని అనుకుంటూ ఉంటే మా అన్న నల్లమలుపు బుజ్జి నాకు సహాయం చేశారు. ఆయనకు థాంక్స్. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులు, నా భార్యతో పాటు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు దర్శకరత్న దాసరికి థాంక్స్. ఆయన ఈ సినిమాను చూస్తారని అనుకున్నాను. కానీ ఆయన మన మధ్య లేరు. అయితే ఆయన పుట్టినరోజున సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. బన్నీ పని రాక్షసుడు. ప్రతి షాట్‌ను కష్టపడి చేస్తారు. ఆకలితో ఉన్న పులిలా కనపడతారు. నన్ను నమ్మి ఈ సినిమా కోసం భారీగా ఖర్చుచేసిన లగడపాటి శ్రీధర్, నాగబాబుకు థాంక్స్‌”అని పేర్కొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “దర్శకుడు వంశీ ఈ సినిమాను ఇంత బాగా చేస్తాడని మేం అనుకోలేదు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాడు బన్నీ. దాసరి నారాయణరావు పుట్టినరోజున సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. ఫిలిమ్ ఇండస్ట్రీ బాధపడేలా ఈమధ్య కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాలపై కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొందరు ఈ సినిమాను తప్పు దోవ పట్టించడానికో, విమర్శించడానికో ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులే దాటించాలి… దాటిస్తారు”అని అన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “ఇంత మంచి సినిమా చేసే అవకాశాన్నిచ్చిన బన్నీకి థాంక్స్. నేను చేసిన ఎవడి గోలవాడిదే, స్టైల్ సినిమాలు చూసిన బన్నీ ఓ పార్టీలో నాకు కాంప్లిమెంట్ ఇస్తే… మీలాంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తే బావుంటుందని అన్నాను. ఆ సమయంలో బన్నీ నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట కోసం అతను ఈ సినిమా చేశారు. అంతకన్నా గొప్ప అవార్డు మరొకటి లేదనిపించింది. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా ఉంటుంది. వక్కంతం వంశీ అద్భుతమైన కథతో సినిమాను చక్కగా తెరకెక్కించారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె.నాగబాబు, అర్జున్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.