Search
Saturday 17 November 2018
  • :
  • :

నాదల్, గార్సియాకు టైటిల్స్

 చైనా ఓపెన్

Tennisబీజింగ్: ప్రతిష్టాత్మకమైన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టెన్నిస్ టైటిల్స్ రఫెల్ నాదల్ (స్పెయిన్), కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్)లు దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ రఫెల్ నాదల్ 62, 61 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్గియస్‌ను చిత్తు చేశాడు. స్పెయిన్ దిగ్గజం నాదల్‌కు ఇది కెరీర్‌లో 75వ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, అమెరికా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నాదల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా ఓపెన్‌లోనూ తన జోరు కొనసాగించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన నాదల్ లక్షం దిశగా దూసుకెళ్లాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. నాదల్ ధాటికి నిక్ ఎదురు నిలువలేక పోయాడు. చెలరేగి ఆడిన నాదల్ సునాయాసంగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో కూడా నాదల్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన కూడా ఎదురు కాలేదు. అసాధారణ రీతిలో చెలరేగిన స్పెయిన్ బుల్ సెట్‌ను సొంతం చేసుకుని టైటిల్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. నాదల్‌కు కెరీర్‌లో ఇది రికార్డు స్థాయిలో 75వ టైటిల్ కావడం విశేషం.
హలెప్‌కు షాక్...
మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫ్రాన్స్ క్రీడాకారిణి కరొలిన్ గార్సియా 64, 76 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రుమేనియా)ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. గార్సియాకు ఇది వరుసగా రెండో చైనా ఓపెన్ టైటిల్ కావడం గమనార్హం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన 15వ సీడ గార్సియా అద్భుత ఆటతో వరల్డ్ నంబర్‌వన్ హలెప్‌ను మట్టి కరిపించింది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. తొలి సెట్‌లో ఒక దశలో హలెప్ ఆధిక్యంలో నిలిచింది. అయితే కీలక సమయంలో పుంజుకున్న గార్సియా మళ్లీ పైచేయి సాధించి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా గార్సియాకు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. హలెప్ అసాధారణ ఆటతో ముందుకు సాగింది. కానీ కీలక సమయంలో ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న గార్సియా 76తో సెట్‌ను గెలిచి టైటిల్ ఎగురేసుకు పోయింది. ఈ విజయంతో గార్సియా మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లోకి దూసుకెళ్లింది.

Comments

comments