Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నాదల్, షరపోవా ముందుకు

రెండో రౌండ్‌లో సిలిక్, ముగురుజా, బాంబ్రీ ఔట్, ఫ్రెంచ్ ఓపెన్

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్(స్పెయిన్) శుభారంభం చేశాడు. మూడో సీడ్ మారిన్ సిలిక్ (క్రోయేసియా), ఏడో సీడ్ కెవిన్ అండర్సన్ (సౌతాఫ్రికా) తొలి రౌండ్‌లో విజయం సాధించారు. భారత స్టార్ యూకీ బాంబ్రీ మొదటి రౌండ్‌లోనే పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ మారియా షరపోవా, మూడో మూడో సీడ్ గార్బయిన్ ముగురుజా (స్పెయిన్), సమంతా స్టోసర్ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్‌లో విజయం సాధించారు. పురుషుల విభాగంలో 16వ సీడ్ కిల్ ఎడ్మండ్, 18వ సీడ్ ఫాబియో ఫొగ్నిని (ఇటలీ) ముందంజ వేశారు. మహిళల విభాగంలో 27వ సీడ్ జాంగ్ షువాయి (చైనా), డారియా గావ్రిలొవా (రష్యా) రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
నాదల్ జోరు..

nadal

తొలి రౌండ్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ దూకుడుగా ఆడాడు. ఇటలీ ఆటగాడు సిమోన్ బొలెల్లితో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 64, 63, 76 తేడాతో విజయం సాధించాడు. ప్రారంభం నుంచే స్పెయిన్ బుల్ తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. తొలి రెండు సెట్లలో నాదల్‌కు ఎదురే లేకుండా పోయింది. దూకుడైన ఆటతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సెట్లను సొంతం చేసుకున్నాడు. కానీ, మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయినా చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన నాదల్ 76తో సెట్‌ను గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు మూడో సీడ్ మారిన్ సిలిక్ (క్రోయేసియా) తొలి రౌండ్‌లో కాస్త చెమటోడ్చి విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ డక్‌వర్త్‌తో జరిగిన పోరులో సిలిక్ 63, 75, 76తో విజయం సాధించాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన సిలిక్ తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడిన సిలిక్ టైబ్రేకర్‌లలో సెట్‌లను గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
అండర్సన్ అలవోకగా…
మరోవైపు ఏడో సీడ్ కెవిన్ అండర్సన్ (సౌతాఫ్రికా) తొలి రౌండ్‌లో సునాయాస విజయం సాధించాడు. ఇటలీ ఆటగాడు లొరెంజితో జరిగిన పోరులో అండర్సన్ 64, 62, 64తో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన కెవిన్ ఏదశలోనూ ప్రత్యరిని కోలుకోనివ్వలేదు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో 16వ సీడ్ కిల్ ఎడ్మండ్ (సౌతాఫ్రికా) విజయం సాధించాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన ఎడ్మండ్ 62, 64, 63తో ఆస్ట్రేలియా ఆటగాడు మినౌర్‌ను చిత్తు చేశాడు. ఎడ్మండ్ ధాటికి మినౌర్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశాడు.

బాంబ్రీ ఇంటికి…
భారత స్టార్ యూకి బాంబ్రీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. బెల్జియం ఆటగాడు రుబెన్ బెమెల్‌మన్స్‌తో జరిగిన పోరులో బాంబ్రీ ఓటమి చవిచూశాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన బెమెల్‌మన్స్ 64, 64, 61తో బాంబ్రీను ఓడించాడు. తొలి రెండు సెట్లలో బాంబ్రీ బాగానే ఆడాడు. ఒక దశలో ఆధిక్యంలోకి కూడా దూసుకెళ్లాడు. అయితే కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక పోయాడు. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న రు బెన్ వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
షరపోవా గెలుపు..

sharpova
మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ షరపోవా (రష్యా) రెండో రౌండ్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో షరపోవా 61, 46, 63తో నెదర్లాండ్స్ క్రీడాకారిణి హొంగెకాంప్‌ను ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న రష్యా స్టార్‌కు రెండో సెట్‌లో చుక్కెదురైంది. ప్రత్యర్థి క్రీడాకారిణి అద్భుత పోరాట పటిమను కనబరుస్తూ సెట్‌ను గెలుచుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం మళ్లీ షరపోవా ఆధిపత్యం చెలాయించింది. సెట్‌ను గెలిచి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. మరో పోటీలో మూడో సీడ్ ముగురుజా విజయం సాధించింది. రష్యా వెటరన్ స్టార్ స్వెత్లెనా కుజునెత్సొవాతో జరిగినపోరులో ముగురుజా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముగురుజా 76, 62తో కుజునెత్సొవాను ఓడించింది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ సమంతా స్టోసర్ కూడా రెండో రౌండ్‌లో ప్రవేశించింది. బెల్జియం క్రీడాకారిణి విక్‌మేయర్‌తో జరిగిన తొలి రౌండ్‌లో స్టోసర్ 62, 64తో జయకేతనం ఎగుర వేసింది. చైనా స్టార్, 27వ సీడ్ జాంగ్ కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది. స్లొవేకియా ప్లేయర్ కుకొవాతో జరిగిన మ్యాచ్‌లో జాంగ్ 60, 75తో విజయం సాధించి ముందంజ వేసింది. మరో పోటీలో 24వ సీడ్ డారియా గావ్రిలొవా (రష్యా) విజయం సాధించింది. తొలి రౌండ్‌లో డారియా 46, 76, 63తో రుమేనియా క్రీడాకారిణి సొరానా కిర్‌స్టియాను ఓడించింది.

సెరెనా గెలుపు..

serena

అమెరికా స్టార్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సెరెనా 76, 64 తేడాతో చెక్ క్రీడాకారిణి క్రిస్టియానా ప్లిస్కోవాను ఓడించింది. తొలి సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఎలాగైనా గెలవాలనే లక్షంతో ఇద్దరు ముందుకు సాగారు. ఈ క్రమంలో తొలి సెట్ టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. దీనిలో ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న సెరెనా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో సెరెనా దూకుడును మరింత పెంచింది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఆడిన ప్లి స్కోవా అనవసర తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సెరెనా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. చాలా కాలం తర్వాత మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్‌కు శ్రీకారం చుట్టిన సెరెనా గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో తొలి రౌండ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
ఎదురులేని గార్సియా…
ఏడో సీడ్ కారొలైన్ గార్సియా తొలి రౌండ్‌లో అలవోక విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి ఇంగ్ ఇంగ్‌తో జరిగిన పోరులో గార్సియా 61, 60తో జయభేరి మోగించింది. ప్రారంభం నుంచే అద్భుత షాట్లతో చెలరేగిన గార్సియా ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. దూకుడుగా ఆడుతూ రెండు సెట్లను సొంతం చేసుకుంది. మరోవైపు ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వని ఇంగ్‌ఇంగ్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

Comments

comments