Home తాజా వార్తలు నాదల్‌కు టైటిల్

నాదల్‌కు టైటిల్

nadal

మొనాకో: ప్రతిష్ఠాత్మకమైన మాంటెకార్లో మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్ రఫెల్ నాదల్ టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 63, 62 తేడాతో జపాన్ ఆశాకిరణం కి నిషికోరిను చిత్తు చేశాడు. నాదల్ ఈ టైటిల్‌ను సాధించడం 11వ సారి కావడం విశేషం. ఫైనల్లో నాదల్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. చూడచక్కని షాట్లతో అలరించిన నాదల్ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. నాదల్ ధాటికి నిషికోరి కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయాడు. అద్భుత ఆటను కనబరిచిన నాదల్ సునాయాసంగా మొదటి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, రెండో సెట్‌లో మరింత చెలరేగి పోయాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే కళ్లు చెదిరే షాట్లతో నిషికోరిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే క్రమంలో సెట్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్న నాదల్ ఇటీవలే మళ్లీ రాకెట్ చేత పట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన మాంటెకార్లో ఓపెన్‌లో టైటిల్ గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాడు. అంతేగాక టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు.