Home సినిమా నాగశౌర్యకు మంచి పేరు తెచ్చే ‘ఛలో’

నాగశౌర్యకు మంచి పేరు తెచ్చే ‘ఛలో’

Chaloనాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ ముప్పలూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముప్పలూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “నా దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు. అతను తక్కువ కాలమే పనిచేసినా… నాకు ఇష్టమైన వారిలో తను ఒకడు. తన ప్రయాణంలో నేను కూడా ఒక మజిలీ. నా మజిలీ తర్వాత తను ‘ఛలో’ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం నాకు ఆనందాన్నిచ్చే విషయం. సాయి కొర్రపాటి బ్యానర్‌తో నాగశౌర్య మొదలుపెట్టిన ప్రయాణం తన సొంత బ్యానర్ వరకు వచ్చింది. ఈ బ్యానర్‌లో అతను మరిన్ని సినిమాలు చేయాలి”అని అన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ “తెలుగు సినిమా ఇండస్ట్రీనంతా ఓ యూనివర్సిటీల భావిస్తే… అందులో త్రివిక్రమ్‌ని ప్రొఫెసర్‌గా భావిస్తాను. అటువంటి దర్శకుడి దగ్గర పనిచేయడంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఇక ఆంధ్ర, తమిళనాడు బార్డర్‌లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ‘ఛలో’. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. అక్కడ సినిమా కథ కొనసాగుతుంది. నాగశౌర్యకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమిది”అని చెప్పారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ “నేను ఎంతో ఇష్టపడే త్రివిక్రమ్ చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటారో నా బ్యానర్‌లో కూడా అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను”అని తెలిపారు. రష్మిక మండన్నా మాట్లాడుతూ “నేను కన్నడంలో ‘కిరిక్ పార్టీ’ సినిమా చేసిన తర్వాత తెలుగులో అవకాశం వచ్చిన చిత్రమిది. నాపై నమ్మకంతో అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కొర్రపాటి, శంకర్ ప్రసాద్ ముప్పలూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది.