Search
Friday 21 September 2018
  • :
  • :

పవన్‌ విమర్శించడం మంచిది కాదు

nagababu

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం పక్కదారి పట్టిందని నటుడు నాగబాబు అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో బుధవారం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది కొత్తేమీ కాదు. శ్రీరెడ్డి వ్యవహారాన్ని నేను గత నెల రోజులుగా గమనిస్తున్నాను. ఈ వివాదంలోకి సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి ఈ అంశాన్ని పక్కదారి పట్టించేశారు. ఇక ‘మా’ అసోసియేషన్‌కు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇందులోని సభ్యులందరికీ సినిమా అవకాశాలు కల్పించడం కుదరదు. ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే స్పందించి న్యాయం చేయడం జరుగుతుంది. ‘మా’ అసోసియేషన్ ఫీజు కింద లక్ష రూపాయలను తీసుకుంటోంది. ఎవరికీ సభ్యత్వం ఉచితంగా ఇవ్వరు. ఎందుకంటే ‘మా’ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ఇక సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా ఆడవారిని ప్రలోభపెట్టే పనులు చేసినట్లు నా దృష్టికి వస్తే వాడి చెంప పగులగొడతాను. ఇద్దరు, ముగ్గురికి నా నుంచి ఇలాంటి అనుభవం ఎదురైంది. సినీ రంగంలో 90 శాతం మంచి వాళ్లు ఉంటే, 10 శాతం చెడ్డవాళ్లు ఉన్నారు. చెడ్డవాళ్లను చూసి అందరూ అలాంటి వాళ్లే అన్న అభిప్రాయం సరికాదు. చిత్ర పరిశ్రమపై గౌరవం ఉంది కాబట్టే నా కూతురిని హీరోయిన్‌గా చేశాను. ఇక ఈ వ్యవహారంలోకి మెగా ఫ్యామిలీని లాగొద్దు. పవన్‌కల్యాణ్‌ను కావాలనే ఇరికించాలని చూస్తున్నారు. స్టార్ హీరోగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ సినిమాలను వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటి వ్యక్తిని విమర్శించడం మంచిది కాదు. మా కుటుంబ సభ్యులను ఈ వ్యవహారంలోకి లాగాలని చూస్తే తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి”అని అన్నారు. ఈ సమావేశంలో శ్రీకాంత్, హేమ తదతరులు పాల్గొన్నారు.
మాధవీలత మౌన దీక్ష… పవన్‌కళ్యాణ్ మీద శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ తల్లిని దూషించేలా ఆమె మాట్లాడటం సమర్థనీయం కాదని పేర్కొంది. పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా మాధవీలత హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ వద్ద బుధవారం మౌన దీక్షకు దిగింది. ఆమెకు కొందరు సంఘీభావం ప్రకటించారు. కొంత సేపటికి పోలీసులు అక్కడికి చేరుకొని దీక్ష ఆపించి మాధవీలతను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Comments

comments