Home రాష్ట్ర వార్తలు మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు నాగం శిఖండి – మంత్రి హరీశ్‌రావు

మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు నాగం శిఖండి – మంత్రి హరీశ్‌రావు

                  Harish-Rao

హైదరాబాద్ : బిజెపి నేత నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను అడ్డుకుంటున్న శిఖండిలా తయారయ్యాడని నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపి బాల్క సుమన్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి నాగం కొత్తగా ఏమీ చెప్పలేదని, గతంలో ఈ అంశంపై హైకోర్టు ఆయనకు మొట్టికాయలు వేసినా జ్ఞానోదయం కాలేదన్నారు. గత ఎన్నికల్లో నాగం, ఆయన కొడుకు ఓడిపోవడంతో అక్రోశంతో అడుగడుగునా ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నాడని ధ్వజమెత్తారు.

అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో, ఏ స్థానంలో ఉన్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాదని, ఆయనకు మతిభ్రమించిందని అన్నారు. గతంలో కొద్ది రోజులు బిజెపి కార్యాల యంలోనే ఆయనను మాట్లాడనీయలేదని, ఏదో సమితి పేరుతో బైట ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టాడని చెప్పారు. గొల్ల కుర్మలు, మత్సకా రుల ఆర్థిక స్వావలంభనానికి ప్రభుత్వం గొర్రెలు, చేపలు ఇస్తుంటే, నాగం పందులు, నక్కలు, కుక్కలు అని హీనంగా మాట్లాడారని మండిపడ్డారు. అది బిజెపి అధికారిక విధానమా? నాగం వ్యక్తిగత అభిప్రాయమా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ స్పష్టం చేయాలని, దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గొర్రెల పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యాదవులే అభినందిస్తూ లేఖలు, మెయిల్స్ పంపుతుంటే బిజెపి నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకొని అవాకులు చెవాకులు పేలుతు న్నారన్నారు.

అమిత్ షా వ్యవహారంలో బిజెపి కుడితిలో పడ్డ ఎలుకగా మారడంతో అక్కసుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకం గా వ్యవహరిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన ఇపిసి విధానాన్ని రద్దు చేశామని హరీశ్ రావు తెలిపారు. ఒక్క రూపాయి కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకుండా పని చేస్తేనే బిల్లు లు చెల్లిస్తున్నామని వివరించారు. పాలమూరులో ప్రాజెక్టులను తామే మొదలుపెట్టామని చెప్పుకుంటున్న టిడిపి, కాంగ్రెస్‌ల హయాంలో పట్టు మని పదివేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని చెప్పారు.

కాంగ్రెస్, టిడిపి పొత్తు మాకే మంచిది : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పినట్లు టిడిపి, కాంగ్రెస్ పొత్తు ఉంటే తమ నెత్తి మీద పాలు పోసినట్లేనని హరీశ్‌రావు ఒక ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని, టిడిపి తెలంగాణ ద్రోహుల పార్టీ అని, చివరి వరకు తెలంగాణను అడ్డుకున్న పార్టీ అని చెప్పారు.