Home నాగర్ కర్నూల్ గ్రామ సర్పంచ్ ఎన్నికల క్షేత్రంలో టిఆర్‌ఎస్ సత్తా

గ్రామ సర్పంచ్ ఎన్నికల క్షేత్రంలో టిఆర్‌ఎస్ సత్తా

Village Sarpanch election

 

నాగర్‌కర్నూల్ జిల్లాలో మెజార్టీ ఏకగ్రీవ స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ

మొదటి విడతలో 37 స్థానాలు ఏకగ్రీవం

మరిన్ని స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమాలో టిఆర్‌ఎస్ శ్రేణులు

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్: జిల్లాలో మొదటి విడతలో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలను అధికార టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 453 సర్పంచ్ స్థానాలకు గాను మొదటి విడతలో 161 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన మొదటి విడత నామినేషన్ల పర్వం, ఉపసంహారణల నాటికి మొ త్తం 37 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో ఇప్పటికి ఒకటి రెండు మినహా అన్ని స్థానాలను టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో విడతలో 141 గ్రామపంచాయతీలకు గాను 821మం ది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం స్క్రూట్నీ , మంగళవా రం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇదిలా ఉండగా మెజార్టీ సర్పంచ్ స్థానాలను టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించుకోవాలన్న సంకల్పంతో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు. స్థానిక సంస్థల్లో తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధిస్తే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందన్న ధీమాలో పార్టీ నాయకత్వం ఉంది.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు జిల్లాలో మెజార్టీ స్థానాలను టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకోగా మూడువిడతల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకునే వీలుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికి గ్రామాలల్లో వివిధ పార్టీల మధ్య పోటీలేదని అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆశావాహుల మధ్యే తీవ్రంగా పోటీ నెలకొందని చెప్పవచ్చు. అనేక గ్రామాలల్లో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పవనాలు వీస్తుండటంతో కాంగ్రెస్, బిజెపి ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో నిలబడే సాహసం చేయడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లికృష్ణారావు గ్రామ గ్రామానికి తిరుగుతూ టిఆర్‌ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను ఖరారుచేస్తూ వారి విజయానికి కృషిచేస్తున్నారు.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్‌యాదవ్‌ల ఆధ్వర్యంలో స్థానిక సాయిగార్డెన్ ఫంక్షన్‌హాలులో సర్పంచ్ అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతికార్యకర్త టిఆర్‌ఎస్ బలపర్చినఅభ్యర్థుల విజయానికి కృషిచేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అచ్చంపేట , కల్వకుర్తి నియోజకవర్గాలలో సైతం టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యేలు , పార్టీ నాయకులు కృషిచేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తాను చాటితే రాబోయే సహకార ఎన్నికలు , ఎంపి ఎన్నికలలో విజయం నల్లేరుపై నడకగా మారుతోందన్న సంకల్పంతో ఈ ఎన్నికలను టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించి ముందుకు సాగుతోంది. టిఆర్‌ఎస్ పార్టీ , ఎమ్మెల్యేల కృషి చూస్తుంటే సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

Nagar Kurnool district is Unanimity in village Sarpanch election