Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ అంటే ప్రతిపక్షాలకు దడ : నాయిని

టిఆర్‌ఎస్ అంటే ప్రతిపక్షాలకు దడ : నాయిని

NAINI

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ అన్నా, టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నా ప్రతిపక్షాలకు దడ పుడుతోందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని విపక్షాలు చూస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాల వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ధర్నా చౌక్‌ను ఇందిరాపార్కు వద్ద నుంచి తరలించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. ధర్నాచౌక్ వద్ద సోమవారం ఆందోళన చెలరేగి లాఠీ ఛార్జికీ దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్షాలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారని, అయితే సిపిఎం, సిపిఐ నాయకులు స్థానిక ప్రజలపై దాడి చేశారని నాయిని ఆరోపించారు. ప్రజలు తమ వెంటలేరని ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా కమ్యూనిస్టులు తమ ఉనికిని నిలుపుకునే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు ప్రభుత్వమిచ్చే విద్యుత్, ఎరువులకు ఆర్థికసాయం చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే వారు తమ ఉనికిని నిలుపుకునేందుకు ఏదో ఒక వంకతో ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు