Home తాజా వార్తలు ఈ నెలాఖరుకు మంత్రివర్గం?

ఈ నెలాఖరుకు మంత్రివర్గం?

Naini Visited the Tirumala Temple

 

హైదరాబాద్ : ఈ నెలాఖరులోపు మంత్రివర్గం ఏర్పాటు కావచ్చని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించడంతో ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కెసిఆర్ శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకున్న తర్వాత నాయిని నర్సింహారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కెసిఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారని, హోం మంత్రిగా మహమూద్ ఆలీ బాధ్యతలు తీసుకున్నారని, ఈ నెల చివరలో మంత్రివర్గం ఏర్పాటవుతుందని అన్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిని ప్రజలు విశ్వసించలేదని, నాలుగేళ్లళో కెసిఆర్ అమలుచేసిన అభివృద్ధివైపే ప్రజలు నిలిచి మరోమారు టిఆర్‌ఎస్‌కు ఆశీర్వదించారని అన్నారు. ఈ నెల 28 లేదా 30 తేదీల్లో పాక్షిక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో మాజీ మంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

గత మంత్రివర్గంలో ఉన్నవారిలో ఎంతమందికి ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వాలనేదానిపై ఇంకా స్పష్టత లేదన్న పార్టీ వర్గాలు తప్పనిసరిగా కొత్తవారికి కనీసంగా ఏడెనిమిది మందికి అవకాశం ఉండవచ్చని వ్యాఖ్యానించాయి. వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులకు ఈసారి అవకాశం లభించవచ్చని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గత వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన పలు సమీక్షా సమావేశాల్లో వీరు పాలుపంచుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నందున ఒకటి రెండురోజుల్లో హైదరాబాద్ చేరుకున్న తర్వాత గవర్నర్‌ను కలుస్తారని, ఆ తర్వాత మంత్రివర్గ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని పార్టీ నాయకుడొకరు తెలిపారు.

ఈ నెల 28 లేదా 30వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఆ తర్వాత జనవరి 4వ తేదీ కూడా మంచి రోజేనని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరుకల్లా మంత్రివర్గం ఉండొచ్చని నాయిని వ్యాఖ్యానించిన నేపథ్యంలో 30వ తేదీన ఆ కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తాజా ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి పార్టీ వర్గాలు ప్రస్తావిస్తూ, జనవరి మొదటి వారంలో ఉండవచ్చని, ఆ సమావేశాల తర్వాత మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ చర్చలపై ఎక్కువ సమయాన్ని కెసిఆర్ కేటాయించనున్నందున అప్పటికల్లా మంత్రివర్గం ఏర్పాటు, బాధ్యతల అప్పగింత (పోర్టుఫోలియో) పూర్తవుతుందని తెలిసింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కానున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

Naini Narasimha Reddy Speaks with media at Tirumala