Home దునియా నయన మనోహరం నైనిటాల్

నయన మనోహరం నైనిటాల్

Kerala

నయనాదేవిగా పూజలందుకుంటున్న పార్వతీ మాత కొలువుదీరిన హిమానీ ప్రాంతం నైనిటాల్. తాలాబ్ షహర్‌గా విఖ్యాతి పొందిన ఈ పట్టణంలో ఎటుచూసినా నయనమనోహరమైన సరస్సులు అనేకం కనిపిస్తాయి. చల్లని నీటితో హాయిగా, తీయగా దాహార్తిని తీర్చి అత్యుత్తమ ఆతిథ్యానికి  మచ్చుతునకలా నిలుస్తోంది నైనిటాల్. నైని అంటే కన్ను, తాల్ అంటే తాలాబ్ అంటే సరస్సు అని అర్థం. కుమావొన్ హిల్స్‌లో నేత్రరూపంలో నేత్రపర్వంగా కనిపించే సరస్సుల వల్ల, పర్వత పంక్తులవల్ల ఈ ప్రాంతాన్ని నైనితాల్ అంటున్నారు. ఈ కుమావొన్ పర్వత ప్రాంతం సముద్రమట్టానికి 6,837 అడుగుల ఎత్తున ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం ఏ కాలం లోనైనా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతమంతా సమున్నతమైన పర్వతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రధాన పర్వత శిఖరం నైనా శిఖరం సముద్ర మట్టానికి 8,759 అడుగుల ఎత్తులో ఉంది. దీన్నే చైనా శిఖరం అని కూడా అంటారు. అలాగే పడమటి దిక్కున ఉన్న డియోపద శిఖరం 7,999 అడుగుల ఎత్తున, దక్షిణ దిక్కున 6,837 అడుగుల ఎత్తున ఆయర్పద శిఖరం నిలిచి ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి? 

హైదరాబాద్ నుంచి నైనిటాల్‌కు 1,637కి.మీ దూరం. ఇక్కడికి చేరుకోడానికి నేరుగా రైళ్ళుగానీ, విమా నాలుకానీ, బస్సులుగానీ లేవు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వస్తే అక్కడి నుంచి బస్సులో నైనిటాల్‌కు చేరుకోవచ్చు. రైల్లో చేరుకోవాలనుకునే వారు ఢిల్లీకి మొదలు చేరుకుని అక్కడి నుంచి బస్సులో నైనిటాల్‌కు చేరుకోవచ్చు.

స్క ంద పురాణంలో మానసఖండ్‌లో ఈ నైనిటాల్ ప్రస్తావన ఉంది. అత్రి, పులస్త, పులహ అనే ముగ్గురు రుషులు దప్పితీర్చుకోడానికి ఇక్కడ ఒక నీటి చెలమను తవ్వారని, అది నయనాకారంలో ఒక సరసుగా రూపుదిద్దుకుందని ఆ పురాణం చెబుతోంది. అయితే ఇక్కడ నీరు దొరకకపోతే మానససరోవరం నుంచి నీటిని రప్పించి ఈ సరసును నింపారని పురాణం చెబుతోంది. అందువల్ల ఈ సరసులో స్నానం చేయడం పరమ పుణ్యప్రదం అని భక్తులు భావిస్తుంటారు. ఈ సరసు ఉత్తరపు కోనను మల్లితాల్ అనీ, దక్షిణపు కోనను తల్లితాల్ అనీ పిలుస్తారు. ఈ మల్లితాల్ దగ్గర బారాబజార్ ఉంటుంది. ఇక్కడ రకరకాల క్యాండిల్స్, కేన్‌స్టిక్స్, ఇతరత్రా వస్తువులు ఉంటాయి. ఇక్కడ అనేక రెస్టారెంట్‌లు ఉంటాయి. నానారకాల రెస్టారెంట్లు ఉంటాయి. మంచి రుచికరమైన ఆహారానికి ఇవి పెట్టింది పేరు. ఈ నైనితాల్‌కు సమీపంలో నకూచియాతాల్, కృపాతాల్, సరియతాల్, భీమ్‌తాల్, సరస్సులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సరసులలోకెల్లా అత్యంత లోతైన సరసు భీమ్‌తాల్. వీటి తర్వాత చూడదగ్గది ఘోరకల్. ఘోరకల్ అంటే గుర్రాల నీటి మడుగు అని అర్థం. ఈ పరిసరాలలోనే సైనిక పాఠశాల, అరబిందో ఆశ్రమం ఉన్నాయి.

ఇక్కడే సతీదేవి ఎడమకన్ను పడిందని అందువల్ల ఇక్కడ పూజలందుకునే అమ్మవారికి నయనాదేవి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 1880లో ఈ కొండలలో 40గంటలపాటు ఎడతెరిపిలేకుండా భారీవర్షం కురిసి కొండచరియలు విరిగిపడి 151 మంది సజీవ సమాధి అయ్యారు. దీన్ని గ్రేట్‌స్లిప్‌గా చరిత్ర పేర్కొంది. ఇంతటి పెను విపత్తు మళ్ళీ జరగలేదు. ఆ ఘోరసంఘటనలో నైనాదేవి ఆలయంతో సహా పలు నిర్మాణాలు నామరూపాలు లేకుండా పోయాయి. తర్వాతి కాలంలో నైనాదేవి ఆలయాన్ని తిరిగి నిర్మించారు. ఈ గుడిలో ఉండే రావిచెట్టు నింగికి నేలకు నిచ్చెనవేసినట్టుగా ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ నైనాదేవి ఆలయంతోపాటే హనుమాన్‌ఘర్ కూడా దర్శించదగ్గ ఆలయం. ఈ గుడిలో ఉండే ఆంజనేయుడు మనసులో రాముని తలచుకుంటూ నయనధారలతో భక్తి ముద్రలో ఉంటాడు. ఇక్కడ ఉన్న సైంట్‌జాన్ చర్చ్ కూడా చూడదగిన పురాతన నిర్మాణం. 1839లో బ్రిటిష్ వ్యాపారి బారన్ అనేవాడు ఇక్కడ యురోపియన్ కాలనీ నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతంలో ఇదే మొట్టమొదటి నిర్మాణం. తెల్లదొరలకు ఈ ప్రాంతం వేసవి విడిదిగా ఉండేది. ఇక్కడ ఉన్న గవర్నర్ హౌస్ కూడా చూసి తీరాల్సిన భవనం. 113 గదులు, స్విమ్మింగ్‌పూల్, గొల్ఫ్ లింక్‌లు అబ్బురపరిచేవిగా ఉంటాయి. ఈ భవనాన్ని మరో బకింగ్‌హాం ప్యాలస్‌గా చెప్పుకుంటారు.

నైని శిఖరం చేరాలంటే గుర్రంపై వెళ్ళాలి. ఇక్కడికి చేరే వారిని టిపిన్‌టాప్ ప్రాంతం కట్టిపడేస్తుంది. దీన్నే డొరొతి సీట్ అని కూడా పిలుస్తారు. డొరొతి అనేది ఒక ఇంగ్లీషు ఆర్టిస్ట్ భార్య పేరు. ఈమె విమాన ప్రమాదంలో మరణించినందున ఆమె జ్ఞాపకార్థం ఈ డొరొతిసీట్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడే పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకర్షించే ఇకొకేవ్ గార్డెన్ ఉంది. పారాగ్లైడింగ్, బోట్ హౌస్‌క్లబ్ మరో ఆకర్షణ. ఇక్కడ జరిగే యాచింగ్ చూడడానికి,పాల్గొనడానికి ఎందరో ఔత్సాహికులు ఉర్రూతలూగుతుంటారు. ఇక్కడ ఉన్న కొండ ప్రాంతాలలో ట్రెకింగ్ చేయడానికి సదుపాయాలున్నాయి. ఆసక్తిగలవారు వాటిని వినియోగించుకోవచ్చు. సైన్స్ మీద ఆసక్తి ఉన్న వారిని గట్టిగా ఆకర్షించేది ఆర్యభట్ట రీసెర్చి ఇనిస్టిట్యూట్.

ఇక్కడ ఉన్న పర్యాటక ఆకర్షణలలో మొదటగా చెప్పుకోవాల్సింది ఖర్పతాల్ లేక్. ఈ ప్రాంతాన్ని ల్యాండ్ ఎండ్ ప్రదేశం అని పిలుస్తారు. ఇక్కడి ఆకుపచ్చని శోభకుతోడు పరిసరాలలో నిండి ఉన్న కొండలు, కోనలు, కనుమలు హృదయాన్ని ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతానికి చేరడానికి రోప్‌వే ఉంది. 705 మీటర్ల దూరం కవర్ చేస్తుంది. 300 మీటర్ల ఎత్తున ఈ ప్రయాణం సాగుతుంది. 12 మందిని తీసుకువెళ్ళే ఈ కార్ సెకనుకు 6 మీటర్ల దూరం కదులుతుంది. అద్భుతాలు చూడాలంటే ఈ రోప్‌వేలో ఒకసారి ప్రయాణించాలి.

చక్కని వనసౌందర్యంతో మనసును దోచే మరో ప్రాంతం కిల్‌బరీ. ఇక్కడ ఓక్, పైన్, రోడోడెండ్రాన్ అడవులు మనసుకు పండగచేస్తాయి. ఈ అడవులలో 580 జాతులకు పైగా వృక్షజాతులు ఉన్నాయి. రంగురంగుల పక్షులు కిలకిలా రావాలు చేస్తూ వీనులవిందు చేస్తాయి. ఆహ్లాదాన్ని ఇనుమడింపజేస్తాయి. సముద్రమట్టానికి 2,481 అడుగుల ఎత్తున ఉన్న లరిఅకంత ప్రాంతం కూడా పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. హిమాలయాల అందాలు చూడడానికి ఇదో గొప్ప అవకాశం. పర్యావరణ ప్రేమికులను మురిపించే మరో సుందర ప్రదేశం పాన్గట్ గ్రామం. ఇది గౌనోహిల్స్‌లో ఉంది. ఇదొక అడవి గ్రామం. దట్టమైన వనాలు, రంగురంగుల పక్షులు అలరిస్తుంటాయి.

నైనిటాల్ టౌన్‌కు 2.5 కి.మీ. దూరంలో స్నో వ్యూ ఏరియా ఉంటుంది. ఇక్కడికి చేరడానికి కూడా రోప్‌వే ఉంది. షేర్ కా దండ అనే కొండ మీద ఈ వ్యూ పాయింట్ ఉంది. పర్యాటకులను బాగా ఆకర్షించే ఇకోగుహ గార్డెన్ తప్పక చూడదగ్గది. ఇవి సహజంగా ఏర్పడిన ఆరు అండర్‌గ్రౌండ్ గుహలు. ఈ గుహలను కలిపే మార్గాలు బాగా ఇరుకుగా ఉంటాయి. కొన్నిచోట్ల పాకితే తప్ప లోనికి చేరుకునే పరిస్థితి ఉండదు. గుర్నీహౌస్ కూడా చూడాల్సిన ప్రదేశం. నైనిటాల్ పర్యటనకు ఎప్పుడైనా వీలుగానే ఉంటుంది. సహజంగానే చల్లనైన ప్రాంతం కావడం వల్ల వేసవిలో ఇక్కడికి వెళితే మన ఊళ్ళో ఉన్న వేడిని తప్పించుకోవచ్చు. నాలుగురోజులు చల్లగా హాయిగా గడిపిరావచ్చు.