Home ఆఫ్ బీట్ 85-సంధియుగపు తండ్రులు

85-సంధియుగపు తండ్రులు

Taatalu-Cheppina-Kathaluలక్ష్మా రెడ్డి నాకు జిక్రి దోస్త్. మా ఊరయినె. సిట్టపుకాపోల్లు. గాల్లుతండ్రుల కాలంల అయ్యలని పేరు వెట్టుకునెటోల్లు. గీల్ల కాలంకచ్చె వరకు రెడ్లని వెట్టుకుంటడ్రు. ఒక్క మున్నూరు కాపోల్లు తప్ప మోటాటి, చిటాటి, గోనె ఇంకా అందరు కాపులు రెడ్లే అన్నట్లు. గీల్లంత ఎఫ్సీలల్లనే ఉన్నరు. గీ కులాలోల్లను ఎనుకట పట్టేండ్లందురు. గని రెడ్లనకపోదురు. ఒక్క చౌదరి కాపోల్లనే రెడ్లందురు. గసోంటి చౌదరోల్లు గూడ మా ఊల్లుండిరి. గీ చౌదరి రెడ్లను దొరలని, మిగతా కాపోల్లను పటేండ్లని అనెటోల్లు. రెడ్డి బక్కవడితె కాపు, కాపు బలిత్తె రెడ్డని అంటరు గద. గట్లనే గీల్లందరు రెడ్లయిండ్రు. గిట్ల రెడ్లయిన కాపోల్లంత మస్తు కష్టపడెటోల్లు. ఎవుసం జేసెటోల్లు. పాలేర్లున్నా ఆడిమొగ ఆల్లతోని, కైకిలోల్లతోని సమానంగ పన్జేసెటోల్లు. గట్ల కష్టపడి సెమటోడ్చి పైకచ్చినోలేఉ్ల గీల్లు. గట్లనే లకా్ష్మరెడ్డి తండ్రి తను కష్టపడుకుంట కొడుకుం జదివిచ్చిండు. గయినె నౌకరికోసురం బగ్గ తిప్పలు వడ్డడు. ఎట్లయితేంది దొరికిచ్చుకున్నడు. ఎల్‌ఐసీల ఆఫీసరయి మాలేషుట సంపాయించుకున్నడు. గిప్పుడయినె తాతయిండు. ఆరాంగున్నడు. గయినె దగ్గెరికి నేనోపారి పోతి. ఒక్కసారే పోయిన్నంటే గదేం గాదు మస్తుసార్ల గయినె మాయింటి కచ్చిండు. నేను గయినింటికి పెయిన. గా సారి పొయ్యినప్పుడు జరిగిన సంగతి గిది. అంటె గిది నా దోస్త్ లక్ష్మా రెడ్డి సెప్పిన కతన్నట్టు. గప్పుడు నేను గయినె దగ్గెరికి పెయినప్పుడు మా ఊరయినే ఒగయినె గయినె దగ్గరికచ్చె. మాటమీద మాటచ్చె. నీ యమ్మ ఊళ్ళె పోరగాండ్లను మందలియ్యవాటం లేదు. పెద్దంతురం చిన్నంతురం లేకుంట ఉరుకులాడుతండ్రు. ఛీనీయవ్వ గిట్లెప్పుడన్న ఉండెనా? మనూల్లె ఐదారుగురు పోరగాండ్లు గదేదో లవ్వు లగ్గమని సేసుకుండ్రి. ప్రేమించి లగ్గంజేసుకునుడట. కులంలేదు, మతం లేదు, అంతురాల్లేవు. మనసుకునచ్చిన పోరిని పట్టుకొని సెంగోబిల్లన్రి. మనసోంటి అవ్వయ్యల్లేమొ కొట్టుక సావట్రి. అటుకక్కలేక గిటు మింగలేక ఒత్తుకసచ్చుడు గావట్టె. ఎంతయిన ఊరుకు గురిమరియాద లేకుంటయింది. గిదేమన్న మంచిగున్నదా. గిట్లయితేమన్నట్టు? గా మాటలిన్నంక మాకంత ఎట్లనో అనిపిచ్చింది గని నాకయితె గండ్ల తప్పేం లేదనిపిచ్చె. ఎందుకంటె గట్ల ప్రేమ పెండ్లిల్లని సేసుకునుడు మనకు పురాణాల కాలం నుండే ఉండె. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎట్ల లగ్గం జేసుకున్నడు. మహాభారతంల భీష్ముడు తన తమ్ముల్లకు పిల్లలను ఎత్తుకచ్చి సెయ్యలేదా? గిట్ల ఎన్నో కతలుండె. వశిష్టుడు అరుంధతనే మాదిగ పిల్లను సేసుకునే. జాంభవతి గిరిజన పిల్లగద. నర్శిమ్మసామి చెంచులక్ష్మిని సేసుకునే. గివ్వన్ని బాగోతులాడై సూత్తిమి. మల్ల నేను ఎప్సీఐల ఉన్నప్పుడు వయసులున్నప్పుడు మస్తు లవ్వు మ్యారేజిలయినయి. గదేమాట నేనన్న.
గా సంగుతులు వేరు. గాల్లు దేవతలు. గాల్లతోని మనంపోల్సుకుంటె ఐతదా? గా లవ్వు పేర్తోని జరిగే లగ్గాలల్ల ఎన్ని తిప్పలున్నయి. గా పోరగాండ్లు ఆటుగాకుంట ఇటుగాకుంట కావట్రి అన్నడు గౌండ్లయినె. ఎట్ల లగ్గం జేసుకున్నా కొన్ని లగ్గాలు మంచిగనే ఉండి కలకాలం నిలుత్తయి. ఎన్ని ముహూర్తాలు, కులం మతం అన్ని జూసి జేసినా కొన్నిపేలయితయి. వయసు ముమ్మిరితోని మీదిమీది మురిపెంతోని సేసుకున్న లగ్గాలు పేలయితయి. ఒగలనొగలు అరుతం సేసుకొని సేసుకుంటె గా సంగతి వేరు. ఎండ్లున్న కట్టాలు అండ్లున్నయి పటు.. అన్నడు లచ్మారెడ్డి. అంటె ప్రేమల పేరుతోని పోరగాండ్లు ఎవ్వలను వడితాల్లను సేసుకొమ్మంటవా లచ్మారెడ్డి పటేల. భలేటోనివున్నవు. గది తల్లిదండ్రుల కెంత నరుకయాతనం ఇరువయైదేండ్లు పెంచిన పెద్ద జేసిన పోరో, పోరడో తల్లిదండ్రుల కాదని ఎవ్వలనో ఎత్తుకపోతే గది ప్రేమ పెండ్లన్నట్టా? మరి తల్లిదండ్రులెంత బాధపడ్తున్నరో సూడద్దా?
నర్సగౌడా! నువ్వన్నది కాదంటలేను. గది తల్లిదండ్రులకు కడుపుకోతే. అయితే తల్లిదండ్రులు గూడ పోరగాండ్ల మనసు తెల్సుకోకుండ్ర మ్యానదనో ఇంకేదనో ఫలానిదాన్నే సేసుకొమ్మని బలువంతం జెయ్యద్దు. కట్నం కోసురం పట్టువట్టద్దు. పోరగాండ్లు గూడ తల్లిదండ్రులను కాదని ఆల్లు ఒప్పుకోకుండ సేసుకోకుంటెనే మంచిది. సముజాయించి ఒప్పియ్యాలె. కొంచెం ఓపికవట్టాలె. కనిపెంచిన తల్లిదండ్రులను బాధపెట్టద్దు. అస్సలే ఒప్పుకోకుంటె గా సంగతి వేరు. గసోంటి లగ్గాలల్ల ఇద్దరిది బాధ్యతున్నది అన్ననేను.
సరెగని లచ్మరెడ్డి పటేల గిప్పుడే గిసోంటి లగ్గాలు ఎక్వ ఎందుకైతున్నయని? ఎందుకైతున్నయంటె ఏంజెప్పుడు. గా సినిమాలు జూసుడెక్వాయె. ప్రేమ పేరుమీన ఎత్తుకపోయ్యి సేసుకునే సినిమాలాయె. కాలేజీలల్ల మీసంకట్టురాని పోరడు, పోరగాండ్లు ప్రేమ పేరుమీనఅచ్చే సినిమాలతోని ఆకర్షణ పొందిరి. ఎంతయిన గిది సంధియుగం. మనసొంటోల్లు సంధియుగపు తల్లిదండ్రులం. మన తరమోల్లమే గిసోంటియి ఎక్వ ఎదుర్కుంటున్నం. అటుమింగలేక ఇటు కక్కలేక కొట్టుకసత్తున్నం. ససంత్ర మచ్చినంక సదువుకున్న మొదటితరపు తల్లిదండ్రుల సంగతి రోల్లు వొయ్యి మద్దెలతోని సెప్పుకున్నట్టే ఉంది. రోలుకు ఒక్కదిక్కయితె మద్దెలకు రొండు దిక్కుల వాయింపే గద! గిదీ కత అన్నమోలె భలేమాటన్నవు లచ్మరెడ్డి. సంధి యుగపు తల్లిదండ్రులన్నవు. గదేందో సెప్పు అని నేనంటి. గప్పుడు లచ్మరెడ్డి గిట్ల కత జెప్పవట్టె.
నర్సగౌడా! మల్లన్నా! మనమంత అంటె మనవయిసోల్లు ససంత్రం వచ్చిన సమీపకాలంల పుట్టినోల్లం. మున్నాలుగేండ్లు అటు ఇటుగ మనం సమాన వయసున్నోల్లం. గప్పటి వరకు మనూల్లెనయిన, మన తెలంగాణలయిన లేకుంటె దేశంలయిన సదువుకున్నోల్లు సాసతక్కువ. అంటె మనం ససంత్రం తర్వాత పుట్టిన మొదటి తరం సదువుకున్నోల్లమన్నట్టు. మన అవ్వయ్యలకు సదువుల్లేవు. మన తాతలు ఇంకా ఎడ్డికాలం మనుషులు. మనల్నే సదువుకున్నోల్లు, తెలివి కల్లోల్లంటరు.
మనమీన మన తల్లిదండ్రులెన్నో ఆశలుండె. మనం సదువుకుంటానికి ఓ తీరుగ బతుకుటానికి తెలివికచ్చుటానికి ఎన్నో కష్టాలు పడవల్సి వచ్చింది. మనం బడికి పెయిన కొత్తల మనూల్లె సర్కారు బడే లేకుండె. కానిగిరి బడుండె. అటెనుకు సర్కారు బల్లచ్చె. అయినా మనం కిలోమీటర్ల కొద్ది నడువవలసచ్చె. మోటలు కొట్టుకుంట, నాగలి దున్నుకుంట పనులు జేసుకుంట సదువుకున్నం మనం. మరి మనకు లగ్గాలాయె.
ఇంతంత అక్షరం ముక్కచ్చిన పిల్లనే సేసుకోవాలనుకుంటిమి. కొందరికి దొరికె. కొందరికి దొరుకకపాయె. మనకు చిన్నయో గిన్నయో నౌకర్లచ్చె. మన పెండ్లాలు కొంచె తెల్లగుంటె తెల్ల బట్టలతోనుండిరి. గది జూసి మన అవ్వయ్యలు ఆడిబిడ్డలు ఆల్ల నడువల జవుడాలు. తరాల అంతరాలు. ఆల్లకు పడకపోవుడు. కోడండ్లు సుఖపడ్తండ్రదని అత్తలు, పైసలు తల్లిదండ్రులకిత్తండని మన పెండ్లాలు. అత్తకోడండ్ల రంపాట్కాలు. గిట్ల లొల్లిలొల్లి. ఇద్దరి నడుమ మనం నలిగిపోవుడు. అటు పెండ్లాలు, ఇటు తల్లులు. తల్లా పెల్లామా గివ్వి ప్రశ్నలు. అటెనుక పిల్లల గంటిమి. మన కష్టాలు ఆల్లకు తెలువకుంట పెంచితిమి. మంచిగ సదివిత్తిమి. మన కెన్నితీర్ల ఇబ్బందులున్నా ఓర్సుకుంటి.
మన పోరగాండ్లను సుఖంగ ఏం తెల్వకుంట పెంచితిమి. ఏ తల్లిదండ్రులకైన తను పడ్డ కష్టాలు పిల్లలు పడద్దని ఉంటది గద! గట్ల పెంచుతె మన పోరగాండ్లు పౌల్ట్రిని కోడిపిల్లలోలె పెరిగిరి. మన బాధలు తెలువక పాయె. మనం తెలువనియ్యకపోతిమి. కులాలతోనచ్చే కష్టాలు, బేధాలు తెలువనియ్యకపోతిమి. మన తరమోల్లదెట్లున్నదంటె అటు పాతతరం. తల్లిదండ్రులు మన వరకు ఎలక్ట్రానిక్ యుగమైంది. ప్రపంచీకరణ మచ్చింది. అంత గందురగోలమైంది. మనకు రేడియో వినుడే ఎక్వ అయితే మా పోరగాండ్లు పెరిగే వరకు సెల్లుల దాకచ్చింది. మనమే అటు ఆ తరమోల్లను, ఇటు ఈ తరమోల్లకు జవాములు చెప్పవల్సచ్చింది. ఇటు పోరగాండ్లను ఆపలేం.
గటు మన పెద్దోల్లను సముదాయించలేం. పోరగాండ్లు సేత్తున్న గిసోంటి పనులు మంచియో, సెడ్డయో తెల్సుకోలని పరిస్థితి. గట్లని పోరగాండ్లను గిసోంటి లగ్గాలు సేసుకుంటే పోతేపోనియ్యని ఇడ్సిపెట్టి ఉండలేని పరిస్థితి. మరేం జేసుడు. గందుకే మనం సంధియుగపు తండ్రులం. మనరే గిసోంటి సమస్యలు, అటు ఎనుకకు పోలేం గిటు ధైర్యం సెయ్యలేం. గిదీ పరిస్థితి. ఏదేమైన కాలంతోని మనం నడువాలె. అంతవడ్లు పెరుగు కలిపినట్టుంది అన్నడు లచ్మరెడ్డి. గా మాటలల్ల ఎంతో లోతు గనవడ్డది నాకు. శనార్తులు.

Kaluva-Mallaiah-001డా ॥కాలువ మల్లయ్య
98493 77578