Home తాజా వార్తలు సుహాసినికి బ్రదర్స్ స్ట్రోక్!

సుహాసినికి బ్రదర్స్ స్ట్రోక్!

Nandamuri Suhasini to contest from Kukatpally

ఆమె పోటీకి జా.ఎన్‌టిఆర్, కల్యాణ్‌రామ్ అభ్యంతరాలు
మరికొంత మంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత
అభ్యర్థిత్వంపై చివరి నిమిషం వరకు అనుమానాలు
నేడు నామినేషన్‌కు బాలకృష్ణ

మన తెలంగాణ/ హైదరాబాద్: మహాకూటమి పొత్తు లో భాగంగా నగరంలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ప్రకటన కూడా చేసింది. శనివారం నామినేషన్ వేస్తున్నా నని, బాలకృష్ణ కూడా తన వెంట వస్తున్నారని ఆమె మీ డియాకు స్పష్టం చేశారు. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై కుటుంబ సభ్యుల్లోనే అసంతృప్తి నెలకొనింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు ఖరారు కావడంతోనే కుటుంబ సభ్యుల మధ్య మొదలైన భిన్నాభిప్రాయాలు చివరకు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా మలుపుతిప్పుతాయోననే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి సోదరులైన సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంవరకూ ఆమె పోటీ చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. నామినేషన్ వేసినా ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటోయోననే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించిన కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఏ మేరకు సహకారం అందిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీరిద్దరితో ఇప్పటికే సుహాసిని ఫోన్‌లో మాట్లాడి సహకారం తీసుకున్నట్లు తెలిసింది.

హరికృష్ణ భౌతికకాయంపై చర్చలు
మాజీ పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్‌టిఆర్ భవన్‌కు తీసుకెళ్లకపోవడంపై కూడా సుహాసిని కుటుంబ సభ్యుల్లో చర్చలు జరుగుతున్నాయి. సమైక్యాంధ్ర డిమాండ్ కోసం హరికృష్ణ తన పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేశారని, హరికృష్ణకు చంద్రబాబునాయుడు సరైన గౌరవం ఇవ్వలేదనే చర్చ కూడా కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల్లో తలెత్తిన ఈ భిన్నాభిప్రాయాలు ఆగ్రహ రూపం తీసుకున్నట్లు తెలిసింది. హరికృష్ణ మరణవార్త మొదలు అంత్యక్రియల వరకు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌కు భౌతికకాయాన్ని తీసుకెళ్ళకపోయిన అంశాన్ని పోల్చి చూసినట్లు తెలిసింది.

హరికృష్ణ అంత్యక్రియలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించి తగిన గౌరవ మర్యాదలు కల్పించడం పట్ల సంతృప్తికరమైన వ్యాఖ్యలు కొద్దిమంది కుటుంబ సభ్యులు చేసినట్లు సమాచారం. సుహాసినికి కూకట్‌పల్లి టికెట్‌ను టిడిపి ప్రకటించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు హరికృష్ణ మృతి మొదలు అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పారని నందమూరి కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. మరోవైపు 20 ఏళ్ల సినిమా భవిష్యత్ ఉన్నందున తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి భిన్నమైన దారిలో పయనించడం సహేతుకంగా ఉండదని, తెలంగాణలో ఉన్నంతవరకు ఎదురీత మంచి ఫలితాలు ఇవ్వదనే చర్చ కూడా జరిగినట్లు తెలిసింది.

నందమూరి కుటుంబ ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున ముఖ్యమంత్రి కెసిఆర్‌తో, అధికార టిఆర్‌ఎస్ పార్టీతో ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకునే తీరులో ప్రవర్తించడంకంటే స్నేహపూర్వకంగా ఉండడమే మేలన్న అభిప్రాయం బలంగా వినిపించినట్లు తెలిసింది. ఇన్ని భిన్నాభిప్రాయాల మధ్య రాజకీయాల్లోకి వస్తున్న సుహాసిని ఏ తీరులో ఆలోచిస్తారో, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు హరికృష్ణ అంశాన్ని ఏ రూపంలో ప్రచారంలో వినియోగించుకుంటారోననే గుసగుసలు కూకట్‌పల్లి ప్రజల మధ్య మొదలయ్యాయి. ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడిన పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాస్‌లతో ఫోన్‌లో మాట్లాడిన సుహాసినికి తప్పకుండా మద్దతు లభిస్తుందనే హామీ లభించినప్పటికీ ఆచరణలో అది ఏ మేరకు ప్రతిఫలిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అదే సామాజికవర్గానికి చెందిన టిఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నందున, గతంలో తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్నా ఈ నాలుగేళ్ళలో ప్రజల్లో ఆయనకు స్థానికులనుంచి అందుతున్న మద్దతుపై కూడా సుహాసిని కుటుంబ సభ్యల్లో చర్చ జరిగినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్‌కు కూకట్‌పల్లి స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉన్నందున ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి ఏ మేరకు లాభిస్తుందని, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సుహాసినికి ఏ మేరకు విజయావకాశం ఉంటుందనేది ఆ కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు రకరకాల చర్చలకు దారితీసింది. టికెట్ వచ్చినందున సంతోషపడే పరిణామాలకు భిన్నంగా నిరుత్సాహం నెలకొంది.

Nandamuri Suhasini to contest from Kukatpally

Telangana Latest News