Home సినిమా ‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం

‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం

 Nandamuri Taraka Rama Rao Biopic NTR

నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’లో ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని భారీ సెట్‌లో ప్రారంభమైంది. ఇక నందమూరి తారకరామారావు ‘మనదేశం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘మనదేశం’ సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సీన్‌ను ఎన్టీఆర్ బయోపిక్ కోసం షూట్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం. ఇక అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాయడం జరిగింది. ‘అభిమానమును మించిన ధనము, ఆదరణమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే. నాడు నేడు ‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం’ అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో తలపాగా చుట్టుకొని, ఖాకీ చొక్కా వేసుకున్న బాలయ్య అందరినీ ఆకట్టుకుంటున్నారు. తన మొదటి సినిమా ‘మనదేశం’లో ఎన్టీఆర్ ఎలా ఉన్నారో అలాంటి లుక్‌తో బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ఈ ఫొటో పక్కన ఎన్టీఆర్ చేతిరాత ఆకట్టుకుంటుంది. ఆయన సంతకం, ఆయన రాసిన వాక్యాలు ఒక్కసారిగా ఆయన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. మొత్తంమీద ఎన్టీఆర్ బయోపిక్ అన్ని బాలారిష్టాలను దాటుకొని క్రిష్ దర్శకత్వంలో  సెట్స్‌పైకి వచ్చేసింది. క్రిష్ శరవేగంగా సినిమాను ముందుకు నడిపిస్తారు కాబట్టి మునుముందు ఇంకా మంచి లుక్‌లు వచ్చే అవకాశం ఉంది. పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఎన్టీఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.