Home తాజా వార్తలు నంద్యాల ఉప ఎన్నిక : నేటితో ప్రచారానికి తెర

నంద్యాల ఉప ఎన్నిక : నేటితో ప్రచారానికి తెర

Nandyala-By-Poll

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ప్రచార ఘట్టానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. దీంతో అధికార టిడిపి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపిలు సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా మోహరించి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ విజయమే లక్షంగా రెండు పార్టీలు హోరాహోరీన పోరాడాయి. అధికార టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు ఒకరిపైనొకరు ఇసికి ఫిర్యాదు చేసుకున్నాయి. అధికార టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ప్రజలను మభ్యపెడుతుందని వైఎస్‌ఆర్‌సిపి ఇసికి పలు మార్లు ఫిర్యాదు చేసింది. వైఎస్‌ఆర్‌సిపిపై కూడా అధికార టిడిపి ఇసికి ఫిర్యాదు చేసింది. రెండు రోజుల పాటు ఎపి సిఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు.

పదిహేను రోజులుగా జగన్ ఇక్కడే తిష్టవేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం ఇరు పార్టీలు కృషి చేస్తున్నాయి. అయితే రెండు లక్షల పై చిలుకు ఓట్లు ఉన్న ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది మైనార్టీలే కావడం గమనార్హం. మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు అధికార టిడిపి అనేక తాయిలాలను ప్రకటించింది. వైఎస్‌ఆర్‌సిపి కూడా మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చాలా మంది మైనార్టీలు వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. టిడిపి నేత, ఎమ్మెల్సీ ఫరూక్ అల్లుడు, హరున్ మోటార్స్ అధినేత ముస్తాక్ వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ ఓనర్ కూడా ఈ పార్టీలో చేరారు. అధికార టిడిపి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపిలు నంద్యాల నియోజకవర్గ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అధికార టిడిపి నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నుంచి శిల్పా మోహన్‌రెడ్డి , కాంగ్రెస్ నుంచి ఖాదర్‌లు పోటీలో ఉన్నారు. చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల మధ్యనే నెలకొంది. ఏదిఏమైనా నంద్యాల ప్రజలు ఎవరిని పీఠం ఎక్కిస్తారోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 23న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 28న ఫలితాలు వెలువడుతాయి.

Nandyal By-election – Campaign Ended with today