Home జాతీయ వార్తలు అదేలా? మేమున్నదే అందుకు..!

అదేలా? మేమున్నదే అందుకు..!

Pawan-and-Nannapaneni-Rajak

అమరావతి: భూవివాదం నేపథ్యంలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసిన దారుణ ఘటన ఎపిలోని విశాఖపట్టణం పరిధిలోని పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో గత మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. భూకబ్జాను ప్రశ్నించినందుకు ఓ దళిత మహిళపై స్థానిక టిడిపి నేతలు ఈ దారుణానికి పాల్పడ్డారనేది ఆరోపణ. అయితే తాజాగా ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. టిడిపి నేతలే ఆమెను అవమానించారని, రిపోర్టులు చెబుతున్నాయని, ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలని జనసేన కార్యకర్తలను బాధితురాలి వద్దకు పంపినట్లు పవన్ చెప్పారు. అంతేగాక బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేలా విశాఖ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ ట్విట్టర్ ద్వారా కోరారు. కాగా, పవన్ వ్యాఖ్యలపై ఎపి మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఘాటుగా స్పందించారు. వైజాగ్ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పడం సరికాదన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి అధికారులతో తాను ఫోన్‌లో స్వయంగా మాట్లాడానని, తన ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా తాము ఉపేక్షించబోమన్నారు. నిందితులకు తగిన శిక్ష వేయిస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బాధితరాలికి న్యాయం చేసి తీరుతామని నన్నపనేని స్పష్టం చేశారు.

Nannapaneni Rajakumari Criticizes Janasena President Pawan Kalyan.