Home తాజా వార్తలు ఒసాకా కొత్త చరిత్ర

ఒసాకా కొత్త చరిత్ర

Naomi Osaka beats Serena Williams to win US Open title

ఫైనల్లో సెరెనాకు షాక్, యుఎస్ ఓపెన్ చాంప్ నవోమి

మహిళల టెన్నిస్‌లో జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా కొత్త ఆధ్యాయానికి తెర లేపింది. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలవడం ద్వారా సంచలనం సృష్టించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఒసాకా చిరస్మరణీయ ఆటతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో ఒసాకా ఎందరో స్టార్లను ఓడించింది. సెమీఫైనల్లో కిందటి రన్నరప్, అమెరికా స్టార్ మాడిసన్ కీస్‌ను మట్టికరిపించింది. అంతకుముందు స్టార్ క్రీడాకారిణిలు సురెంకో, సబలెంకా, సన్సొవిచ్ తదితరులను ఓడించింది. ఫైనల్లో అయితే ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనాను చిత్తు చేసి తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. సెరెనా ఆశలపై నీళ్లు చల్లిన ఒసాకా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి తొలి జపాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జపాన్ టెన్నిస్ చరిత్రలోనే ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్‌లో కూడా జపాన్‌కు టైటిల్ లభించలేదు. ఆ లోటును ఒసాకా తీర్చింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో నిషికోరి సెమీస్‌లో కంగుతిన్నాడు.

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జపాన్ సంచలనం నవోమి ఒసాకా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన ఫైనల్లో 20వ సీడ్ ఒసాకా 62, 64 తేడాతో ఆరు సార్ల చాంపియన్, అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌పై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగి ల్స్ టైటిల్ గెలిచిన తొలి జపాన్ క్రీడాకారిణిగా చరిత్రను తిరగరాసింది. మరోవైపు కెరీర్‌లో ఏడో యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించాలని తహతహలాడిన సెరెనాకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌లో సెరెనా సహనం కోల్పోయి పలుసార్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగింది. దీంతో మ్యాచ్‌లో చాలా సార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రారంభం నుంచే…
మహిళల సింగిల్స్ ఫైనల్ ఊహించినట్టే రసవత్తరంగా ప్రారంభమైంది. జపాన్ సంచలనం ఒసాకా ప్రారంభం నుంచే అద్భుత ఆటను కనబరిచింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మాజీ చాంపియన్ సెరెనాకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగింది. చూడచక్కని షాట్లతో సెరెనాను హడలెత్తించింది. సెరెనా తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. ఒసాకా ధాటికి కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయింది. మరోవైపు ప్రారంభం నుంచే అసాధారణ షాట్లతో చెలరేగిన ఒసాకా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆమె ధాటిగా ఆడడంతో సెరెనాకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో ఒత్తిడికి గురైన సెరెనా వరుస తప్పిదాలకు పాల్పడింది. ఆమె సహనం కోల్పోయి తిట్ల పురాణం అందుకుంది. అంతేగాక పలుసార్లు రాకెట్‌ను నేలకేసి కొట్టి అసహానాన్ని ప్రదర్శించింది. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా తన కోచ్ నుంచి సలహాలు కోరింది. దీనిపై ఛైర్ అంపైర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెరెనా శివాలెత్తింది. ఇక, ఒసాకా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయింది. సెరెనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.

రెండో సెట్‌లో కూడా ఒసాకా దూకుడును ప్రదర్శించింది. అసాధారణ ఆటతో సెరెనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడింది. ఒసాకా దూకుడును పెంచడంతో సెరెనా కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఒసాకా ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడితే సెరెనా దానికి భిన్నంగా వ్యవహరించింది. అనవసర కోపాన్ని ప్రదర్శిస్తూ అంపైర్ ఆగ్రహానికి గురైంది. సెరెనా తీరుపై ఛైర్ అంపైర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. సెరెనా కూడా అంపైర్‌పై తిట్ల వర్షం కురిపించింది. సహనాన్ని కోల్పోయిన సెరెనా వరుసగా రెండో సెట్‌ను కోల్పోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోసారి చివరి వరకు అసాధారణ ఆటతో అలరించిన జపాన్ స్టార్ ఒసాకా తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమచేసుకుంది.

అంపైర్‌పై సెరెనా ఫైర్: మరోవైపు ఫైనల్లో ఓటమి పాలైన మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ వ్యవహరించిన తీరు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌లో భాగంగా జరిగిన రెండో సెట్‌లో నిబంధనలు ఉల్లంఘించిన సెరెనాపై ఛైర్ అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో సెట్ జరుగుతున్న సమయంలో సెరెనా కోచ్ సహాయం తీసుకోవడాన్ని అంపైర్ తప్పుపట్టాడు. దీంతో సెరెనా అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. అంతేగాక ఛైర్ అంపైర్ అబద్దాల కోరు, దొంగ అంటూ నిందించింది. అంతేగాక ఆగ్రహంతో ఊగిపోయిన సెరెనా తన రాకెట్‌ను నేలకేసి కొట్టింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ఛైర్ అంపైర్ సెరెనాకు ఒక పాయింట్ జరిమానా విధించాడు. ఇదిలావుండగా సెరెనా మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఛైర్ అంపైర్ కావాలనే తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. అంపైర్ తనకు క్షమాపణ చెప్పాలని సెరెనా డిమాండ్ చేసింది. తనపై వివక్ష పూరితంగా వ్యవహరించిన ఛైర్ అంపైర్‌పై సెరెనా మ్యాచ్ రిఫరికి ఫిర్యాదు చేసింది.

మహిళలపై చిన్నచూపు…
మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ ఛైర్ అంపైర్ కావాలనే తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆరోపించింది. తాను కోచ్ సహాయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అయినా తాను కోచ్ సహాయం తీసుకున్నట్టు ఛైర్ అంపైర్ ఆరోపించడం విడ్డూరంగా ఉందంది. తాను మహిళ కావడం వల్లే అంపైర్ ఈ విధంగా వ్యవహరించాడని వాపోయింది. మహిళా క్రీడాకారిణిలపై వివక్ష పెరిగిపోయిందని, పురుష ఆధిక్య సమాజంలో మహిళలు అంటే చులకనగా చూస్తున్నారని ఆరోపించింది. తనపై అంపైర్ వ్యవహరించిన తీరు ఎంతో బాధకు గురి చేసిందని సెరెనా వ్యాఖ్యానించింది. టెన్నిస్‌లో క్రీడాకారిణిలపై వివక్ష రోజు రోజుకు పెరిగి పోతుండడంపై సెరెనా ఆందోళన వ్యక్తం చేసింది.