Home జాతీయ వార్తలు అప్పుడు నెహ్రూ, ఇందిర.. ఇప్పుడు మోడీ

అప్పుడు నెహ్రూ, ఇందిర.. ఇప్పుడు మోడీ

 

న్యూఢిల్లీ: దేశంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత లోక్‌సభకు రెండోసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మూడవ ప్రధాని నరేంద్రమోడీ. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లకు గానూ బిజెపి 282 సీట్లను గెలుచుకుంది. 1951-52లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ దాదాపు నాలుగింట మూడోంతుల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత 1957, 1962లో ఎన్నికల్లో ఆయన పూర్తి మెజార్టీ సాధించారు.
* స్వతంత్య్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్, అక్టోబరు 1951 నుంచి ఫిబ్రవరి 1952 వరకు జరిగాయి. 1951లో కాంగ్రెస్ ఆధిపత్యం అధిగమించలేని స్థాయికి వెళ్లగా, భారతీయ జన్‌సంఘ్, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, సోషలిస్ట్ పార్టీ వంటి అనేక ఇతర రాజకీయ పార్టీలు అప్పుడే రూపు దిద్దుకోవడం మొదలైంది. 1951-1952 ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 489 స్థానాలకు గానూ 364 సీట్లను గెలుచుకోగలిగింది. అప్పుడు మొత్తం ఓట్లలో ఆ పార్టీకి దాదాపు 45 శాతం ఓట్లు పోలయ్యాయి.
* 1957లో నెహ్రూ తిరిగి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు, దేశం క్లిష్టమైన దశలో ఉంది. ఎందుకంటే 1955లో హిందూ వివాహ చట్టం ఆమోదించిన తర్వాత మితవాదులతో తన పార్టీ లోపల,బయట ఆయన పోరాడారు. దేశం అనేక భాషా వివాదాలను ఎదుర్కొంది. పర్వవసానంగా 1953లో రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత, భాషా ప్రాతిపదికన అనేక రాష్ట్రాలు ఆవిర్భవించాయి. ఆహార అభ్రత కారణంగా కూడా దేశం అట్టుడికింది.
* ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, 1957 ఎన్నికల్లో నెహ్రూ 371 సీట్లలో అద్భుతమైన విజయం సాధించారు. 195152లో 45 శాతం గా ఉన్న కాంగ్రెస్ ఓటింగ్,1957లో 47.78 శాతానికి పెరిగింది. 1962 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నెహ్రూ మొత్తం 494 స్థానాలకు గానూ 361 సీట్లలో విజయం సాధించారు.
* స్వాతంత్య్రం వచ్చిన 20 ఏళ్ల తర్వాత, 1967లో ఆరు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చివరకు విఫలమయింది. ఈ ఆరింటిలో, మొదటిసారిగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. అయినప్పటికీ, 1967ఎన్నికల్లో నెహ్రూ తనయురాలైన ఇందిరాగాంధీ, లోక్‌సభలో మొత్తం 520 స్థానాలకు గానూ ఆమె 283 సీట్లను గెలుచుకున్నారు. ఇది సాధారణ ఎన్నికల్లో ఇందిర మొట్టమొదటి ఎన్నికల విజయం. 1969లో, కాంగ్రెస్ (ఒ)గా పిలిచే పార్టీ పాత గార్డును ఆమె బహిష్కరించారు. ఈ విభాగానికి మురార్జీ దేశాయ్ నాయకత్వం వహించారు. ఈ సమయంలో ఇందిర “గరీబీ హటావో” నినాదం, దేశ ఓటర్లలో విస్తృతంగా నాటుకు పోయింది. ఫలితంగా, 1971 ఎన్నికల్లో రెండోసారి 352 సీట్ల వరకు పెంచుకోగలిగారు.
* 2010-2014 యుపిఎ ప్రభుత్వ పాలనలో బహుళ అవినీతి కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2014 ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బిజెపి నిలబెట్టింది. భారతదేశం అంతటా అభివృద్ధి వాగ్దానంతో నరేంద్ర మోడీ, తన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో 282 సీట్లతో పూర్తిస్థాయి మెజార్టీని సాధించారు.

Narendra Modi came to power with full majority