Home అంతర్జాతీయ వార్తలు సూర్యయాన్

సూర్యయాన్

NASA proclaims that the probe has been successful since the rocket

అంతరిక్ష శోధనలో మహత్తరశకం, సూర్యుడి దగ్గరికి నాసా ప్రోబ్ ప్రయోగం 

ఆదివారం తెల్లవారుజామున 3.31 గంటలకు బయలుదేరిన డెల్డా – 4
ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి విజయవంతంగా ప్రయోగం
రాకెట్ నుంచి ప్రోబ్ జయప్రదంగా వేరయిందని నాసా ప్రకటన
త్వరలో సౌర వాయువులపై పరిశోధన మొదలవుతుందని వెల్లడి

వాషింగ్టన్ : సూర్యయాత్రకు శ్రీకారం చుడుతూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ చరిత్రాత్మక పార్కర్ సోలార్ ప్రోబ్ రాకెట్‌ను ఆదివారం తెల్లవారుజామున 3.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మాధ్యాహ్నం 1.01) విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ 37వ కాంప్లెక్స్ నుంచి డెల్టా4 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి సోలార్ ప్రోబ్‌ను మోసుకెళ్లిం ది. అనంతరం నాసా వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశా యి. ప్రోబ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కని ఆరోగ్యకర వాతావరణంలో ఉందని, తనకుతానే ఆపరేటింగ్ చేయగలుగుతోందని, సౌరగాలులను స్పృశించడానికి తన యాత్ర ప్రారంభించిందని అందులో పేర్కొంది. వాహక నౌక నుంచి సోలార్ ప్రోబ్ జయప్రదంగా వేరయిందని, త్వరలో సౌర వాయువు శోధన ప్రారంభిస్తుందని నాసా ప్రకటించింది.

ఉష్ణ కవచం, సౌర వ్యూహాలను తట్టుకునే శీతల వ్యవస్థ, తదితర అత్యంత ఆధునిక సాంకేతికత సమకూరడంతో దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు కంటున్న కలలు నెరవేరుతాయని నాసా ఆ ప్రకటనలో పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా చివరి క్షణాల్లో హీలియం అలారం మోగడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. భౌతికశాస్త్ర పరిశోధకునిగా ప్రపంచ ప్రఖ్యాతి వహించిన యూజిన్ పార్కర్ పేరును దీనికి పెట్టడం విశేషం. 1958లోనే సౌర వాయువు ప్రభావం గురించి విస్తృతం పరిశోధనలుకావించి అద్భుత విషయాలను ప్రపంచానికి పార్కర్ వెల్లడించారు. అప్పుడు ఆయన పరిశోధనలను ఎవరూ విశ్వసించకపోయినా ఇప్పుడు ఆయన సిద్ధాంతాలన్ని నిజమే అని ధ్రువీకరణ అవుతోంది. అందుకనే ఇప్పుడు సూర్య యాత్రకు బయలుదేరిన ‘ప్రోబ్’కు ఆయన పేరు పెట్టడం, అదీగాక ఆయన సజీవ సాక్షంగా ఉన్నప్పుడే ఈ ప్రయోగం ఇప్పుడు జరగడం అపూర్వ సంఘటన. ఆయన వయస్సు ఇప్పుడు 91 సంవత్సరాలు. ప్రోబ్ ప్రయోగ సమయంలో ఆయన దగ్గరే ఉండి సందర్శించారు.

“హో! ఇప్పుడు మనం వెళ్తున్నాం. మరికొన్ని సంవత్సరాలు ఇదే ప్రయత్నంలో కొనసాగి అనేక విషయాలు తెలుసుకుంటాం అని ఆయన ఈ సందర్భంగా ఉద్వేగ భరితంగా అన్నారు. డెల్టా4 హెవీ రాకెట్ ద్వారా ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రయోగం జరిగింది. ప్రోబ్‌ను మోసుకెళ్తున్న డెల్టా4 హెవీ రాకెట్ అంతర సౌర వ్యవస్థలోకి ప్రోబ్‌ను విడిచిపెడుతుంది. ఆ తరువాత ఆరు వారాల్లో అక్టోబర్‌లో ప్రోబ్ శుక్రుని వద్దకు దూసుకు వెళ్తుంది. మరో వారాలకు నవంబర్‌లో సూర్యుని చేరువగా గమ్యస్థానంలోకి ప్రవేశిస్తుంది. ఏడేళ్ల పాటు సాగే ఈ పరిశోధనలో సూర్యునికి అత్యంత సమీపంలో దాదాపు 24 సార్లు ప్రోబ్ పల్టీ కొడుతూ ప్రదక్షిణలు చేస్తూ సూర్య వలయం (కరోనా)లోని భౌతిక రసాయన చర్యలను అధ్యయనం చేస్తుంది. సౌర వ్యవస్థలో భూమిని ప్రభావితం చేసే చర్యలన్నీ ఈ కరోనా ప్రదేశం నుంచే ప్రేరేపితం అవుతుంటాయి. ఈ అరుదైన అసాధారణ వాతావరణంలోకి ప్రోబ్ దూసుకెళ్లి ఆయా వాతావరణ నమూనాలను విశ్లేషించి సేకరిస్తుంది. భగభగమని జ్వాలలతో మండే సూర్యుని ఉపరితలానికి 3.83 మిలియన్ మైళ్లు (6.16 మిలియన్ కిలో మీటర్లు) చేరువలోకి ప్రోబ్ చేరుకుంటుంది.

సౌర వ్యవస్థ విశ్లేషణలో కీలకపాత్ర
1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో నాసా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందిన ఈ ప్రోబ్ సైజు ఒక కారులా ఉంటుంది. సౌర వ్యవస్థ వాతావరణాన్ని ఇతర చర్యలను విశ్లేషించడంలో కీలకపాత్ర వహిస్తుంది. సౌర వాయివులో ఏదైనా అలజడి ఏర్పడి భూమిని తాకి అల్లకల్లోలం చేసే ఉపద్రవం ఏర్పడితే ముందుగా క్షణాల్లోనే తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు ఇది సహరిస్తుందని ప్రాజెక్టు సైంటిస్టు, మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జస్టిన్ కస్పర్ పేర్కొన్నారు. సూర్యుడు అంతు చిక్కని రహస్యాలతో ఉంటాడు. శాస్త్రవేత్తల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంలో ఈ పరిశోధన ప్రాధాన్యం వహిస్తుందని మరో సైంటిస్టు నికీ ఫాక్స్ అన్నారు. ఏదేమైనా ‘కరోనా’లోని అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల గుట్టు విప్పి ఆ మేరకు చర్యల డేటాను సేకరించి వెలుగులోకి తేవాలన్నదే ‘నాసా’ నిశ్చయం.

ప్రోబ్ హెవియోస్2
గతంలో 1976లో సూర్యగోళాన్ని స్పృశించాలన్న, ప్రయత్నంలో హెవియోస్2 అనే ప్రోబ్‌ను ప్రయోగించారు. కానీ అది 27 మిలియన్ మైళ్ల (43 మిలియన్ కిలో మీటర్లు) పరిధికే పరిమితమైంది. భూమి నుంచి సూర్యునికి సరాసరి దూరం 93 మిలియన్ మైళ్లు (150 మిలియన్ కిలోమీటర్లు). భూమి మీద ఏ విధంగా ముందుగా వాతావరణం తెలుసుకో గలుగుతున్నామో అదే విధంగా అంతరిక్ష వాతావరణాన్ని కూడా ముందుగా తెలుసుకోవాలన్నదే తమ లక్షంగా నాసా గాడ్డర్డ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (మేరీలాండ్) సోలార్ సైంటిస్టు అలెక్సి యాహా చెప్పారు.

ఎంత వేడినైనా తట్టుకునే శక్తి
ప్రోబ్ వ్యోమనౌక 2500 డిగ్రీల ఫారన్‌హీట్ అంటే 1370 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడినైనా తట్టుకోగల శక్తి కలిగి ఉంటుంది. ఇందులో అమర్చిన సాధనాలు కూడా ఎంత వేడినైనా తట్టుకునేలా రూపొందించారు. ఉష్ణకవచం అమర్చారు. 85 డిగ్రీల ఫారన్‌హీట్ (29) డిగ్రీల సెంటిగ్రేడ్) అయినా, ఇవి తట్టుకోగలుగుతాయి.