Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వాస్తవాలు..సెంటిమెంట్ వేర్వేరు

int

హెచ్1బి వీసాలపై నాస్కామ్ చైర్మన్ 

న్యూయార్క్: హెచ్1బి వీసాల విషయంలో సెంటిమెంట్‌ను పక్కన పెట్టి వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం ఉందని నాస్కామ్ అధ్యక్షుడు రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. వీసాల మంజూరు విషయంలో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేమ్‌జీ పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఈ విషయమై మాట్లాడారు. ఏటా 65 వేల  హెచ్1బి వీసాలు మంజూరు అవుతుంటే అవదులో భారతీయ పరిశ్రమ వర్గాలు  ఉపయోగించుకునేవి పదివేల లోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు.  అయితే మొత్తం వీసాల్లో 70 శాతం భారతీయులు పొందుతున్నారని, అవన్నీ భారతీయ కంపెనీలు కాకపోవడం గమనార్హమని ఆయన అన్నారు. అమెరికాలోని కార్మిక శాఖ గణాంకాల ప్రకారం 2020నాటికి అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత  విభాగాల్లో దాదాపు 24 లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడుతుందని, ఇందులో సగం మంది ఐటి, కంప్యూటర్ రంగాలకు చెందిన వారే ఉంటారని ఆయన తెలిపారు. అమెరికా టెక్నాలజీ రంగంలో 70 లక్షలు మంది ఐటి నిపుణులు పని చేస్తున్నారని, అయితే వారిలో  పదివేలమంది( భారతీయులు)గురించే మాట్లాడుతున్నారని   ప్రేమ్‌జీ  అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను, సెంటిమెంట్‌ను వేర్వేరుగా చూడాల్పిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.హెచ్1బి వీసాలతో పాటుగా తాత్కాలిక వీసాల మంజూరు విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం గురించి అడగ్గా వ్యాపారపరంగా చూస్తే ఉత్పత్తులు, సేవలు నిబంధనలకు అనుగుణంగా సాఫీగా సాగుతున్నాయన్నారు. అదే విధంగా హెచ్1బి వీసాల విషయంలో చట్టపరంగా ఎలాంటి మార్పులూ జరగలేదని కూడా ఆయన తెలిపారు. అయితే వీసాల మంజూరు ప్రక్రియ పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అంచనా వేయడం కష్టసాధ్యమని, అదే సమయంలో  వాటిని అమలు చేయాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్1బి వీసాల  నిబంధనలు, వాటి పరిశీలన విషయంలో అనేక మార్పులు.సవరణలను ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే అవి ప్రతినిధుల సభ, సెనేట్‌లలో అదే రూపంలో ఆమోదం పొందకపోవచ్చని కూడా ఆయన అన్నారు. అయితే గతంతో పోలిస్తే హెచ్1బి వీసాల నియమాలు, నిబంధనలో ్లచాలా మార్పులు వచ్చాయన్నారు. అయితే ఈ మార్పులు అందరికీ వర్తించేవని, కేవలం భారతీయులకే కాదని ఆయన అంటూ, వీటికి ఇతర పరిష్కారాలను వెతకాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక ప్రకారం 2017లో భారతీయ కంపెనీలు కొత్తగా 8,468హెచ్1బి వీసాలు పొందాయి.160 మిలియన్ల అమెరికా కార్మిక శక్తిలో ఇది 0.006 శాతం మాత్రమే. ఒక సదస్సులో పాల్గొనడం కోసం ప్రేమ్‌జీ అమెరికా వచ్చారు.

Comments

comments