Home వార్తలు మూడవసారి జాతీయ అవార్డు

మూడవసారి జాతీయ అవార్డు

kanganaజాతీయ అవార్డు ఒక్కసారి గెలిస్తేనే జన్మధన్యమైపోతుందని చిత్ర పరిశ్రమ వారు భావిస్తుంటారు. అలాంటిది ఒక నటి.. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు… ఏకంగా మూడవసారి జాతీయ అవార్డును సొంతం చేసుకొని చిత్ర పరిశ్రమలో తనకు తిరుగులేదని నిరూపించుకొంది. ఈ అరుదైన ఘనత అందాల తార కంగనారనౌత్‌కే సొంతమైంది. కెరీర్ ఆరంభంలో కంగన వేసిన గ్లామర్ వేషాలు చూసి… ఆమె ఇలా అవార్డులు కొల్లగొడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే ‘ఫ్యాషన్’ సినిమాలో రోడ్డు మీద అడుక్కుతినే స్థాయికి చేరిన ఓ నిజ జీవిత మోడల్ పాత్రకు ప్రాణం పోసిన కంగన తొలి జాతీయ అవార్డును అందుకుంది. ఆ చిత్రానికిగాను ఆమెకు జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది. ఇక రెండేళ్ల కిందట ‘క్వీన్’ సినిమాలో కంగన అసమాన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. రేపు పెళ్లనగా ఈరోజు పెళ్లి కొడుకు నో చెబితే… ఇంతకుముందు ప్లాన్ చేసుకున్న ప్రకారమే యూరప్‌లో హానీమూన్‌కు ఒంటరిగా బయల్దేరి వెళ్లే అమ్మాయి కథ ఇది. ఆ ప్రయాణంలో తన జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించుకునే పాత్రలో అద్భుతంగా నటించి… జాతీయ ఉత్తమ హీరోయిన్‌గా ఎంపికైంది కంగన. ‘తను వెడ్స్ మను రిటర్న్’తో మరోసారి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డు దక్కించుకుంది. ఈవిధంగా మూడుసార్లు జాతీయ అవార్డును గెల్చుకొని బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.