Home కలం సినారె సాహిత్యంపై జాతీయ సదస్సు

సినారె సాహిత్యంపై జాతీయ సదస్సు

CNR-Meeting

కవిత్వ ప్రేమికుడుగా తన చివరి శ్వాస వరకు రాసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహాకవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి. తెలుగు కవిత్వం సంప్రదాయాలు,ప్రయోగాల మర్మ రహస్యాలను వెల్లడిస్తూనే ఆధునిక పోకడలను, సమకాలీన సమాజాన్ని పరిచయం చేస్తూ మూడు తరాలనూ ప్రభావితం చేసిన మహాకవి. సినారె ఆచార్యులుగా పని చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయనను సంస్మరిస్తూ తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలి జాతీయ సదస్సు ‘సినారె సాహితీ వైభవం’ పేరిట ఆగస్టు 30, 31 తేదీలతో ఆర్ట్ కళాశాలలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రారంభ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామచంద్రం , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్ గోపి, తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ, ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి.కృష్ణారావు, సదస్సు సంచాలకులు, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సుర్యా ధనంజయ్, ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఉస్మానియా తెలుగు శాఖలో ఆచార్యునిగా సినారె విస్తరిల్లిన తీరు వివరించగా డాక్టర్ పగడాల నాగేందర్ సభను నిర్వహించారు.
మొదటి సమావేశం ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప ఆధ్యక్షతన జరుగగా కర్పూర వసంతరాయలు కావ్యంలోని వైశిష్టాన్ని వివరిస్తూ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులు బి. విశ్వనాథ్, సినారె కవిత్వం ప్రతీకాత్మకతపై తెలంగాణ విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డాక్ట ర్ వి. త్రివేణి పత్ర సమర్పణలు చేయగా డా. నల్ల విజయకుమార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెండవ సమావేశం తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వాచార్యులు ఆచార్య టి. కిషన్ రావు అధ్యక్షతన జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సినారె వచన కవిత్వాన్ని 1980 వరకు పరిశీలిస్తూ పత్ర సమర్పణ చేసి ప్రగతిశీల మానవతావాద కవిగా ఆయనను పేర్కొన్నారు. తెలంగాణ మాండలిక పదాలను మా ఊరు మాట్లాడింది కావ్యంలో సినారె భాషా సౌందర్యంతో వినియోగించిన తీరును తెలుగు విశ్వవిద్యాలయం సహాయచార్యులు డాక్టర్ బాల శ్రీనివాస మూర్తి పత్ర సమర్పణతో వివరించారు.
మూడవ సమావేశం ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య ఎస్వీ రామారావు అధ్యక్షతన జరిగింది. విమర్శకుడిగా పరిశోధకుడిగా సినారె బహుముఖ ప్రతిభను అనేక దృక్కోణాలలో వివరిస్తూ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు పిల్లల మర్రి రాములు, సినారె, గేయ కావ్యాలు విశిష్టతపై ఉస్మానియా విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డాక్టర్ పి. వారిజారాణి పత్ర సమర్పణలు చేశారు.
నాలుగవ సమావేశానికి ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. పాటలో ఏముంది నా మాటలో ఏముందిలోని కవితాత్మకతపై తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పి కనకయ్య, కవిత నా చిరునామా సినారె దృక్పథం అన్న అంశంపై అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎన్ రజని, సినారె గేయ నాటికలపై నిజాం కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మి పత్ర సమర్పణలు చేసి ఆలోచనాశీలిగా సినారేను ఆవిష్కరించారు.
ఐదవ సమావేశం ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య పి. సుమతీ నరేంద్ర అధ్యక్షతన సమావేశం జరిగింది. సినారె సినీగీతాలు తెలంగాణ భాషా పదాలు అన్న అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డాక్టర్ కె లావణ్య, సినారె కవిత్వం సమకాలీనత అన్న అంశంపై ఉస్మానియా తెలుగు శాఖ సహాయాచార్యులు డా ఎస్ రఘు పత్ర సమర్పణలు చేసి కవిత్వంలో ఆయన క్రియాశీలతను వివరించారు.
ఆరవ సమావేశం తెలుగు శాఖ ఉస్మానియా పూర్వాచార్యులు ఆచార్య మాదిరెడ్డి అండమ్మ అధ్యక్షతన జరిగింది. సినారె యాత్రా రచనలపై కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య గోనా నాయక్, సినారె అనువాద రచనలపై తెలుగు విశ్వ విద్యాలయం సహాయాచార్యులు డాక్టర్ ఎం.గీతావాణి, మట్టీ మనిషీ ఆకాశంలోని సందేశంపై కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి భూక్యా, మంటలూ మానవుడు సామాజికతపై కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు బన్న అయిలయ్య, ఐదవ సమావేశంలో సినారె జీవితం వ్యక్తిత్వంపై కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు శరత్ జ్యోత్సారాణి పత్ర సమర్పణలు చేయగా సమావేశ నిర్వాహకులుగా డాక్టర్ ఎం.దేవేంద్ర ,నలిగంటి శరత్, డాక్టర్ పుట్టయాదేశ్, కెడిడి మృణాళిని, యడవల్లి సైదులు వ్యవహరించారు.
అక్షర బాటసారిగా సినారెకు స్మృత్యంజలి ఘటించిన ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య సి.హెచ్ గోపాల రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య లింబాద్రి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి పాల్గొని అన్ని ప్రక్రియలలో తనదైన ముద్రను వేసుకున్న సినారె తెలుగు జాతి గర్వించదగిన కవిగా, తరగని సాహిత్య శోభగా అభివర్ణించారు.
సదస్సు సంచాలకులు ఆచార్య సూర్యాధనంజయ్ అధ్యక్షత వహించగా సమన్వయకర్త డాఎస్ రఘు సదస్సు నివేదికను సమర్పించారు. సినారె విశిష్టతను వివరిస్తూ తిరునగరి శ్రీనివాస్ కార్యక్రమ నిర్వాహణ చేశారు. సాహితీ ప్రపంచంలో మేరు నగ శిఖరం లాంటి సినారెకు అక్షరాక్షర నివాళిగా రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది.