Home ఎడిటోరియల్ అపశకునాలు సంకేతాలైతే?

అపశకునాలు సంకేతాలైతే?

National flag fell on the ground

శుభ ప్రదమైన సమయంలో అపశ్రుతి దొర్లితే మనస్సు కలుక్కుమంటుంది. అందుకే అపశకునాలు ఎదురుకాకూడదనుకుంటారు. హేతువాదులు అపశకునాలను నమ్మక పోవచ్చు కాని నమ్మే వారికి సహించడం కష్టమే. దేశం యావత్తు ఎర్రకోట మీంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని టీవీల్లో చూడడంలో నిమగ్నమై ఉండగా మరో చోట అపశ్రుతి ఎదురైంది. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పతాకావిష్కరణ చేస్తుండగా జాతీయ పతాకం నేల మీద పడి పోయింది. ఈ దృశ్యాలను దూరదర్శన్ చూపించింది. ఆ సమయంలో దూరదర్శన్ వ్యాఖ్యాత ‘చ్…చ్…చ్… దౌర్భాగ్యం’ అని వ్యాఖ్యానించడం ఆ కార్యక్రమం చూస్తున్న వారందరికీ వినిపించింది. కనిపించింది. మోదీ ప్రభుత్వం ప్రసార భారతిని ‘ప్రచార భారతి’ గా మార్చినప్పటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రచారం రెండంచుల కత్తి అని రుజువైంది. పార్టీ కార్యకలాపాలను చూపడానికి ప్రభు త్వం ప్రసార భారతిని వినియోగించుకుంటే అది కాస్తా పతాకం నేల మీద పడడం అపచారం అన్న భావన కలిగించింది.

ఈ ఒక్క అపశ్రుతితో బీజేపీ ఇబ్బందులు ఆగలేదు. మంత్రిత్వ శాఖే లేని ‘ఆర్థికమంత్రి‘ అరుణ్ జైట్లీ వ్యవహారం స్వాతంత్య్ర దినోత్సవం నాడు మరో వివాదానికి తెర తీసింది. అనారోగ్య కారణాలవల్ల విశ్రాంతి తీసుకుంటున్న అరుణ్ జైట్లీ ఈ మధ్య ట్విట్టర్ సందేశాలు పంపడంలో తీరిక లేకుండా ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ‘జాతి జనులకు’ శుభాకాంక్షలు తెలియజేయాలన్న సదుద్దేశంతో ఆ సందేశంతో పాటు నేపథ్యంలో ఒక చిత్ర రాజాన్ని కూడా ఉంచారు. అందులో చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, సర్దార్ పటేల్, గాంధీ, లోకమాన్య బాల గంగాధర తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్వాతంత్య్ర యోధుల చిత్రాలున్నాయి. నెహ్రూ బొమ్మ మాత్రం లేదు.

మోదీ నాయకత్వంలోని బీజేపీకి నెహ్రూ అంటే ఎంత ఏవగింపో ఈ పాటికే దేశవాసులందరికీ తెలిసిపోయింది కనక నెహ్రూ బొమ్మ లేకపోతేనేం అని సరిపెట్టుకునే అవకాశం ఉంది. కాని విచిత్రం ఏమిటంటే మధ్యలో ఉన్న పటేల్ చిత్రం కన్నా గాంధీ బొమ్మ చిన్నది. పటేల్ తమ వాడని చెప్పుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. వేయని పాచిక లేదు. ప్రచారంలో పెట్టని అంశమే లేదు. తమ పార్టీలో స్వాతంత్య్ర సమరయోధులెవరూ లేని లోటు తీర్చుకోవడానికి గాంధీ హత్య తర్వాత ఆర్.ఎస్.ఎస్. ను నిషేధించిన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ ను సంఘ్ పరివారీయులు వాటంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ అత్యాశ పుణ్య మా అని ఫొటోలో గాంధీ కురచన అయిపోయారు.

నెహ్రూ ఫొటో లేని స్వాతంత్య్ర యోధుల ఫొటోను వాడుకుని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కాని మంత్రి అరుణ్ జైట్లీ వైఖరిని అర్థం చేసుకోవచ్చు. నెహ్రూ ఫొటో తొలగించి మోదీని మెప్పించడం ఆయనకు అవసరమే మరి. మోదీ ప్రాపకమే లేకపోతే లోక సభ ఎన్నికలలో ఓడిపోయినా అరుణ్ జైట్లీకి మంత్రిపదవి దక్కేదే కాదు. అందువల్ల జైట్లీ అస్తిత్వానికి నెహ్రూ ఫొటోను మినహాయించడం అవసరం కావచ్చు. కానీ గాంధీ చిత్రాన్ని పటేల్ చిత్రానికన్నా చిన్నది చేసి చూపించడం జాతిపితను అవమానించడమే. ఇది దేశవాసుల మనోభావాలను కించపరచడం కూడా. ఏ దేశాధినేత వచ్చినా దిల్లీలో దిగకుండా నేరుగా గుజరాత్ వెళ్తే తప్ప గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించకుండా ఉండరు. అయితే గాంధీని పొట్టన పెట్టుకున్నదని ఆరోపణను ఎదుర్కొంటున్న కుదురుకు చెందిన వారు ఇంతపని చేయడంలో ఆశ్చర్యపడితే చరిత్ర జ్ఞానం కొరవడడం మాత్రమే కారణంగా నిలుస్తుంది.

పోనీ పటేల్ మీద సంఘ్ పరివారానికి అపారమైన ప్రేమ ఏమైనా ఉందా అంటే అదీ లేదు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత ఆర్.ఎస్.ఎస్., జనసంఘ్, బీజేపీలు పటేల్ ను ఎలా కించ పరిచాయో నిరూపించడానికి సధవీ ఖోస్ల ఓ పాత కార్టూన్‌ను వెలికి తీసి ట్విట్టర్‌లో ఉంచారు. ఈ కార్టూన్ 1945లో ‘అగ్రణి’ పత్రికలో ప్రచురితమైంది. దాని సంపాదకడు నాథు రాం గాడ్సే. ఆ కార్టూన్ లో గాంధీని రావణుడిలా చూపించారు. ఆ రావణాసురిడి పది తలల్లో ఒక తల సాక్షాత్తు సర్దార్ పటేల్ తలే. ఈ పత్రికకు సావర్కర్ నిధులు సమకూర్చే వారు. చరిత్ర తమతోనే మొదలైందని భ్రమపడే వారికి చరిత్ర మీద అభిమానం ఉండదు. కాదు దానికి సంబంధించిన జ్ఞానమే ఉండదు. మోదీ దేశ చరిత్ర తనతోనే మొదలైందనుకుంటారు. అంతకు ముందు ఆయన దృష్టిలో అంతా శూన్యమే. 2014కు ముందు భారత్ అనే గజరాజం నిద్రాణంగా ఉందనీ ఆ తర్వాతే పరుగు లంకించిందని ఎర్రకోట మీంచి ప్రసంగిస్తూ చెప్పారు. కానీ మోదీ ప్రధాని పీఠం అధిష్టించకముందూ ఈ దేశంలో జనం జవసత్వాలతోనే ఉన్నారు.

భవిష్యత్తు గురించి ఇప్పుడు జనంలో భయం ఉండొచ్చు కూడా ఇంత కాలం భవిష్యత్తు మీద బోలెద్డు ఆశలు పెంచుకున్నారు. ‘భారత గజరాజును ముందుకు నడిపించిన మావటిలకు కొదవేలేదు.సమర్థులైన వారు ముందుకు నడిపించారు. ఆ నడక కొనసాగుతుంది’ అని సమాచార విశ్లేషకుడు ప్రవీణ్ చక్రవర్తి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. త్రిపురలో ఇటీవల తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలు తొలగించామని కూడా ప్రధాని ఎర్రకోట మీంచి ప్రసంగిస్తూ చెప్పారు. ఈ చట్టం అమలును 2015లో అప్పటి వామపక్ష ఫ్రంట్ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తొలగించారు. ఈ చట్టం ఉమ్మడి జాబితా కిందకు వస్తుంది. త్రిపురలో అమలు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వమే. చరిత్రను సొంతం చేసుకోవడానికి ఆరాటపడడం వేరు. వక్రీకరించడం వేరు. మోదీ ఈ రెండు పనులూ చేయగలరు. అదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున!

అంతరిక్షంలోకి భారతీయుడిని పంపాలన్నది తన కల, ఆకాంక్ష అని మోదీ అన్నారు. వాస్తవం ఏమిటంటే 34 ఏళ్ల కిందటే రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. ఆయన భారతీయుడే. 1957లో రష్యా స్పుత్నిక్ ప్రయోగించిన తర్వాత భారత శాస్త్రవేత్తలు, తొలి ప్రధాని నెహ్రూ అంతరిక్ష ప్రయోగాల ఆవశ్యకత గుర్తించారు. అంటే స్పుత్నిక్ ప్రయోగం తర్వాత నాలుగేళ్లకే మన దేశంలో అంతరిక్ష ప్రయోగాల మీద దృష్టి నిలిపారు. దీనికి ప్రధాన సూత్రధారి మోదీ మెచ్చని నెహ్రూ. 1975లోనే మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించాం. పదేళ్ల కిందే 2008లో మన శాస్త్రవేత్తలు చంద్రుడి కక్ష్యలోకి చిన్న రోబోటిక్ అంతరిక్ష నౌకను ప్రయోగించి ఘన విజయం సాధించారు. భారత అంతరిక్ష పరిశోధనకు అంకురార్పణ జరిగింది 1961లో. అదీ విక్రం సారాభాయ్ నేతృత్వంలో.

అంగారక గ్రహం మీదకు ఉపగ్రహం పంపించి అయిదేళ్లయింది. అయిదేళ్లంటే కచ్చితంగా 2014 కు ముందే! పదేళ్ల కిందటే పది ఉపగ్రహాలను ఒకే సారి ప్రయోగించాం. ఇటీవలే 31 ఉపగ్రహాలను ఒకే సారి ప్రయోగించి యావత్ప్రపంచాన్ని అబ్బుర పరిచాం. ప్రస్తుతం అంతరిక్ష విజ్ఞానాన్ని ఇతర దేశాలకు అందించగలిగిన స్థితిలో ఉన్నాం. మోదీ ప్రసంగాలలో చరిత్రకు సంబంధించిన సమాచారం సవ్యంగా ఉండకపోవడం కొత్త కాదు. ఆయన ప్రసంగ పాఠాలు సిద్ధం చేసే ప్రధాని కార్యాలయంలోని పెద్దలు వాస్తవాలు పరిశీలించరో, లేదా వారికీ తెలియవో, మోదీ తన గంభీర ప్రసంగాల్లో ఈ అంశాలను పట్టించుకోరో తెలియదు. ఈ మూడు కారణాల్లో ఏది నిజమైనా వచ్చే సమాధానం మాత్రం ‘తెలియదు‘ అనే. వెలుతురులో నిలబడితే నీడలు పడతాయి జాగ్రత!!