Home ఎడిటోరియల్ ఒకే ఎంట్రెన్స్ పరీక్ష ఉత్తమం

ఒకే ఎంట్రెన్స్ పరీక్ష ఉత్తమం

Entrance-testసాంకేతిక విద్యాసంస్థల్లో ఎంట్రెన్స్ పరీక్షల విధానాన్ని సంస్కరించతలపెట్టిన అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఎ.ఐ.సి.టి.ఇ.) సమీక్షా కమిటి సిఫారసులు స్వాగతించదగినవి. ప్రస్తుత ఎంట్రెన్స్ పరీక్ష విద్యార్థులకు పెనుభారంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్స్ నిమిత్తం రాష్ట్రప్రభుత్వం తరఫున సాంకేతిక విద్యామండలి ఒక కామన్ పరీక్ష (ఉదా.ఎంసెట్) నిర్వహిస్తుంటే, డీమ్డ్ యూనివర్శిటీలు, మైనారిటీ విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థలు విడివిడిగా ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒకే కోర్సులో ప్రవేశార్హత సంపాదించేందుకు విద్యార్థులు వేర్వేరు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఆర్థికంగానేగాక మానసికంగా వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నది. ఈ పరిస్థితిని నివారించేందుకు అఖిల భారత ప్రాతిపదికపై ఇంజినీరింగ్ కోర్సులకు ఒక పరీక్ష, మేనేజిమెంట్ కోర్సులకు ఒక పరీక్ష నిర్వహించటం ఉత్తమమని కమిటీ సిఫారసు చేసింది. అయితే ఇది ఎఐసిటిఇకి అనుబంధమైన కాలేజీలకే వర్తిస్తుంది. మైనారిటీ, డీమ్డ్(ప్రైవేటు) యూనివర్శిటీలకు వర్తింప చేయటానికి ఆచరణాత్మక చిక్కులుండవచ్చు. కాని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ చొరవచేసి వాటి యాజమాన్యాలతో మాట్లాడి ఒప్పించ గలిగితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే కమిటీ మాత్రం ‘నేషనల్ సర్వీసు’ ద్వారా ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించాలని, డీమ్డ్ సహా అన్ని యూనివర్శిటీలు ఈ ఫలితాలు ఉపయోగించుకోవాలని సిఫారసు చేసింది.
కౌన్సిలింగ్ ముగిసిన తదుపరి మిగిలిపోయిన సీట్లను మేనేజిమెంటు కోటాగా పరిగణించకుండా వెయిటింగ్ లిస్ట్‌లోని విద్యార్థులకు కేటాయించాలన్న సిఫారసు ఎంతైనా మెచ్చదగింది. అయితే ఆచరణ సాధ్యమేనా అన్నది అనుమానం. మేనేజిమెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా అంటూ రాష్ట్రప్రభుత్వాలు ప్రైవేటు కాలేజీల కిచ్చిన వెసులుబాటు వాటికి కాసులపంట పండిస్తున్నాయి. ఇది వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రీతుల్లో ఉండివుండవచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే, ఫీజులను ప్రభుత్వం నిర్ణయిస్తూ, మేనేజిమెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలను అధికారికం గానే అనుమతిస్తున్నాయి. యాజమాన్యాలు వీటిని మరీ ఇష్టారాజ్యంగా కాకుండా, దరఖాస్తుదారులనుంచి మెరిట్ ప్రాతిపదికగానే అమ్ముకోవా లని గత సంవత్సరం ఆదేశించాయి. ఎంతవరకు అమలు జరిగిందో చెప్పలేము. ఎన్‌ఆర్‌ఐ కోటానుకూడా స్థానికులకే అమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేనేజిమెంట్ కోటాను వెయిటింగ్‌లిస్ట్ విద్యార్థులకు కేటాయించటాన్ని (రెట్టింపు ఫీజుకే అయినా) యాజమాన్యాలు ప్రతిఘటి స్తాయి. కాదంటే ఫీజులు పెంచాలని రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాయి.
ఎఐసిటిఇ కింద ప్రస్తుతం ఇంజనీరింగ్, మేనేజిమెంట్ కాలేజీలు 11వేలకుపైగా ఉన్నాయి. ఎఐసిటిఇని పునర్వవస్థీకరించే, పటిష్టపరిచే దృష్టితో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ 2014 నవంబర్‌లో విద్యాశాఖ మాజీ కార్యదర్శి ఎం.కె.కా అధ్యక్షతన సమీక్షా కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇప్పుడు మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది.
ప్రమాణాలు లోపించిన విద్యాసంస్థలగూర్చి కూడా కమిటీ అనేక సిఫారసులు చేసింది. వాటిని మెరుగుపరిచేందుకు ఎఐసిటిఇ క్రియాశీలంగా వ్యవహరించాలని కోరింది. గతంలో ఎఐసిటిఇ అవినీతియమై కుప్పతెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతు లిచ్చింది. ఫాకల్టీలేదు, ప్రమాణాలు లేవు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ మీద ఆధారపడి నడిచే కాలేజీలు నాసిరకం గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా తయారైనాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా లక్షమందికిపైగా ఇంజినీరింగ్ పట్టభద్రులు ఉత్పత్తి అవుతున్నా, వెంటనే ఉద్యోగానికి పనికివచ్చేవారు 10-15 శాతం మించటం లేదంటే సాంకేతిక విద్య ఎంత నాసిరకంగా ఉందో ఊహించుకోవచ్చు. కాబట్టి సాంకేతిక విద్యను పూర్తిగా సంస్కరించాలి. పరిశ్రమలతో అనుసంధానం తో అవసరాలకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. కేంద్రప్రభుత్వం ‘నైపుణ్యత అభివృద్ధి’కి ప్రత్యేక కార్యక్రమం కూడా ప్రకటించింది. దేశ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు నిపుణతగల శ్రామికుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ, విలువలతో కూడిన విద్యపేరుతో స్కూలు విద్యను ఛాందసంవైపు మళ్లించే ప్రయత్నాలను పక్కనబెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా కాలేజీ విద్యను మలచగలిగితే ఎంతో మేలు జరుగుతుంది. విద్యనాణ్యత పెంచటంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.