Home ఎడిటోరియల్ సైన్స్ అంటే టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు

సైన్స్ అంటే టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు

CV-Ramanఆదిమకాలంలో చెట్టు తొర్రల్లో, కొండ గుహల్లో మిగతా జంతువులలా ఏది దొరికితే దానిని అలాగే ముడి సరుకుగా వాడుకున్న మానవులు నేడు సముద్ర గర్భాల లోతులను జయిస్తున్నా, విశ్వాంతరాళ రహస్యా లను చేధిస్తూ వినువీధుల్లోకి దూసుకువెళ్తున్నా, వైజ్ఞానిక ఆలోచనా విధానం వల్లనే . ఈ విజ్ఞానం ఏ మాయలు, మహిమలతో మానవాళి స్వంతం కాలేదు. ఒక్కపూటో, ఒక్క రోజో అకస్మాత్తుగా సాధ్యం కాలేదు. ఎవరో ఒకరి బుర్రల్లో ఉద్భవించలేదు. తరతరాల మానవాళి ఉమ్మడి అనుభవాల తరగని గని సైన్స్. మాల, మాదిగల లంది, కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, చాకిరేవు, మంగలి పొది, గౌడ కత్తి, గొల్లల గొడ్డలి సబ్బండ ప్రజలు, సహస్రవృత్తులతో సైన్స్‌ను తమ ఆచరణ నుంచి రూపొందించుకున్నారు. సైన్స్ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఉరకలెత్తే ఉత్తుంగ తరంగాల్లాంటి హేతుబద్ధ ఆలోచనా విధానంతో తమ రోజువారి ఆచరణతో మానవులు శోధించి, సాధించుకున్నవే నేటి సైన్స్ ఫలాలు. నేడు సాంకేతిక విజ్ఞానం మునుపెన్నడూ లేనంతగా మన జీవితాల్లో భాగమైపోయింది.
రోజురోజుకు కొత్త అంశాలను చేర్చుకుంటూ మార్పులకు గురవుతూ పురోగమిస్తుంది విజ్ఞానం. ఇది చలనశీలమైనది. ఎప్పటికప్పుడు వికసిస్తుంది. కొత్త కొత్త అంశాలను మన జ్ఞానభాండాగారంలో చేరుస్తుంది. అందుకే కాళోజీ అంటాడు “నాది నిత్య నూతన వికసిత జ్ఞానం – మీది బుద్ధి, జాఢ్య జనితోన్మాదం” అని.

ఘనీభవించిన ఆలోచనలతో సూర్యుడిని పాములు మింగాయనే ఊహలతో బతికే బుద్ధి జాఢ్య జనితోన్మాదులు ప్రశ్నపై దాడి చేస్తున్నారు. బక్కెద్దులని ఆపలేని పలుపులతో మెరుపులను బంధించాలని చూస్తు న్నారు. తమ అజ్ఞానపు వలలతో ఎగిసిపడే కెరటాలను అణచాలని వెర్రి ప్రయత్నాలే చేస్తున్నారు. వెలుగును బంధించాలని చీకటి విశ్వప్రయత్నం చేస్తున్నది. కిరణాలను గుప్పిటపట్టి సూర్యుడినే అంతం చేయొచ్చని కలలు కంటున్నది. వైజ్ఞానికుల, హేతువాదుల ప్రాణా లు తీయడం ద్వారా మొత్తం సమాజాన్ని చీకటిలోకి నెట్టాలని మతోన్మాదం చూస్తున్నది. వేల సంవత్సరాల వెనక్కు మానవాళిని లాక్కెళ్లాలని ప్రయత్నిస్తున్నది. సత్యాన్ని సహించలేని తత్వం, భిన్నాభిప్రాయాల పట్ల అసహనం ఇటీవల కాలంలో పెరుగుతున్నది. మనలను మళ్లీ రాతియుగంలోకి తీసుకువెళ్లాలని ప్రయ త్నిస్తున్నది. ఈ అసహన ధోరణులే విజ్ఞాన ప్రేమికుల, హేతువాదుల, అమాయకుల ప్రాణాలు బలి తీసు కుంటున్నాయి.

మతోన్మాదం ప్రస్తుతం మన దేశంలో దేశభక్తులపై, వైజ్ఞానికులపై, అమాయకులపై దాడులు చేస్తున్నది. ప్రజల సంస్కృతిపై, ఆహారపు అలవాట్లపై, భావాలపై దాడులు జరుగుతున్నాయి. మనువాద ధర్మాలు ప్రజల భావాలను నియంత్రించాలని చూస్తున్నాయి. డిసెంబరు 25, 1927 లో మహనీయుడు అంబేద్కర్ చేతిలో తగల బెట్టబడిన మనుధర్మాలు తిరిగి జూలు విదుల్చుకుని విశృంఖలంగా విజృంభించాలని చూస్తున్నాయి. గాంధీ ని చంపినట్లే ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేయాలని చూస్తు న్నాయి. నియంతృత్వ రాజ్యాలను నెలకొల్పాలని తీవ్ర కృషి చేస్తున్నాయి. నేడు గాడ్సేలు వికటాట్టహాసం చేస్తున్నారు. ఈ అసహన ధోరణులను, మతోన్మాద దమన కాండను నిరసిస్తూ కవులు, కళాకారుల, విజ్ఞాన వేత్తలు, మేధావులు గళమెత్తుతున్నారు. అనేకపద్ధతుల్లో తమ భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అవార్డులను వాపసు ఇచ్చి నిరసన తెలుపుతున్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారి వందమందికి పైగా శాస్త్రవేత్తలు సంతకాలు చేసి బహిరంగంగా ఈ మతోన్మాద అసహనం, దాడులపైన నిరసన తెలిపారు. ఇప్పుడే కాదు ప్రశ్నపై, ఆలోచనపై, హేతువుపై, విజ్ఞానంపై దాడి తరతరాలుగా సాగుతున్నది. ధర్మ రాజు తప్పులను ప్రశ్నించిన చార్వకుడిని కాల్చి చంపి నప్పటినుండి, విలువిద్య, జ్ఞానాన్ని పొందిన గిరిజనుడి నుండి ఆ జ్ఞానాన్ని లేకుండా పొందాలని ప్రయత్నించిన శంబూకుడిని హత్య చేసినప్పటి నుండి, వర్ణవ్యవస్థను తీవ్రంగా నిరసించి, యజ్ఞయాగాదులను వ్యతిరేకించిన బౌద్ధులను చంపినప్పటి నుండి ఈ దాడులు సాగుతూనే ఉన్నాయి. అయినా ప్రశ్నించే తత్వం, జిజ్ఞాస వంటి సాధనాలతో విజ్ఞానం పురోగ మిస్తూనే ఉన్నది.

మనదేశంలోనే కాదు. ప్రపంచమంతా మతాలన్నీ చేస్తున్న పని ఇదే. క్రీ.పూ.350లలోనే ఆకాశాన్ని పరిశీ లించి నిజాలను వెల్లడించిన మహిళా శాస్త్రవేత్త హైపేషి యాను తమ నమ్మకాలు దెబ్బతిన్నాయని చర్మాన్ని వలిచి కిరాతకంగా హింసించి చంపింది మతోన్మాదం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే సత్యం చెప్పినందుకు తమ విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని కోపర్నికస్‌ను అవమానించింది. గెలీలియోను జైలు పాల్జేసింది. బ్రూనోను సజీవదహనం చేసింది. ఎంతో మంది శాస్త్రజిజ్ఞాసపరులు సత్యాలను వెల్లడించి నందుకు మతోన్మాద దాడులకు గురై మరణించారు. వారి మరణ శాస్త్రవిజ్ఞాన పురోగమనం ఆగిపోలేదు. భౌతికవాద వెలుగులతో మానవాళి వైజ్ఞానిక బాటలో మునుముందుకు రాకెట్‌లా దూసుకెళుతున్నది. “దేవతలంతా ఇంద్రునిలో నుండి పుట్టారు. ఇంద్రుడు ఆదిశక్తినుండి, ఆదిశక్తి బ్రహ్మనుండి వచ్చా రు. సరే, బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు?” అని గార్గి యాజ్ఞవల్కుడిని ప్రశ్నిస్తున్నది. గార్గీ అధిక ప్రసంగం చేయకు. హేతువాదానికొక పరిమితి ఉన్నది అని గార్గి ప్రశ్నల పరంపరను నియంత్రిస్తాడు యాజ్ఞవల్కుడు.

దేశంలో ఆదిమ భౌతికవాదులు చార్వాకులు. అసితకేశకంబలుడు, మక్కలి ఘోషాల్, పూర్ణ కాశ్య పుడు, ప్రకృధకాత్యాయన్, నిఘంటునాధపుత్త, సంజయవేలట్టిపుత్త వంటివారు చార్వాక ప్రచారకులు. వీరే అనేక ప్రశ్నలను బాణాల్లా ఛాందసవాదులపై విసిరారు. వాటికి సమాధానం చెప్పుకోలేక ఛాందస వాదులు వారిపై దుష్ప్రచారం చేశారు. దాడులు చేశారు. మా నమ్మకాలు అనే ఛాందసవాదాన్ని వదిలేసి హేతువాద ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పాడు బుద్ధుడు. వర్ణ వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. యజ్ఞయాగాది క్రతువులను వ్యతిరేకించాడు. బుద్ధుడు బోధించిన సమానత్వం, స్వేచ్ఛ, ప్రేమ, శాంతి-సిద్ధాంతం అభ్యుదయకర పాత్ర వహించింది. ఏదీ శాశ్వతం కాదు. ప్రతీదీ మారుతుందన్న బోధ, పాత సమాజం నశించి, కొత్త సమాజం ఉద్భవించక తప్పదు అనే భావాన్ని కలిగించింది. “బహుజన హితాయ, బహుజన సుఖాయ” అను సందేశం అన్ని వర్గాలను ఆకర్షించింది. బౌద్ధంవలె జైనం కూడా వర్ణ వ్యవస్థను ఖండించింది. వేద ప్రామాణ్యాన్ని నిరాకరించింది. దేవుని త్రోసిపుచ్చింది. అహింసను బౌద్ధం కంటే తీవ్రంగా బోధించింది. యజ్ఞయాగాదులను ఖండిం చింది. వీటిప్రభావంతో దేశంలో శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగింది. అనేకమంది సత్యశోధకులు, భౌతికవాదులు, హేతువాదులు ఈ దేశాభివృద్ధికి పాటుపడ్డారు. హేతు వాద, భౌతికవాద భావాలను ప్రచారం చేశారు. ఆర్యభట్ట, చరకుడు, శుశ్రుతుడు వంటి శాస్త్రవేత్తలు విజ్ఞానాభివృద్ధికి కృషి చేశారు. వేమన, ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి వారు మనువాద భావాలను తీవ్రంగా ఎండగట్టారు.

దయానంద సరస్వతి, వివేకానంద వంటివారు సనాతన మతాన్ని ప్రచారం చేసినా మూఢనమ్మకాలను ఖండించారు. కులవ్యవస్థను ఖండించారు. కాని నేటి మతోన్మాదులు భిన్నాభిప్రాయాలను సహించలేక పోతున్నారు. సత్యాన్వేషణా జిజ్ఞాస పీకనులిమి వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా యజ్ఞయాగాలను ప్రోత్సహిస్తూ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ అన్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను సర్కస్‌గా మారుస్తున్నారు. వేదాల్లోనేసైన్స్ ఉందని, ఆ కాలంలోనే విమానాలు, గ్రహాంతర వాహ నాలు ఉన్నాయని, ప్లాస్టిక్ సర్జరీలు, టెస్ట్‌ట్యూబ్ జన నాలు ఉన్నాయని అశాస్త్రీయ అంశాలను సైన్స్ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలను అశాస్త్రీయ నిలయాలుగా మారుస్తున్నారు. విద్యావ్యవస్థను మత వ్యవస్థగా చేస్తున్నారు. దయానంద సరస్వతి, వివేకానంద వంటి మత ప్రచారకులు సైతం ఖండించిన జ్యోతిష్యం వంటి వాటిని యూనివర్శిటీల్లో కోర్సులుగా పెడుతున్నారు. పాఠ్యప్రణాళికల్లో అశాస్త్రీయ భావాలను గుప్పించి సైన్స్‌ను కేవలం సాంకేతిక విజ్ఞాన స్థాయికే పరిమితం చేస్తున్నారు.

అందుకే మన దేశంలో శాస్త్ర పరిశోధనలు కూడా టెక్నాలజీకే పరిమితమైనాయి. సైన్స్‌గా అభివృద్ధి చెందడం లేదు. ఫలితమే ఇస్రో ఛైర్మన్ స్థాయి శాస్త్రవేత్తలు కూడా రాకెట్ నమూనాలకు చెంగాలమ్మగుడిలో ముహూర్తాలు పెట్టిస్తున్నారు. పరిశోధనల స్థాయి కూడా రోజురోజుకు దిగజారు తున్నది. నేడు సైన్స్‌లో విధ్వంసక అంశాలు కీర్తించబడు తున్నాయి. సృజనాత్మకమైనవి చులకన చేయబడు తున్నాయి. క్షిపణి ప్రయోగాలకు, రాకెట్ ప్రయోగాలకు ప్రభుత్వం విపరీతమైన ప్రచారం కల్పిస్తుంది. ప్రజో పయోగమైన పరిశోధనా ఫలితాలను అసలు పట్టించు కోదు. ఒకవైపు శాస్త్రపరిశోధనలకు బడ్జెట్‌లో కోతలు పెడుతుంది. మరొకవైపు రక్షణరంగ పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. దీనివలన పరిశోధనలు కూడా ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ వ్యాపార ప్రయోజ నాలకు తోడ్పడే ఆవిష్కరణలే చేస్తున్నాయి. ఈ పరిశోధ నలు మానవాళికి ప్రమాదక రంగా మారు తున్నాయి. బిటి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పరిశోధ నలు విత్తన, ఎరువుల కంపెనీలకు వరంగా మారి రైతుల పాలిట శాపంగా పరిణమించడం ఇందుకు ఉదాహరణ. దేశానికి నోబెల్ బహుమతి తీసుకువచ్చి దేశప్రతిష్ఠను ఎంతగానో పెంచిన సివి రామన్ జ్ఞాపకంగా ప్రతి ఏడు ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

2014లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం, 2015లో దేశనిర్మాణా నికి సైన్స్ అనే థీమ్స్‌తో జాతీయ సైన్స్ దినోత్సవాలను జరుపుకున్నాం. ఈ ఏడు అంటే 2016లో సైన్స్ అంశాలలో ప్రజల భాగస్వామ్యం పెంచడం ద్వారా దేశాభివృద్ధి అనే థీమ్‌తో జరుపు కుంటున్నాం. అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషకా హారం అందాలంటే సైన్స్ ద్వారానే సాధ్యం. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు రావా లన్నా సైన్స్ ద్వారానే సాధ్యం. అన్నార్తులు, అనాధలు ఉండని నవయుగం రావాలన్నా శాస్త్రీయ దృక్పథం ద్వారానే సాధ్యం.  మూఢనమ్మకాలు లేని, అశాస్త్రీయ భావాలు లేని, సత్యశోధనకు, జిజ్ఞాసకు ఆటంకంలేని సమాజం కోసం పాటుపడే మరియు రాజ్యాంగంలో రాసుకున్న ప్రజా స్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్రాన్ని కాపాడు కోవాలనే తపన ఉన్న వ్యక్తులు, శక్తులు అందరం కలిసి నడుద్దాం.వైజ్ఞానిక జ్ఞానం భావితరాలకు అందిద్దాం.

రచయిత: కరీంనగర్ జిల్లాశాఖ గౌరవ అధ్యక్షులు,
జన విజ్ఞానవేదిక తెలంగాణ, 9441967100
email: cm.ramaraja@gmail.com