Home తాజా వార్తలు ఆధార్‌తోనే గల్లంతు

ఆధార్‌తోనే గల్లంతు

ఉమ్మడి రాష్ట్రంలోనే మిస్, స్వరాష్ట్రంలో వాపస్ 

 పకడ్బందీగా వ్యవహరించని బిఎల్‌ఒలు
 ఒకే అపార్టుమెంట్‌లో 60 ఓట్లు హుష్

aots

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితాలో దాదాపు 30 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు వస్తున్న ఆరోపణలలోని నిజాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కా ర్యాలయానికి విస్మయం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిసి ఓటర్ల గల్లంతుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఐదేళ్ళ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివరాలను సంవత్సరాలవారీగా పట్టిక రూపంలో పంపాల్సిందిగా ఆదేశించడంతో లోతుగా కసరత్తు చేసి నివేదికను రెం డు రోజుల క్రితం రాష్ట్ర సిఇఓ కార్యాలయం పం పింది. 2016లో జాతీయ ఓటర్ల జాబితా ప్రక్షాళ న, ఆథెంటికేషన్ కార్యక్రమంలో భాగంగా ఆధార్ వివరాలతో అనుసంధానించడంతో లక్షల సంఖ్యలోనే ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలిగించాల్సి వచ్చిందన్న అంశాన్ని ఆ నివేదికలో పొందుపర్చిన ట్లు తెలిసింది.

అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆధార్ వివరాలు తప్పనిసరి కాకపోవడంతో బూత్ స్థాయిలోనే ఇంటింటి సర్వే చేపట్టి అర్హులైనవారిని జాబితాలో చేర్చే పనులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బూత్ స్థాయి సి బ్బందిపై రాష్ట్ర సిఇఓ కార్యాలయం పూర్తిస్థాయి లో విశ్వాసం వ్యక్తం చేయడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా సర్వే జరగనందున అర్హు లైనవారి పేర్లు కూడా జాబితాలో చేరలేదని తెలిసింది. రెండు రోజుల క్రితం సిఇఓ రజత్‌కుమార్ స్వయంగా మేడ్చల్ వెళ్ళి ఓటర్ల జాబితా సవరణ పనులను పరిశీలించిన తర్వాత గత ఎన్నికల్లో ఓటు వేసిన సుమారు యాభై వేల మంది ఓటర్ల పేర్లు ఈసారి జాబితాలో మాయమైనట్లు గుర్తించారు. వారితో మళ్ళీ ఫారం 6 ద్వారా జాబితాలో చేరడానికి దరఖాస్తులను సిఇఓ కార్యాలయం ఆహ్వానించింది. నగరంలోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఉన్న చెరుకుతోట కాలనీలోని నవ్య ప్రైడ్ అపార్టుమెంటులో సుమారు అరవై మంది ఓటర్ల పేర్లు జాబితా నుండి మాయమయ్యాయి.

తొలి రెండు అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లను మాత్రమే బిఎల్‌ఓ సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించి జాబితాలో చేర్చారు. మిగిలిన మూడు అంతస్తుల్లోకి వెళ్ళకుండానే ఆ అపార్టుమెంటు మొత్తం పరిశీలన చేసినట్లు రాసుకుని ఒక్కో అంతస్తులోని నాలుగు ఇండ్ల చొప్పున మొత్తం పన్నెండు ఫ్లాట్లలోని ఓటర్లను పట్టించుకోలేదు. బిఎల్‌ఓలు నిజంగానే బాధ్యతాయుతంగా అన్ని ఇండ్లనూ పరిశీలించి ఓటర్ల వివరాలను సేకరించి ఆధారాలను పరిగణనలోకి తీసుకుని జాబితాలో చేర్చినట్లయి తే ఇంత ఎక్కువ స్థాయిలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యేవికావని ఆ అపార్టుమెంటులోనివారు వ్యా ఖ్యానించారు. ఇలా అనేక చోట్ల జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అర్హత ఉన్నప్పటికీ జాబితా నుం చి పేరు గల్లైంతనవారు మళ్ళీ ఇప్పుడు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. పది రోజుల వ్యవధిలోనే దాదాపు 18లక్షల దరఖాస్తులు వచ్చి నట్లు స్వయంగా సిఇఓ రజత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి సిఇఓ కార్యాలయం హయాంలోనే ఇదంతా జరిగినట్లు తాజాగా నివేదిక సమర్పిస్తున్న సమయంలో తేలింది. వివరాల్లోకి వెళ్తే… 2014 జనవరికి రాష్ట్రంలో 2.70 కోట్ల మంది కంటే ఓటర్లు ఉంటే ఆ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే నాటికి దాదాపు పన్నెండు లక్షల మంది ఓటర్లు పెరిగి 2.83 కోట్లకు చేరుకుంది.

ఆ తర్వాతి సంవత్సరం జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సైతం ఓటర్ల సంఖ్యలో పెద్దగా తేడాలు లేకపోవడంతో 2.83 కోట్లుగానే ఉండిపోయింది. రాష్ట్ర సిఇఓ కార్యాలయం అధికారులతో పాటు కేంధ్ర ఎన్నికల సంఘం కూడా తన వెబ్‌సైట్‌లో దీన్ని స్పష్టం చేసింది. 2016లో ఓటర్ల ప్రక్షాళనకు ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనతో చాలా హెచ్చు సంఖ్యలోనే ఓటర్లు తొలగించబడ్డారు. ఒకవైపు ఆధార్ కార్డు అనుసంధానం, మరోవైపు బిఎల్‌ఓల మొక్కుబడి పరిశీలన, అన్నింటికీ మించి ఉమ్మడి సిఇఓ కార్యాలయం ఉన్నప్పుడు జరిగిన ఈ లోపాలన్నీ ఇప్పుడు బైటకు వచ్చాయి. మరింత లోతుల్లోకి వెళ్ళి వివరాలను పరిశీలన చేయడానికి అప్పటి ఫైళ్ళు, సర్వే చేసిన వివరాలు, ఏయే నియోజకవర్గంలో ఏ మేరకు మార్పు వచ్చింది తదితర వివరాలేవీ ప్రస్తుతం తెలంగాణ సిఇఒ కార్యాలయానికి అందుబాటులో లేవు.