Home మంచిర్యాల మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర

మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర

mango

* పూత కరువు, రైతుల గుండె బరువు
* దిగుబడులపై సన్నగిల్లుతున్న ఆశలు
* మామిడి రైతులకు అనుకూలించని వాతావరణం
* మామిడి ఈసారి మరింత ప్రియం

మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. దీంతో రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత ఏడాది ఆశించిన మేరకు దిగుబడులు వచ్చినప్పటికి మార్కెట్ సౌకర్యం లేకపోవడం వలన రైతులు నష్టపోగా ఈ సంవత్సరం ప్రకృతి అనుకూలించకపోవడంతో పూతలేక కాతలేక రైతులు మరిన్ని నష్టాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆదిలోనే హంసపాది అన్నట్లుగా పూత దశలోనే ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంట దిగుబడులపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరోసారి వడగళ్ల వాన కారణంగా తాండూర్, బోయపల్లి ప్రాంతంలోని మామిడి తోటల్లో పిందెలు కూడారాలిపోవడంతో మామిడి పంటలనే నమ్ముకున్న రైతుల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. మంచిర్యాల జిల్లాలో పత్తి, వరి, మొక్కల జొన్నల సాగుతోపాటు మామిడి తోటలను ప్రధాన పంటగా రైతులు చెప్పుకుంటారు. జిల్లాలో సుమారు 17500 ఎకరాలను మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లోనే పూతతో కళకళలాడాల్సిన తోటలు ఈ సంవత్సరం పూతలు లేక వెలవెలబోతున్నాయి. ప్రకృతి అనుకూలించకపోవడం వాతావరణ సమతూల్యత లోపించడం. పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని చెన్నూర్‌లో 7400 ఎకరాలు, బెల్లంపల్లిలో 8500, మంచిర్యాలలో 1400 ఎకరాల్లో మామిడితోటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా చెన్నూర్, బోయపల్లి, తాండూర్, నెన్నెల, జైపూర్, భీమారం, కన్నెపల్లి , దండేపల్లి, జన్నారం, మందమర్రి, వేమనపల్లి మండలాల్లో రైతులు ప్రధానంగా మామిడి పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో మామిడితోటల సాగుపై ప్రభుత్వం ఉద్యానవన ఉపాధి శాఖ ద్వారా ప్రొత్సాహం లభించడం వలన రైతులు మామిడి తోటల పెంపకంపై ఆశక్తి చూపుతున్నారు. దీంతో రైతులు ప్రతి సంవత్సరం 400 ఎకరాల్లో అదనంగా తోటలు పెంచుతున్నారు. వీటిలో బంగనపల్లి, దసిలి, తోటబరి, సుందరి, చెరకు, పంచదార రకపు తోటలను పెంచుతున్నారు. కేవలం చెట్లను చూసి, లక్షలు వెంచించి కలువుకు తీసుకునే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. గత ఏడాది ధరలు లేక చేతులు కాల్చుకున్న రైతులు ఈసారి పూత దశలోనే చుక్కలు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కౌలు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరం
మామిడి తోటలను యాజమానుల నుండి కౌలుకు తీసుకున్న కౌలు రైతులు ప్రతి సంవత్సరం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. కౌలు వ్యవహారం పూత దశకంటే ముందుగానే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందం ప్రకారం కౌలు రైతులు ముందుగానే యాజమానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మామిడి దిగుబడితో యాజమానికి సంబంధం లేకుండా లాభ నష్టాలను కౌలు రైతులే భరించుకుంటారు. కాగా కౌలు రైతు మామిడిపంట పూత అయిన తరువాత అప్పు చెల్లింవచ్చనే ధీమాలో ఉండి అప్పులు చేస్తుంటారు. ప్రకృతి వైపరిత్యాల నేపథ్యంలో పంటలు దెబ్బలు తిని రైతులు నష్టాల పాలైన వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అప్పుల భారం పెరిగిపోయి. ఆర్థిక ఇబ్బందులు దిగమింగుకోలేక మామిడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు లేకపోలేదు. ఏదిఏమైనా పంట దిగుబడులు లేకపోవడం వలన మార్కెట్‌లో ఈసారి మామిడి మరింత ప్రియం కానుంది.