Home ఎడిటోరియల్ అమాసలో పున్నమి రేఖలే కవిత్వం

అమాసలో పున్నమి రేఖలే కవిత్వం

poetryమనిషికి మార్మికతకు విడదీయరాని బంధం ఉంది. కాబట్టి కళలకు ఆకర్షిడవుతాడు. తనలోని భావోద్వేగాల సాంత్వనే ఈ ఆకర్షణ. మనసుకింపు కలిగేదే కళ. నడకలోని వయ్యారమే కళ. చూపులకు అర్థాలు అద్దడమే కళ. రంగుల్ని రసగంగలా కలపడమే కళ. మాటల్ని హారంగా ముడివేయడమే కళ. అన్ని చప్పుళ్లూ మనిషిని మురిపించలేవు. దడదడలాడే చప్పుడుకు ఇదేమి గోల అనుకుంటూ దూరమైతే, వేణుగానానికి దగ్గరవుతాడు. శ్రావ్యతలో ఉల్లాస గుణముంది. శబ్దం లయబద్ధమైనపుడే సంగీతమవుతుంది. నిజానికి కళాకారుడు తన కళలో తాను తాదాత్మత చెంది ఆనందిం చడానికే దానిని సృష్టిస్తాడు. నలుగురు బాగుందన్నప్పుడు దాన్ని అందరికీ పంచిపె డతాడు. అన్ని కళలలాగే అక్షరమాల అల్లిక కూడా క్లిష్టతరమైనది. పదాల ‘కూర్పు’కు ‘పొందిక’కు మధ్యనున్న భేదాన్ని ఒడిసిపట్టినవాడే కవి అ వుతాడు. మిగితా కళల తీరే కవిత్వం కూడా వస్తు, రూపాల కన్నా సారప్రదా నమైనది. కాదేదీ కవితకనర్హమన్నా, రాసింది కవిత్వం కావాలి. వస్తువేదైనా అది కవిత్వమైతేనే భాసిల్లుతుంది. ఈ మధ్య కవి పిన్నంశెట్టి కిషన్ ‘…. ఆరోగ్యానికి హానికరం’ అంటూనే మద్యం మత్తులోని మజాను హృద్యంగా కవిత్వీకరించాడు. ‘దినమంతా తగిలి రగిలిన ఒత్తిడిని/ నెత్తురోడుతున్న గాయాల్ని తుడిచి మందేస్తుంది/ మధువు నవ వధువు / కొత్త బంగారు లోకపు తొలి తలుపు’ అంటూ విపరీత ప్రచారం జరుగుతుండగా అది మేలే చేస్తుందని కవి రాయడం అసమ్మతమేమీ కాదు. వస్తువుపై విభేదాలులో విషయం మనసుకు హత్తుకునేలా చెప్పడమే ఈ పంక్తులకు ప్రాణం పోసింది. కవి ఏది రాయాలీ అనే ఆంక్ష విధించే అధికారం ఎవరికీ లేదు. రాసింది కవిత్వమైతే నిలుస్తుంది.

రాజదర్బారుల్లో గౌరవింపబడిన కవిత్వానికి కవి విద్వత్తే ప్రధానం. ‘లక్ష తొంబయ్యారు జీవుల పుట్టుకేమో ఇక్కడ / పాపకర్మల ఫలితమనుభవించేదేమో అక్కడ’ అంటూ బైరాగులు పాడే తత్వాల్లో సామాజిక జీవన చిత్రం ప్రధానం. రెంటికీ ప్రాణం పోసేది మాత్రం శిల్ప నైపుణ్యతే.
క్రీస్తు శకం తొలినాళ్లలో హాలుడు సేకరించిన ప్రాకృత గాథా సప్తశతిలోని జీవగుణమే దాన్ని ప్రపంచ భాషల్లోకి తీసికెళ్లింది. ‘మొగుడు, కొడుకు/ ఇద్దరి మధ్య కూర్చున్నా ఇల్లాలి చన్నుల్లో / ఒకటి పులకరించినది /ఇంకోటి పాలు గార్చినది’ అంటూ రెండు ముక్కల్లో స్త్రీత్వాన్ని మూటగట్టడం కవిత్వంవల్లే సాధ్యమైంది. శతాబ్దాలు గడిచినా వెలిసిపోని కవిత్వమే గాథా సప్తశతి. 14వ శతాబ్దంలోనే భోగలాల సత్వం నుండి యోగి పుంగవుడయిన వేమన తన తాత్విక చింతనను పద్యాల రూపంలో ప్రకటించాడు. తన జీవనానుభవసారాన్ని సులభ గ్రాహ్య, భాష సొగసులద్ది చిర స్థాయిగా నిలిచే జ్ఞాన సంపదని తన ముందు తరాలకు అందించాడు. ‘తల్లి దండ్రుల యందు దయలేని పుత్రుడిని పుట్టిగిట్టే చెదలుతో పోల్చాడు. ‘పీయి తినెడి కాకి పితురుడెట్లయెరా’ అని చెంప చెళ్లుమనిపించాడు. అంతకు ముందే కబీర్‌దాసు ‘మోల్ కరో తల్వార్‌కీ పడే రహెన్ దో య్యాన్’ ( ఒరను పక్కన పడేసి ఖడ్గానికి వెలకట్టు) అంటూ పైపై మెరుగులను తీవ్రంగా ఖండించారు. అక్షరమక్షరం నీతిని బోధించినావారి రచనలు సాహిత్యంలో భాగమవడానికి కారణం వాటిలో గుభాలించే కావ్య సౌందర్యమే కారణం.

19, 20 శతాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కమ్యూనిస్టు ఉద్య మాల వల్ల కవిత్వం ప్రయోజకత్వంలో మార్పు వచ్చింది. వినూత్న భాషా ప్రయోగం, వ్యక్తీకరణలతో వచ్చిన శ్రీశ్రీ మహా ప్రస్థానం మిరిమిట్ల ముందు మిగతాదంతా వెలవెలపోయింది. ప్రపంచ బాధను శ్రీశ్రీ పలవరించాడు. అప్పుడప్పుడే ఎదిగి వస్తున్న మధ్య తరగతి విద్యావంతులు ఆ సాలును అందు కున్నారు. అయినా ఆ బాటలో సాగిన వందలాది మందిలో కవులుగా నిలిచినవారు బహు కొద్ది మంది. ఈ శతాబ్దం నాది అని శ్రీశ్రీ ప్రకటించిన ఇన్నేళ్లకు కూడా ఈ దశాబ్దం నాది అని ఎవరూ ప్రకటించలేకపోయారు. మహా ప్రస్థానంలో ఏ సందేశమున్నా అందులోని ప్రవాహ దృతి, భాషా సౌందర్యం దానిని కాలాతీత కవిత్వంగా నిలుపుతోంది.
ఏ కవిత్వమైనా అది కవి జీవనానుభవాలకు, అవగాహనలకు దర్పణమే. అందుకే అందని అంశాలపై గంతులు వేయకుండా సెల్ఫ్ పొట్రాయిట్‌గా తన మనో భావాలను చిత్రించాలి. లోహమే దైనా నగిషీలతోనే జీవ గుణం వస్తుంది. నగిషీలు కుదరని సృష్టి ముతక సరుకు వాసన కొడుతుంది. 20వ శతాబ్దంలో తమ భావ చైతన్య ముద్రను వేసి కవికుల గురువులుగా వన్నెకెక్కిన వారిలో గురజాడ అగ్రగణ్యులు. దేశమంటే మట్టి కాదోయ్ / దేశమంటే మనుషులోయ్’ అనే శక్తి సూక్తులు తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటాయి. ఇదే క్రమంలో ‘తరతరాల బూజు మా నిజాం రాజు’, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న చరణాలు దాశరథికి కీర్తి తోరణాలు. ‘పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అని మరో మహానుభావుడికి నివాళిగా రాసి న కాళోజీ పంక్తులు ఆయన జన్మకూ సరిపోతాయి. ఈ మధ్య కాలం చేసిన సోమసుందర్‌ను తలచినప్పుడల్లా’ ఒక వీరుడు మరణిస్తే వేనవేలు ప్రభవిం తురు’ అని ప్రస్తావించని కథనం లేదు. ‘మరణం నా చివరి చరణం కాదు’ అని చివరి మాటగా చెప్పిన అలిశెట్టి ప్రభాకర్ సార్థకత సాధించాడు. శ్రీశ్రీని ఎటు తిప్పినా కవితోక్తులే రాలిపడతాయి. ‘నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అని ఎన్నయినా ఏరుకోవచ్చు.

రాజదర్బారు నుండి జనంలోకి వచ్చిన కవిత్వం మళ్లీ ఓ మలుపు తీసుకుంది. స్వాతంత్య్రానంతరం దేశంలో వచ్చిన మార్పుల కారణం గా నేడు కవిత్వం ఉద్యోగుల ఏలుబ డిలో ఉంది. నెల జీతం అందుకొని సురక్షిత వలయంలో ఉన్నవారు అభిరుచిలో భాగంగా రచనలు చేస్తు న్నారు. వారికున్న పరిమిత జీవనా నుభవానికి పుస్తక పఠనం ద్వారా వచ్చిన టెక్నిక్‌ను తొడుగులావాడి కవితా నిర్మాణం చేస్తున్నారు. రూ పం సరిపోయినా బోలుతనం వల్ల బరువు తగ్గుతోంది. చాలా వరకు వస్తువు నగర పొలిమేరల ఆవల ఉంటే, హస్త లాఘవం నగరం నాలుగు గోడల మధ్య ముంది. అందుకే కవులకు ప్రసార మాధ్యమాలే ఉత్ప్రేరకాలవుతున్నాయి. వందలాది మంది రైతుల ఆత్మహత్యలపై ఒకరిద్దరు రైతు బిడ్డ కవుల ఆక్రందనలు తప్ప ఆశించినంత కవిత్వం రాకపోవడానికి కారణం రైతు శవం కవికి కిలోమీటర్ల దూరంలో ఉండి, ఆ వార్త వచ్చిన పత్రిక చేతిలో ఉండడమే. శరత్ కథలెన్నో ఆయన ఇంటి చూరులో దొరికాయట. బతికినన్నాళ్లు రాయడమే పనిగా పెట్టుకున్నా ఆయన ప్రతిభ మరణాంతరమే వెలుగులోకి వచ్చింది. రాస్తూ వెళ్లడమే రచయిత లక్షణం. గుర్తింపు పక్కనే ఉండాలనో, వెనుకెనుకే రావాలనో అనుకోవడం పేరాశ. అక్షరంలో ఆ తేజస్సు ఉంటే ఆపడం ఎవరితరం కాదని అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం నిరూపించింది. ప్రస్తుతం కవిత్వం రాస్తున్న వారిలో కవిత్వమే వ్యసనమైన సీనియర్ కవులున్నారు. మర చెంబునైనా, మడత కూర్చీనైనా కవిత్వంలోకి దింపగల దిట్టలు వారు. అయితే రచనను వ్యాపకం చేసుకున్నవారే అధికం. కవిత్వానికి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కవిత్వమెప్పుడూ వాదాలకతీతమే. ఆ సంతృప్తి స్థాయికి చేరే అంశం మద్యం మత్తయినా మాసిన గెడ్డమైనా చదువరికి యిష్టమే. కవిత్వం రుచి మరిగిన వారికి కడుపారా ఆతిథ్య మియ్యవలసింది కవులే కదా! కావ్య దాత సుఖీభవ!

– బి. నర్సన్ , 94401 28169