Home నిజామాబాద్ నవాబ్ అలీ కృషికి.. పునర్ జీవం

నవాబ్ అలీ కృషికి.. పునర్ జీవం

Nawab Ali's effort to revive life

మనతెలంగాణ/ నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాను సాగునీటి రంగంలో అగ్రగామిగా నిలిపి జిల్లాను అన్నపూర్ణగా తీర్చిదిద్దినా నాటి సాగునీటి దార్శనికుడు, తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ శ్రమను తెలంగాణ సర్కారు గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నవాబ్ అలీ శ్రమను, కృషిని ప్రపంచానికి చాటి చెబుతూ చరిత్ర దాచిన కృషిని జాతికి తెలిసేలా చేశారు. భారతదేశంలోనే ఉన్నతమైన సాంకేతిక నిపుణిడిగా సేవలందించిన తెలంగాణకు చెందిన మీర్ అహ్మద్ అలీ అలియాస్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌ను తెలంగాణ సాగునీటి రంగ పితామహుడిగా కెసిఆర్ గుర్తించారు. అంతటితో ఆగకుండా జూలై 11న ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ద్వారా వలస పాలకులు దాచిన చరిత్రను తెరపైకి తెచ్చారు. నిజాం ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతంలో పురుడుపోసుకున్న, పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగం ఎంత గొప్పగా ఉండేదో, గొలుసుకట్టు చెరువుల కాకతీయ వైభవాన్ని ఉద్యమ సమయంలో చాటి చెప్పిన కెసిఆర్ తిరిగి తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దేందుకు సాగునీటి రంగంలో విప్లవానికి నాంది పలికిన విషయం తెలిసిందే. కృష్ణ, గోదావరి నదులపై చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో నవాబ్ అలీ చేపట్టిన ప్రాజెక్టులకు తిరిగి పునర్జీవం తేనున్నారు. ఈ సందర్బంగా నవాబ్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆయన సేవలపై మనతెలంగాణ అందిస్తున్న పలు అంశాలను గుర్తు చేస్తుంది. ప్రభుత్వ హయంలో సామాజిక ఉద్యమాలతో అట్టుడికిన అప్పటి హైదరాబాద్ రాజ్యంలో నిజాం ప్రభుత్వంలో సహయ ఇంజనీర్‌గా చేరిన ఆయన మంజీర నదిపై నిజాంసాగర్ నిర్మాణానికి నిజాంను ఒప్పించారు. ఫలితంగా దాదాపు 2లక్షల 75వేల ఎకరాలను సాగునీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టుకు1933లో రూపకల్పన జరిగింది. 24 టిఎంసిల నీటి సామర్థంతో అద్బుత ఇంజనీరింగ్ నైపుణ్యంతో అనతికాలంలో పూర్తయిన ప్రాజెక్టు నవాబ్ అలీ గొప్పతనాన్ని చాటింది. అప్పటికి కేవలం చిన్నచిన్న చెరువు కుంటలపై ఆదారపడి సాగుతున్న సాగునీటి రంగంలో అద్బుతమైలు రాయిగా నిజాంసాగర్ సాగునీరు అందడాన్ని చెప్పుకోవచ్చు. ఫలితంగా నిజాంసాగర్, జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోదన్ నియోజక వర్గాలకు కాల్వల ద్వారా సాగునీరు అంది నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణగా వెలిగింది. ఆయన మదిలో పుట్టిన ఆలోచననే పుట్టిన మరో సాగునీటి ప్రాజెక్టుకు  అలీసాగర్ అని ఆయన పేరుతోనే పిలవడం గమనార్హం. వ్యవసాయ రంగంలో జిల్లాను అగ్రగామిగా నిలిపిన నవాబ్ అలీ ఆసియా ఖండంలో అతిపెద్దదైనా బోధన్ చక్కెర కర్మాగారాన్ని నిర్మించారు. దీంతో వ్యవసాయం రంగంలోను ఇటు ఉపాధి రంగంలోను అప్పటి నిజామాబాద్ జిల్లాను తీర్చిదిద్దినా నవాబ్ అలీని ఈ ప్రాంత ప్రజలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. పాలకులు సైతం నవాబ్ అలీ సేవలను తెరపైకి తీసుకురాకుండా ఉండడంతో చరిత్రలో ఆయన స్థానం కనుమరుగైన పరిస్థితి తెలంగాణ ఉద్యమం గుర్తించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నవాబు అలీ సేవలపై కితాబు ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆయన జ్ఞాపకార్థం పార్క్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పూడికతో నిండిపోయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం తెస్తామని ప్రతిజ్ఞ చేశారు. మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తరలించి నిజాంసాగర్ ఆయకట్టును పరిరక్షించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పనులు పూర్తి కావస్తుండగా కెసిఆర్ కృషితో నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ చేసిన కృషిని నిలబెట్టనున్నారు.