Home అంతర్జాతీయ వార్తలు నవాజ్ షరీఫ్, కుమార్తె అరెస్టు

నవాజ్ షరీఫ్, కుమార్తె అరెస్టు

లాహోర్‌లో దిగగానే అదుపులోకి తీసుకున్న ఎసిబి
రావల్పిండి జైలుకు తరలింపు
ఎవెన్ ఫీల్డ్ అవినీతి కేసులో చర్యలు

Nawaz

లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యంను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అక్కడి నుంచి రావల్సిండి జైలుకు తరలించారు. అబూధాబి నుంచి విమానంలో లాహోర్‌కు చేరుకోగానే వెనువెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ తల్లి బేగం షమీమ్ అక్తర్‌ను, షేహ్‌బాజ్ షరీఫ్ కుమారుడు సల్మాన్‌ను విమానాశ్రయంలోపలికి వెళ్లి షరీఫ్‌ను కలిసేందుకు అనుమతించా రు. ఎవెన్‌ఫీల్డు అవినీతి కేసులో వీరికి దోషిత్వం ఖరారు కావడంతో అరెస్టులు అనివార్యమయ్యాయి. తీర్పులు వెలువడ్డ సమయంలో లండన్‌లో ఉన్న షరీఫ్ తాను చట్టం నుంచి తప్పించుకునే వ్యక్తిని కానని, శిక్షలు అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని, స్వదేశానికి తిరిగి వెళ్లుతానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆయన కూతురితో కలిసి విమానంలో లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ ఎయిర్‌పోర్టుకు రాత్రి తొమ్మిందిపావు ప్రాంతంలో చేరారు. మూడు గంటలు ఆలస్యంగా ఆయన విమానం లాహోర్ చేరింది. ఇతిహాద్ ఎయిర్‌వేస్ ఇవై 242 విమానంలో ఆయన అబూధాబీ మీదుగా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన లండన్ నుంచి విమానంలో అబూధాబీ చేరారు. ఆయనను అరెస్టు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నారు. ఎవెన్ ఫీల్డ్ అవినీతి కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని హెలికాప్టర్‌లో ఇస్లామాబాద్‌కు అక్కడి నుంచి రావల్సిండిలోని అడియాలా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ధికారులు తెలిపారు. ముందుగా ఆయనను అవినీతి నిరోధక విభాగం కోర్టులో హాజరుపరుస్తారని వెల్లడించారు. లాహోర్‌లో అరెస్టు చేస్తే ఉద్రిక్తతలు తలెత్తే అవకా శాలు ఉన్నందున విమానాశ్రయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధినేత అయిన షరీఫ్ వస్తున్నారని తెలియడంతో పార్టీ కార్యకర్తలు ఆయన మద్దతుదార్లు లాహోర్‌లో పలు చోట్ల గుమికూడారు. లాహోర్‌కు బయలుదేరడానికి ముందు అబూధాబి విమానాశ్రయంలో షరీఫ్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25 వ తేదీన పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్ , ఆయన కూతురు అరెస్టు రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓ వైపు భారీ స్థాయిలో అణచివేతలు, అరెస్టులు జరుగుతున్న దశలో పాకిస్థాన్‌లో ఎన్నికల విశ్వసనీయత ఎంత వరకు ఉంటుందని షరీఫ్ ప్రశ్నించారు. షరీఫ్ స్వస్థలం పాక్ పంజాబ్‌లో మొబైల్ , ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తండ్రి ప్రజలంతా అండగా నిలవాలని, దేశ భవితను మార్చుకునేందుకు సిద్ధ పడాలని కూతురు మర్యం పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఆమెనే పాకిస్థాన్‌లో పార్టీ సారధ్యబాధ్యతలలో ఉన్నారు. తమపై కేసులేదు, తీర్పు లేదని కేవలం కక్ష సాధింపు రాజకీయాలు సాగుతున్నాయని, ఇదంతా కూడా ప్రజల గొంతు నొక్కేందుకు కొందరు చేస్తున్న కుట్ర అని ఆమె మండిపడ్డారు.
భార్యతో షరీఫ్ ఫోటోలు వైరల్ :ఇక భార్యకు క్యాన్సర్ చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన షరీఫ్‌ను అరెస్టు చేసే యత్నాలకు దిగడం పట్ల పాకిస్థాన్‌లో నిరసన వ్యక్తం అవుతోంది. షరీఫ్, ఆయన కూతురు కలిసి లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగం కుల్సుం నవాజ్ చెంత ఉన్నప్పటి ఫోటోలు నెట్‌లలో దర్శనం ఇస్తున్నాయి. నెలల తరబడిగా కోమాలో ఉన్న భార్య నుదుటిపై భర్త షరీఫ్ చేయి వేసి ఉంచడం, కూతురు కన్నీళ్లు పెట్టుకుని ఉండటం వంటి చిత్తరువులు నెట్‌లో రావడంతో ఆయన పార్టీకి ఎన్నికలలో సానుభూతి దక్కుతుందని ఆశించారు.