Home అంతర్జాతీయ వార్తలు షరీఫ్‌కు పదేళ్ల జైలు

షరీఫ్‌కు పదేళ్ల జైలు

Nawaz Sharif sentenced to 10 years in jail

ఇస్లామాబాద్: అవినీతి అభియోగాల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పది సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు. దీనితో పాటు ఆయనకు 80 లక్షల పౌండ్ల జరిమానా ఖరారు చేశారు. షరీఫ్ కూతురు 44 ఏళ్ల సహ నిందితురాలు మర్యంకు ఏడేళ్ల కఠిన జైలు శిక్ష, ఆమె భర్త క్యాప్టెన్ ముహమ్మద్ సఫ్దర్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. స్థానిక అవినీతి నిరోధక న్యాయస్థానం శుక్రవారం షరీఫ్ గైర్హాజరీ నేపథ్యంలో విచారణ జరిపి శిక్షలను ప్రకటించింది. పనామా పత్రాలలో పేర్కొన్న అవెన్‌ఫీల్డు అవినీతి కేసులో మాజీ ప్రధానికి న్యాయస్థానం శిక్ష విధించడం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక పరిణామంగా మారింది. ఈ నెల 25న దేశంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. షరీఫ్‌కు పది సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం సహ నిందితులుగా ఉన్న మర్యంకు ఏడేళ్ల శిక్షతో పాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించారు. ఇక అవినీతి నిరోధక అధికారులతో సహకరించనందుకు షరీఫ్ అల్లుడిని కూడా దోషిగా పేర్కొం టూ శిక్ష ఖరారు చేశారు. లండన్‌లోని అత్యంత విలాసవంతమైన అవెన్‌ఫీల్డ్ హౌస్‌లోని నాలుగు ఫ్లాట్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఇప్పు డు షరీఫ్ కుటుంబానికి చిక్కు తెచ్చిపెట్టాయి. షరీఫ్‌పై దాఖలైన మూడు అవినీతి కేసుల విచారణలో భాగంగా జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్‌ఎబి) కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ప్రధాని ఇతరులపై నాబ్ కేసును దాఖలు చేసింది. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక పనామాగేట్ తీర్పు తో ప్రధాని షరీఫ్ పదవీచ్యుతులు అయ్యారు.శుక్రవారం ఐదుసార్లు విచారణ నిలిపివేతల తరువాత భారీ స్థాయి బందోబస్తు ఏర్పాట్ల మధ్య తీర్పు వెలువడింది.

భార్య కుల్సూంకు గొంతు క్యాన్సర్ చికిత్స కోసం షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ప్రస్తుత తీర్పు ప్రభావంతో మర్యం, సఫ్దర్‌లు ఎన్నికలలో పోటీకి అర్హత పోగొట్టుకున్నారు. నిం దితులు ఈ తీర్పునకు వ్యతిరేకంగా పది రోజులలో తమ పిటిషన్లను దాఖలు చేసుకోవచ్చునని నాబ్ ఉప విచారణాధికారి సర్దార్ ముజఫర్ అబ్బాసీ తెలిపారు. రహస్యంగా సాగిన విచారణలో ఇస్లామాబాద్‌లోని అకౌంటబిలిటీ న్యా యమూర్తి మహమ్మద్ బషీర్ తీర్పు వెలువరించారు. తీర్పు ను ఏడు రోజులపాటు వాయిదావేయాలని షరీఫ్ కుటుంబ సభ్యులు పెట్టుకున్న దరఖాస్తును న్యాయమూర్తి తోసిపుచ్చారు. అవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్లను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా జప్తు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక నిందితులకు విధించే జరిమానా డబ్బును ప్రభుత్వ ఖజానాలో జతచేస్తారు. కేసు విచారణ ఆద్యంతం సమగ్రంగా సాగిందని, విచారణ సిబ్బందిని తాము అభినందిస్తున్నామని, నాబ్ విచారణ ప్రక్రియకు ఇది విజయం అని న్యాయమూర్తి ఆ తరువాత మీడియాకు తెలిపారు. అవినీతి సొమ్ముతోనే అవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారని నిర్థారణ అయిందని, 1993 నుంచి ఆ ఆస్తులు షరీఫ్ కుటుంబ స్వాధీనంలోనే ఉన్నాయని స్పష్టం అయిందని పేర్కొన్నారు. తీర్పు వెలువడుతున్న సమయం లో షరీఫ్ తన కుటుంబ సభ్యులతో ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నట్లు వెల్లడైంది. షరీఫ్ కూతురు, అల్లుడుతో పాటు ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్‌లు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే వారు ఏ దశలోనూ విచారణకు హాజరు కాకపోవడంతో వారిని విచారణకు ఎగవేతదార్లుగా ప్రకటించారు. ఈ కేసు విచారణ తొమ్మిదినెలలు గా సాగుతూ వచ్చింది. దేశ శక్తివంత ప్రధానిగా పేరొందిన షరీఫ్‌ను పనామా పత్రాలు తీవ్రస్థాయిలో కుదిపివేశాయి. ఆయన, కూతురు మర్యం కేసు విచారణకు పలు దఫాలుగా హాజరయ్యారు. ప్రధానిగా షరీఫ్ తన అధికార దుర్వినియోగంతోనే దక్కించుకున్న సొమ్ముతోనే లండన్‌లో ఆస్తులు దక్కించుకున్నాడని అభియోగాలు ఉన్నాయి. దీనిని నిరూపించే రీతిలో ఎన్‌ఎబి వారు 21 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను ప్రాతిపదికగా చేసుకుని, అవినీతి సొమ్ముతోనే షరీఫ్ ఆస్తులు సమకూర్చుకున్నారనే తమ కేసును సమర్థించుకున్నారు. తనకు చట్టబద్ధంగా వచ్చిన సొమ్ముతోనే ఆస్తులు సంతరించుకున్నట్లు అవినీతిమార్గాలకు పాల్పడలేదని షరీఫ్ వాదిస్తూ వచ్చారు.
బెదిరేది లేదు : మర్యం
షరీఫ్ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్)కు ఈ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ తీర్పు ప్రతికూలతను ఇస్తుందని భావిస్తున్నారు. తండ్రి రాజకీయ వారసురాలిగా మర్యం పార్టీ ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పుడు ఆమెపై ఎన్నికల్లో పోటీకి అనర్హత వేటు పడింది. అయితే అజ్ఞాత శక్తులతో పోరులో ఇది తమకు పెద్ద దెబ్బ ఏమీ కాదని, దీనిని పెద్దగా లెక్కచేయబోమని, ఇది కేవలం తమపట్ల పాటిస్తున్న అణచివేత ధోరణి అని, దీనికి వ్యతిరేకంగా పోరు సలిపే నైతిక శక్తి ఇప్పుడు మరిం త ఇనుమడించిందని మర్యం ధీమా వ్యక్తం చేశారు.