Home ఖమ్మం బయ్యారం అడవుల్లో కాల్పుల కలకలం

బయ్యారం అడవుల్లో కాల్పుల కలకలం

firingచాలా ఏళ్ల తరువాత ఎన్‌డీ దళాలపై పోలీసుల గురి, అశోక్‌దళంపై శనివారం కాల్పులు
ఉలికిపడ్డ అజ్ఞాత దళాలు, పట్టుకు ప్రయత్నాలు, భయాందోళనలో ఏజెన్సీ గ్రామాలు

మన తెలంగాణ / ఖమ్మం: సాయుధ దళాల సంచారం ఉన్నా ఇక్కడ తుపాకీ మోతలు వినిపించవు. పోలీసులు సైతం ఈ వైపు చూడరు. అటువంటి ఇల్లందు అడవుల్లో చాలా సంవత్సరాల తర్వాత ఎన్‌డి దళాలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు శనివారం చోటు చేసుకోవడంతో కలకలం సృష్టించింది. సిపిఐ ఎంఎల్ చీలికల తర్వాత పైలా వాసుదేవరావు మొదలు అనేక పేర్లు మారినా  ఇప్పటి న్యూడెమెక్రసీ ఇల్లందు అటవీ ప్రాంతంపై  పట్టు సాధించింది. చండ్ర పుల్లారెడ్డి వర్గం, జనశక్తి, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన ఇలా అనేక దళాలు పట్టుకోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వ్యక్తులుగా మిగలడం,  కొద్దిరోజులు తర్వాత కనుమరుగు కావడం జరిగింది. సిపిఐ(ఎంఎల్) ఎన్‌డిలో ఇటీవల కాలంలో చీలిక సాయుధ దళాలపై పడింది. ఎన్‌డిల్లోంచి చంద్రన్న వర్గం విడిపోవడంతో ఐదు సాయుధ దళాలు వారి వెంట వెళ్లినట్లు సమాచారం.

రెండు సంవత్సరాలుగా ఇల్లందు అటవీ ప్రాంతంలో పైచేయి కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులు సైతం చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల కిత్రం బయ్యారం మండలంలోని చంద్రన్న వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రాయలవర్గంలో చేరారు. ఎప్పటిలాగే అటవీ గ్రామాల్లో తమ వర్గాలను  చక్కదిద్దుకునేందుకు సాయుధ దళాలు రంగంలోకి దిగాయి. బయ్యారం మండలంలో బలంగా చీలిన చంద్రన్న వర్గం క్రమేపీ బలహీనపడుతున్నా పందిపంపుల సహా బయ్యారం మండలంలోని ఐదు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, సొసైటీ డైరెక్టర్లు చంద్రన్న వర్గంలోనే ఉన్నారు. అంతేకాదు బయ్యారంలోని ఎన్‌డి కార్యాలయం చంద్రన్న వర్గం ఆధీనంలో ఉండగా రాయల వర్గం వశం అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రన్న వర్గం సాయుధ దళాల సమావేశం ఏర్పాటు చేస్తూ వర్గ రక్షణలో పడ్డాయి.

ఈ క్రమంలోనే పోలీసులకు, చంద్రన్న వర్గానికి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌డి దళాలపై ఎప్పుడో తప్ప పోలీసులు దృష్టి సారించరు. ఎందుకంటే మావోలు ఈ ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి ఉపయోగపడడం, అంతర్గతంగా పని చేయడం తప్ప హింసాత్మాక చర్యలకు పాల్పడకపోవడమే కారణం. చీలికలు, పరస్పర ఆరోపణలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, రెండు వర్గాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో కాల్పులు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. చాలా కాలం తర్వాత మోగిన తుపాకీ మోతలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.