Home కలం అందరికీ ఆసరా ‘నాయిన’

అందరికీ ఆసరా ‘నాయిన’

Nayina'

తండ్రి, అయ్య, నాన్న, డాడీ, ఫాదర్, అబ్బాజాన్, జనకుడు, పప్పా, పిత, బాపు, బా… ఎవరే పేరున పిలిచినా అందరి కవుల హృద యాల్లో నుండి అక్షరాలై కవితలుగా పలికిన పేరే ‘నాయిన’.
“నాన్న అక్షరాలు రెండే…అర్థం అనంతం” అన్న రాజాహుస్సేన్ మాటలు…“అందరికీ నాన్న నాన్నే నా నాన్న అమ్మతనం కురిపించిన నాన్న” పల్లేరు వీరస్వామి అక్షరాలు చాలు ఈ కవిత్వ సంకలనంలో కవితాతత్వాన్ని పట్టివ్వడానికి. నిజానికి 500 పేజీలకు పైనున్న నాయిన కవితా సంకలనం చదువుతుంటే ప్రతీ పేజీలోని వాక్యాలు మనల్ని ఉద్విగ్నతకు గురి చేస్తూ…నాన్నల పాదాల వద్ద కుప్పగా పడి ఉన్న నవజాతపు శిశువుతత్వాన్ని..,నాన్న నడయాడిన దారుల వెంట పాదముద్రలయ్యే ఇమాజినరినీ..,నాన్న వేలు పట్టుకుని నడుస్తున్న జీవితాలను సజీవం చేస్తాయ్. చాలాచోట్ల అమ్మతనపు నాన్న వెచ్చదనం మనల్ని స్పర్శిస్తూనే ఉంటుంది. “ప్రతీ మనిషికో చరిత్ర ఉండొచ్చు వుండకపోవచ్చు. ..కానీ ప్రతీ నాయినకో చరిత్ర ఉంటుంద”న్న సంపాదకుడి మాటలు ఈ పుస్తకంలోని కవిత్వం చదివిన తర్వాత అక్షర సత్యాలుగా మనముందు కదలాడతాయి.
సాహిత్య చరిత్రలో అమ్మలంత వెలుగు వెలగని నాన్నలకు, అమ్మల్లాగా అక్షరం రూపు అంతగా సంతరించుకోని నాన్నలకు, అమ్మ అంతటి క్రెడిబిలిటీని ఎక్కడో అక్కడక్కడా మాత్రమే నమోదు చేయబడ్డ నాన్నలను సమాజానికి, సాహిత్య సమాజానికి పట్టిచ్చిన బృహత్ కవితా రూపం ‘నాయిన’. అమ్మ ఒక ఉద్యమం ఒక సము ద్రం ఒక ఆకాశం ఒక అరణ్యం అన్నీ అయ్యింది మరి నాయిన ఏమయ్యిండు అనే ప్రశ్నకు కవిత్వ పు సమాధానం ‘నాయిన’ కవితా సంకలనం. ఈ సంకలనంలో కులం లేదు మతం లేదు జెండర్ లేదు ప్రాంతం లేదు దేశం లేదు అందరి ఎజెండా నాన్నే. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి వాక్యపు బైబిల్ ఖురాన్ గీత ‘నాయిన’.
వాస్తవంగా ఆలోచిస్తే జీవితం తాలూకూ చాలా సన్నివేశాలను, సంఘర్షణను, ఆర్తిని, ఆవేదనను, విజయాలను, ఓటములను, ఉద్యమా లను, సత్కారాలను, సన్మానాలను అమ్మకు మిలితం చేసి చూసిన సాహిత్యం కనపడుతుంది …కాని నాన్న గురించి కూడా ఆలోచిస్తూ నాన్నను నాన్నగా అర్ధం చేసుకోవడం మాత్రం గ్లోబలైజేషన్ తర్వాతనే మొదలైంది. అందుకే ఈ సంకలనానికి సంపాదకత్వం వహించిన అన్వర్… “శతాబ్దాలు గా నాన్న ద్వేషానికి సంబంధించిన వస్తువే ఇప్పుడిప్పుడే అవసరంకొద్దీ నాన్న కూడా ప్రేమించబడే వస్తువవుతున్నాడు” అంటారు.
అప్పటిదాకా అమ్మ మాట పాటతో ఊగిపో తున్న సాహిత్య సమాజానికి నాన్న కూడా ఉన్నాడని… అన్నవరం దేవేందర్ అన్నట్టు పచ్చపచ్చగా చిగురించేందుకు పందిరిలాంటి ఆలంబన అయిన నాన్నను అక్షరాల్లో నిలుపు కుందామని సృజనలోకం ఇచ్చిన పిలుపుకు వచ్చిన స్పందన ఒక ఉప్పెన… అందుకే చాలా మంది వ్యక్తిగత గ్రంథాలయాల్లో నాయిన తప్పని సరిగా ఉంటుంది. ఇంకా చాలా మంది నాయిన లను కోల్పోయి నప్పుడు ఈ నాయిన కవిత్వం అక్షర ఓదార్పై అండగానూ నిలిచిందంటే ఎంతటి శక్తివంత మైన నిజ కవి త్వం ఇందులో ఉందో ఊహించు కోవచ్చు… కావలిస్తే మచ్చుకు కొన్ని కవితా పంక్తులు చూడండి…నాయినలు ఎట్లా అక్షర మైనారో తెలుస్తుంది-
‘ఇంటినే కాదు అందర్నీ ఒంటిస్తంభంలా మోస్తున్న నాన్న / ఎప్పుడూ ఒంటరివాడే’ కాంచన పల్లి రాజేందర్‌రాజు
‘కుటుంబాన్ని పీఠమెక్కిస్తూ తానొక తొక్కుడు బండవుతాడు నాన్న’చొప్పదండి సుధాకర్
‘ఎదిగిన చెట్టును నేను…నాకు మూలమైన చెట్టు నాన్న’అయాచితం
‘ఒక గొప్ప పురా వారసత్వం’శిఖామణి
‘నాకు నువ్వొక వొయ్యి నాయినా’ వడ్డె బోయిన
‘నాన్న నిన్ను పసివాణ్ణి చేసి పొత్తిళ్ళలో ఎత్తుకుని లాలించాలని ఉంద’ంటూ నాన్నకు తల్లిగా మారాలనుందంటుంది కామవరపు విజ యలక్ష్మి
‘మా అమ్మ సూర్యుడునాన్న చంద్రుడు’ అద్దేపల్లి
‘అందరి కోసం/అన్నీ ధారపోసి/దారి చూపే రస్తా’పత్తిపాక మోహన్
అయితే ‘ఏ ఒక్క కొడుకూ నాన్నని తిట్టలేదని, తిరస్కరించలేదని, నాన్నని అర్ధం చేసుకోలేకపో యానని, నాన్నని నానా బలహీనతలతో మన్నించ లేకపోయానని రాసుకోకపోవడం,ఒక అపరాధం చేశానని కుమలకపోవడం పెను దు:ఖం కలిగించి నన్ను తేలికపరచకపోవడం, మరీ మరీ బాధిస్తున్న దన్నాడు ఈ పుస్తకానికి వెనకమాట రాసిన సీతారాం.
ఆ లోటును పూరిస్తూ నాన్నను ఒక కోణంలో పై కొన్ని వాక్యాలు అక్షరీకరిస్తే మరికొందరు ఇలా మరో కోణంలో అక్షరీకరించారు.
‘బాధ్యతలు విస్మరించి/నీ కోసం నువ్వు జీవించి/నువ్వు పొందిందేమిటీ అత్యంత ఆనం దం అత్యంత విషాదం’డా.కె.గీత
‘నాన్నలు బ్రతకాలంటే కొడుకులు బ్రతకాలి’ చింతం ప్రవీణ్
‘లేని తండ్రి అప్పుడప్పుడు కన్పిస్తాడు సర్టిఫి కెట్లలో’దాసరి రాజబాబు
‘కుంపటిమా నాయనకు నిశాని’ అంటాడు కులవృత్తుల కోణంలో తండ్రిని ఆవిష్కరిస్తూ బాణాల శ్రీనివాస్
‘తల్లులారా/ మీ బిడ్డలకు పాలిచ్చేటప్పుడు
కాస్త తండ్రి ప్రేమను రంగరించి తాపించండి
లేకపోతే లోకంలో నాన్నలంత
నాలా..నిర్భాగ్యులుగా మిగిలిపోతా’రంటూ తీవ్రవేదనను వ్యక్తం చేస్తాడు స్వామి గూటం.
‘ఈ సంకలనం కొలువుదీరిన తండ్రుల కవిత్వ సంకలనంగా కనిపించింది. ప్రతీ కవీ తన తండ్రిలో తాను చూడలేకపోయిన మరో పార్శ్వా న్ని సహ మిత్రుడి కవితలో కనుగొంటాడు అను కుంటానంటాడు’ సీతారాం. మొత్తంగా సమాజం, సాహిత్య చరిత్ర విస్మరించిన ప్రతీ మనిషి ఆయువుపట్టు అయిన నాన్నను అత్యంత చిత్త శుద్ధితో, అత్యంత బాధ్యతాయుతంగా అక్షరాల్లో చారిత్రాత్మకంగా నమోదు చేయడంలో సృజన లోకం కృషి మాటల్లో చెప్పలేనిది.
నాన్న గురించి రాయడమంటే బంధాలు, అనుబంధాలు, ఉద్వేగాలు, ఊగిసలాట, పశ్చాత్తా పాలు, క్షమాపణలు, కోపాలు, వాటాలు, మందలింపు, మాటకటువు, క్రమశిక్షణ, పాఠాలు, ఉద్యమాలు…చివరికి బతుకులు.., ప్రొ.ఎస్వీ సత్య నారాయణ గారు తన కవితలో ఒకచోట అన్నట్టు ‘కాయకష్టమే తన శాశ్వత చిరునామాగా మలుచు కున్న’ నాన్న పట్ల ఆర్తిని,ఆవేదనను,ప్రేమను అన్నింటికన్నీ నాన్నై పలికిన నదీ ప్రవాహపు వాక్యాలు, అక్షరాలు ఈ కవితా సంకలనం నిండా ఉన్నాయ్. మొత్తంగా అన్‌సంగ్ హీరో సంపూర్ణ ఆవిష్కరణ చూస్తాం చాలా కవితల్లో. భాషకు అమ్మ తొలి గురువైతే…“భావ ప్రకటనకు మలి గురువు నీవు” అంటాడు మిద్దెల రంగనాధ్ నాన్ననుద్దేశించి ఒకచోట. అలాంటి నాన్నల గురించి వెల్లువెత్తిన భావ ప్రకటనను మన మన స్సుల్లోకి మస్తిష్కపు పొరల్లోకి వంపుకోవాలంటే ‘నాయిన’ చదవాల్సిందే.

‘నాయిన’ కవితా సంకలనం’
సంపాదకత్వం: అన్వర్
పబ్లిషర్స్: సృజనలోకం – వరంగల్.