Home జాతీయ వార్తలు నీట్ రద్దుకు దావా

నీట్ రద్దుకు దావా

Karunanidhi-1చెన్నయ్ : డిఎంకె అధికారంలోకి వస్తే వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నీట్ రద్దుకు సుప్రీంకోర్టులో దావా వేస్తామని ఆ పార్టీ చీఫ్ కరుణానిధి తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు. 2006లో తాము ఐదోసారి పగ్గాలు చేపట్టిన సందర్భంగా వైద్య కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశపరీక్షా విధానాన్ని రద్దు చేస్తూ బిల్లును రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఇది రాష్ట్రపతి ఆమోదం పొంది 2007 మార్చి 7వ తేదీ నుంచి అమలు చేయడంతో తొమ్మిదేళ్ల పాటు ప్లస్‌టు మార్కుల ఆధారంగానే విద్యార్థులకు ప్రవేశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం నీట్‌కు సంబంధించిన కేసులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది సుప్రీంకోర్టులో సరైన విధంగా తన వాదనలు వినిపించలేదని, బహుశా డిఎంకె హయాంలో ఈ బిల్లు తీసుకురావడమే అందుకు కారణం కావచ్చని కరుణానిధి అభిప్రాయపడ్డారు. దీని ద్వారా తమిళనాడు విద్యార్థుల భవిష్యత్‌తో జయలలిత చలెగాటమాడారనే విషయం అర్ధమవుతోందని ఆయన విమర్శించారు. తమిళనాడులోని 80శాతం మంది ఏకీకృత విద్యావిధానాన్ని అభ్యసిస్తుండగా, నీట్ మాత్రం సిబిఎస్‌ఈ పాఠ్యప్రణాళిక మేరకు ఆంగ్లంలో , హిందీలో మాత్రమే ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, డిఎంకె అధికారంలోకి వస్తే నీట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దావా వేస్తామని ఆయన తెలిపారు. 2010 డిసెంబరు 21 నాటి భారత వైద్యమండలి(ఎంసిఐ) ప్రకటనను వెనక్కు తీసుకోవడమో లేక సవరణలు చేయడానికో అవసరమైన అన్ని చర్యలు చేపడతామని , తమిళనాడులో వైద్య, ఇంజినీరింగ్ కళాశాలలకు ప్రవేశపరీక్షలు లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.