Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

హెచ్‌ఆర్‌ఎ పోస్టులు కావాలా.. చాలా ఖరీదు

note

*అంతర్ జిల్లా బదిలీల్లో పైరవీల జోరు
*జిల్లా నిరుద్యోగులకు టోపీ పెడుతున్న జిల్లా పెద్దలు
*అంతర్ జిల్లా బదిలీల వెనక జిల్లా నేతల పాత్ర
*20% ఉండవలసిన స్థానికేతరులు 45%
*సెలవుల్లో పోస్టింగ్‌లు సాధించుకోవడానికి అడ్డదారులు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:

నిరుద్యోగుల ఆశలపై పైరవీకారులు నీళ్లు చల్లుతున్నారు. అంతర్ జిల్లాల బదిలీలు చేయవద్దని రంగారెడ్డి జిల్లా డిడిఆర్‌సి తీర్మానం చేసినా, లోకాయుక్త ఆదేశాలు జారీచేసినా సచివాలయంలో పాగా వేసిన కొంత మంది అధికారులు కాసుల మత్తులో అడ్డదారిలో జిల్లాలోని ఖాళీ పోస్టులను ఇతర జిల్లాల వారితో నింపి జిల్లా నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్షం, దోపిడీ పుణ్యమాని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జి.ఓకు విరుద్దంగా స్థానికేతరులతో నిండిపోయాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే జిల్లాలో తమ ఉద్యోగాలు తన్నుకుపోయిన వారిని స్వంత జిల్లాలకు పంపించి తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన జిల్లా నిరుద్యోగుల ఆశలు నెరవేరకపోగా ఉన్న ఖాళీలను సైతం మరో మార్గంలో ఇతరులు తన్నుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం ఉండాలన్న నిభంధనలను సీమాంధ్ర పాలకులు పూర్తిగా తుంగలో తొక్కారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండటంతో నగరంలో ఉంటూ జిల్లాలో ఉద్యోగం చేయడానికి అంతా ఆసక్తి చూపి జిల్లాల నుంచి పైరవీలతో పోస్టింగ్‌లు సంపాదించుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివారు మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 30%హెచ్‌ఆర్‌ఎ ఇస్తుండటంతో లక్షలు కుమ్మరించైనా సరే రంగారెడ్డి జిల్లాలోనే ఉద్యోగం చేయాలన్న లక్షంతో చాలా మంది పైరవీలు చేసుకుంటున్నారు.
డిప్యూటేషన్ పేరుతో నయా దందా
నిబంధనలకు విరుద్దంగా జిల్లాలో 45% పైగా ఉద్యోగాలు స్థానికేతరులతో నిండిపోవడం వలన 1998లో అంతర్ జిల్లా బదిలీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతర్ జిల్లా బదిలీలను ప్రభుత్వం రద్దు చేసిన నాటి నుంచి ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్ పేరుతో రంగారెడ్డి జిల్లాకు తీసుకువచ్చి ఇక్కడే పాగా వేస్తున్నారు. సీమాంధ్ర పాలనలో సాగిన మాదిరిగానే తెలంగాణ వచ్చిన తర్వాత సైతం కొనసాగుతుండటంతో జిల్లా నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత ఆరు నెలల కాలంలో నిబంధనలకు విరుద్దంగా సచివాలయం నుంచి పదుల సంఖ్యలో డిప్యూటేషన్‌ల పేరుతో వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు నేరుగా పోస్టింగ్‌లు సంపాదించుకున్నారు. కరీంనగర్, నల్గొండ, వరంగల్, జనగాం, అదిలాబాద్ తదితర జిల్లాల నుంచి ఇక్కడికి డిప్యూటేషన్‌పై వచ్చారు. డిప్యూటేషన్‌ల పేరుతో పైరవీలు సాగించి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులు సైతం 30% హెచ్‌ఆర్‌ఎ వచ్చే స్థానంలోకి వచ్చి పడుతున్నారంటే వారి పైరవీలు ఏ స్థాయిలో ఉహించవచ్చు.
జిల్లా నేతలే పైరవీకార్లు
జిల్లాలోని ఉద్యోగాలను ఇతరులు తన్నకుపోతుంటే వాటిని అడ్డుకుని జిల్లా నిరుద్యోగులకు దక్కేలా చూడవలసిన పెద్దలు కొంత మంది నిద్రమత్తులో నటిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఖాళీగా ఉన్న స్థానాలను గుర్తించి వారికి అక్కడ పోస్టింగ్‌లు దక్కేలా చూడటంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కీలకపాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు సాగుతున్నాయి. సచివాలయం సాక్షిగా సాగుతున్న దందా వెనకాల జిల్లాకు చెందిన బడా నేతలు చక్రం తిప్పుతున్నారని విద్యాశాఖ మంత్రితో పాటు శాఖ కార్యాలయంలో మరో పాతిక వరకు అంతర్ జిల్లా బదిలీల పైరవీలు సాగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు ఇటివల కాలంలో ఉప ముఖ్యమంత్రి వద్దకు తరచు వెళ్లుతున్నారని వేసవి సెలవుల సమయంలో ఇలాంటి పోస్టింగ్‌లు చాలా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒక్కో పోస్టింగ్ వెనక ఆరు నుంచి పది లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న 750 మందికి పైగా స్థానికేతర ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు పంపిండచానికి 2007లో జారీచేసిన జి.ఓలు 117, 118, 183,184లను అమలు చేయడంతో కనీస శ్రద్ద చూపని జిల్లా ప్రజా ప్రతినిధులు కొంత మంది అంతర్ జిల్లా బదిలీల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు చేయడంపై జిల్లా నిరుద్యోగులు మండిపడుతున్నారు. జిల్లా నిరుద్యోగులు ఇప్పటికైన కళ్లు తెరవకపోతే భవిష్యత్‌లో జిల్లా ఉద్యోగాలు పూర్తిగా స్థానికేతరులతో నిండటం ఖాయంగా కనిపిస్తుంది.

Comments

comments