Home ఆఫ్ బీట్ ఆందోళనతో అనర్థాలే!

ఆందోళనతో అనర్థాలే!

Public and private Competitive exams

ప్రభుత్వ ఉద్యోగాలకైనా, ప్రయివేటు ఉద్యోగాలకైనా ఇప్పుడున్న పోటీకి తట్టుకుని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు సన్నద్ధమవుతుంటారు. పరీక్షలకు సిద్ధమవడం ఒక ఎత్తయితే పరీక్షా సమయంలో చూపే ప్రతిభా ప్రదర్శన మరో ఎత్తు. చాలామంది బాగా ప్రిపేర్ అయినా చివరికి విఫలమవుతున్నారు. ఈ దశలో పరీక్షను విజయవంతంగా పూర్తిచేయడానికి కొన్ని పద్ధతులున్నాయంటున్నారు నిపుణులు.

పరీక్షకు ముందు అభ్యర్థులు అనవసర ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. అంతవరకు సాగించిన సన్నద్ధతతో పరీక్షలో గట్టెక్కుతామో లేదో అని మథనపడుతుంటారు. ప్రశ్నల సరళి, పరీక్షకు పోటీపడుతున్న అభ్యర్థుల గురించి ఆలోచిస్తుంటారు. అయితే లక్షలాది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నా… వారిలో సీరియస్‌గా రాసేవారు 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంటారని గుర్తుంచుకోవాలి. కాబట్టి పరీక్ష రాసేవారి సంఖ్యను పట్టించుకోవద్దు. పరీక్షా సమయానికి తమ సన్నద్ధత పూర్తవుతుంది కాబట్టి అది ఏ మేరకు సరిపోతుందనే ఆలోచనలు వద్దు. పరీక్షా సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే తమ ప్రదర్శన అంత మెరుగ్గా ఉంటుంది. అనవసర ఆందోళన పరీక్ష రాయడాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కొద్దిమంది అభ్యర్థులు పరీక్షకు ఉన్న కాలపరిమితి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.

ఈ తక్కువ సమయంలో ప్రశ్నలన్నింటినీ పూర్తి చేయలేమేమో అనే అనవసర ఆందోళనతో ఉంటారు. అయితే అందరికీ ఒకటే పేపరు, ఒకే సమయం ఉంటుందని మరచిపోకూడదు. అదే విధంగా ప్రశ్నలన్నింటినీ తప్పనిసరిగా పూర్తిచేయాలనే నిబంధన కూడా లేదు. నిర్ణీత సమయంలో ఎవరు ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తారో వారే విజయం సాధిస్తారు. బ్యాంకు పరీక్ష ఒక మైండ్ గేమ్ లాంటిది. అభ్యర్థులతో వీలైనన్ని తప్పులు చేయించడానికి ఎగ్జామినర్లు ప్రయత్నిస్తారు. ప్రారంభంలో కఠిన ప్రశ్నలు ఇవ్వడం ద్వారా అభ్యర్థులు ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తారు. దీనివల్ల తర్వాత వచ్చే తేలికపాటి ప్రశ్నలకు సైతం సమాధానాలు గుర్తించలేరు.

అందుకే ఆరంభంలోని కష్టమైన ప్రశ్నలు చూసి ఇక తాము చేయలేమేమోనని చేతులెత్తేస్తారు. అలాగే అన్ని ఆప్షన్లు సరైనవే అనిపించేలా ఇవ్వడమూ ఈ ఎత్తుగడలో భాగమే. ఉదాహరణకు సంఖ్యను సరిగా ఇస్తూ యూనిట్లను మార్చి ఇవ్వడం, సంఖ్యలోని సున్నాల సంఖ్యను కుదించడం, పెంచడం లాంటివి. అభ్యర్థులు వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించాలి. పరీక్ష జరుగుతున్నంతసేపు జాగరూకతతో వ్యవహరించాలి. ఎగ్జామినర్‌ది పైచేయి కానివ్వకూడదు. అభ్యర్థులు తాము బాగా ఇష్టపడే, ఆత్మవిశ్వాసంతో తేలిగ్గా భావించే విభాగంతో పరీక్షను మొదలుపెట్టాలి. అన్ని విభాగాలు ముఖ్యమైనవి, పూర్తి చేయాల్సినవే. అయినా సులువైంది ముందుగా చేయడం వల్ల మిగిలిన వాటిని అదే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు.

వెంటనే జవాబు కనిపెట్టని ప్రశ్నను ఎలాగైనా సాధించాలని అభ్యర్థులు సవాలుగా తీసుకోకూడదు. దీనివల్ల ఒక ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. చివరగా చాలా తక్కువ ప్రశ్నలు సాధిస్తారు. ఏ పరీక్షలోనైనా సాధారణంగా మూడు రకాల ప్రశ్నలుంటాయి. సులభమైనవి, మధ్యతరహా, కఠినమైనవి. ఇవన్నీ ఆయా విభాగాల్లో ఏ క్రమంలో అయినా ఉండవచ్చు. అభ్యర్థులు ప్రశ్నలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి అదే వరుసలో సాధించకుండా ముందు తేలిగ్గా ఉన్నవాటిని సాధించాలి. తర్వాత మళ్లీ మొదటి ప్రశ్నకు వచ్చి మధ్య స్థాయి ప్రశ్నలను పూర్తి చేసుకుంటూ వెళ్లాలి. చివరగా కఠినంగా ఉండే ప్రశ్నలు సాధించాలి.

ఈ సూచనలన్నింటినీ పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాస్తే సన్నద్ధత ఓ మోస్తరుగా ఉన్నా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే పోటీ పరీక్షల్లో మీదే విజయంగా నిలుస్తారు.

Need to attend Competitive exams for public, private jobs

Telangana Latest News