Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

భారత పతకధారిగా నీరజ్

Neeraj was chosen as the captain of the team

ఇండోనేషియాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు శుక్రవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరేంద్ర బత్రా తదితరులు సత్కరించారు..

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 18 నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి శుక్రవారం రాజధాని ఢిల్లీలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులను సన్మానించారు. అంతేగాక వారికి స్పోర్ట్ కిట్స్‌ను అందజేశారు. క్రీడల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తారనే నమ్మకాన్ని మంత్రి రాథోడ్ వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఈ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నాయకుడిగా వ్యవహరిస్తాడు. నీరజ్‌ను క్రీడాకారులు తమ సారథిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో నీరజ్ చోప్రా జాతీయ పతాకధారిగా వ్యవహరిస్తాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నీరజ్ చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా అతనికి ఈ అరుదైన అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు నరేంద్ర బత్రా తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్, హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, టెన్నిస్ తదితర అంశాల్లో భారత ఆటగాళ్లు పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు.

గర్వంగా ఉంది…
ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడల్లో భారత బృందానికి నాయకత్వం వహించే అరుదైన గౌరవం దక్కడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు నీరజ్ చోప్రా అన్నాడు. హేమాహేమీ క్రీడాకారులు ఉన్న బృందంలో తనకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉన్నాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని, ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందిస్తాననే నమ్మకాన్ని నీరజ్ వ్యక్తం చేశాడు. కొంతకాలంగా ఆసియా క్రీడల కోసం ప్రత్యేక సాధన చేస్తున్నట్టు వివరించాడు. పోటీ తీవ్రంగా ఉన్నా పతకం సాధించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని నీరజ్ పేర్కొన్నాడు.

Comments

comments