Home రంగారెడ్డి రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం

రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం

రూ.లక్షల ప్రజాధనం వృథా.. ఇలా అయితే ఎలా?
నిర్మాణం పూర్తయినా గాలికి వదిలేస్తున్న వైనం
సౌకర్యాల్లేక సతమతమవుతున్న వ్యాధిగ్రస్తులు
జడ్పీ సమావేశంలో చర్చిస్తారు.. మరుసటి రోజు మరిచిపోతారు
BULIDINGమన తెలంగాణ/రంగారెడ్డి : జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తీరు వింతగా ఉంది. ప్రభుత్వ ధర్మాసుపత్రుల్లో నిర్లక్షం రాజ్యమేలుతోంది. ఒక్కో భవనానికి లక్షల రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వాలు, వాటిని రోగులకు అందుబాటులో తీసుకురావడానికి మాత్రం అంత శ్రద్ధ చూపడం లేదు. భవన నిర్మాణాలు పూర్తి అయి, ఐదు నుంచి పది సంవత్సరాలు అవుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోవడంలేదు. ఇలాంటి భవనాలు పందులకు, పందికొక్కులకు ఆవాసాలు గా మారుతున్నాయి. అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలుగా తయారవుతున్నా యి. ఉద్ధేశం మంచిదే అయినా రోగులకు వైద్య సేవలు అందించడంలో మాత్రం పూర్తిగా వెనుకబడుతున్నాయి. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించి, కాంట్రాక్టర్ల దగ్గర తమకు కావాలసిన కమీషన్లు దండుకునే దాని మీద ఉన్న ధ్యాస ఆ భవనాలను వినియోగంలోకి తీసుకురావడంలో లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో మంత్రి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డిల సొంత మండలం షాబాద్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణకు నిర్మించిన భవన నిర్మాణం పూర్తై, దాదాపు ఐదు సంవత్సరాల కాలం పూర్తవుతున్నా ఇంత వరకు దానికి అతీగతిలేదు. ప్రస్తుతం భవనంలో ఏర్పాటుచేసిన ఫ్యాన్లు ఇతర వస్తువులను సైతం కావాలసిన వారు ఎత్తుకెళ్లగా ప్రస్తుతం పందికొక్కులు అక్కడ కాపురముంటున్నాయి.
ఎన్నో ఏళ్లుగా… ఏడు భవనాలు …
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు గతంలో పెద్ద ఎత్తున భవనాలను నిర్మించారు. ఇందులో కొన్ని వినియోగంలోకి తీసుకువచ్చినా చాలా వరకు గాలికి వదిలేశారు. జిల్లాలో మంత్రి మహేందర్‌రెడ్డి సొంత మండలం షాబాద్‌తో పాటు, ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడులో రూ.65.23 లక్షలతో, మహేశ్వరం నియోజకవర్గంలోని లేమూరులో రూ.56.18 లక్షలతో, రాచలూర్‌లో రూ.61.51 లక్షలతో, వికారాబాద్‌లోని కోట్‌పల్లిలో రూ.58.91 లక్షలతో, అనంతగిరిపల్లిలో రూ.35.10 లక్షలతో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంత గ్రామం మైలార్‌దేవ్ పల్లిలో రూ.34.36 లక్షలతో, ఉప్పల్ నియోజక వర్గం లోని కుషాయిగూడలో లక్షలాది రూపాయలను వెచ్చించి నిర్మా ణాలు చేసిన బడా భవనాలు అధికారులను, ప్రజా ప్రతినిధులను వెక్కిరిస్తున్నాయి. భవనాలను నిర్మించడంలో ఉన్న శ్రద్ధ వైద్య ఆరోగ్య శాఖ వాటిని వినియోగం లోనికి తీసుకురావడంలో చూపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జడ్పీలో హట్ హట్‌గా …
జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై ఇటివల నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో యంపిపి, జడ్పీటిసి, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షాబాద్‌లో ఉన్న భవనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి వాటిని మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవా లని పెద్ద ఎత్తున చర్చలు నిర్వహించారు. ప్రతి జిల్లా పరిషత్ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై విమర్శలు రావడం, అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు మండిపడటం ఇరువురికి పరిపాటిగానే మారిపోయిం ది, తప్ప సమస్యలను పరిష్కారం దిశగా చేపడుతున్న చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఆదివారం వస్తే సర్కార్ వైద్యంకు సెలవు, డాక్టర్‌లు లేరు. ఉన్న రారు, మందులు ఉండవు. ఉన్న ఇచ్చేవారు ఉండరు. ఆర్‌ఎంపిల ఇష్టారాజ్యం. ప్రైవేట్ ఆసుపత్రుల లూఠీ అంటు ప్రతి సమావేశంలో హట్ హట్‌గా చర్చించి మరుసటి రోజు ప్రజా ప్రతినిధులు మరిచిపోవడం ఆధికారులు వాటి గురించి వదిలేసి తిరిగి జిల్లా పరిషత్ సమావేశంలో చర్చ వరకు ఆలాగే ఉండటం పరిపాటి గా మారింది. జిల్లాలో సర్కార్ వైద్యంపై జిల్లా మంత్రితో పాటు, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపితే ప్రజలు వారికి రుణపడి ఉంటారు.