Home ఎడిటోరియల్ నెహ్రూను మరిపించతరమా?

నెహ్రూను మరిపించతరమా?

nehru

నరేంద్రమోడీ ఒప్పుకోకపోవచ్చు కాని, భారతదేశంపైనే కాదు, తమ పైనా చెరగని ముద్ర వేసిన చారిత్రక వ్యక్తిగా జవహర్ లాల్ నెహ్రూను గుర్తించడానికి ప్రపంచదేశాలు క్షణం సంకోచించవు. నెహ్రూ 1964లో మరణించినప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఆయనకు నివాళులర్పిస్తూ “ఆధునిక భారత నిర్మాత” గా పేర్కొంది. ఎకనమిస్ట్ పత్రిక ముఖపత్ర కథనం ప్రచురిస్తూ “నెహ్రూలేని ప్రపంచం” అంటూ విషాదాన్ని ప్రకటించింది.
దేశంలో మాత్రం ఇటీవల నెహ్రూ గురించిన అభిప్రాయాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో మాట్లాడుతూ “కాంగ్రెసు చెబుతున్నట్లు జవహర్ లాల్ నెహ్రూ వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదు” అన్నారు. రాజస్థాన్‌లో 8వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి నెహ్రూ పాఠాన్ని తొలగించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన నేషనల్ ఆర్కయివ్స్ ఎగ్జిబిషన్ లో ఆయన ప్రస్తావనే లేదు. నెహ్రూ అధికారిక నివాసం వద్ద ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రస్తుత సాంస్కృతిక శాఖ పేరు మార్చి మాజీ ప్రధానులందరి జీవిత చరిత్రలను ప్రదర్శించే కాంప్లెక్సుగా మార్చాలని నిర్ణయించింది. అందరికీ సమానావకాశాల పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని నాటకం ఇక్కడ నడుస్తోంది. అమెరికాలో లింకన్ మెమోరియల్ ఉంది. హఠాత్తుగా ఇప్పుడెవరైనా అమెరికా అధ్యక్షుడు దాన్ని మార్చేసి ఆ ప్రదేశాన్ని ఇంకా అనేకమంది ప్రముఖుల విగ్రహాలతో నింపేస్తే ఎలా ఉంటుంది? నెహ్రూను లక్ష్యంగా ఎందుకు చేసుకుంటున్నారంటే దానికి అనేక కారణాలున్నాయి. మహాత్మాగాంధీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్ ను నిషేధించినందుకు ఆర్‌ఎస్‌ఎస్ వారికి నెహ్రూ అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జవహార్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన సెక్యులరిజం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏవగింపు ఉంది. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో ఎదురైన దారుణ ఓటమిని గుర్తు చేసి ప్రజల్లో నెహ్రూ పట్ల ఆగ్రహాన్ని రెచ్చగొట్టడం చాలా తేలిక. విదేశీవిధానంలో నెహ్రూ అలీనవిధానం, పంచవర్ష ప్రణాళికల పద్ధతి వీటన్నింటిపై విమర్శలతో దాడులు చేయడం తేలిక. అంతేకాదు, ప్రజాజీవితంలో నెహ్రూ ప్రముఖ నాయకుడిగా ఎదిగిపోవడం, ఆయన విగ్రహాలతో కాంగ్రెసు ఆయన్ను తమ పార్టీ నాయకుడిగా మార్చేయడం పట్ల కూడా చాలా మందికి అసమ్మతి ఉంది. రోడ్లకు ఆయన పేర్లు పెట్టారు. ప్రభుత్వ పథకాలకు ఆయన పేర్లు పెట్టారు. ఆయన చిత్రాలతో ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు కూడా ఈ అసంతృప్తి వెనుక మరో కారణం. నిజం చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ నెహ్రూ కనబడేలా ఆయన్ను వాడుకున్న పద్ధతి వల్ల నిజానికి ఆయన గొప్పదనానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలు మరుగునపడిపోయాయి.
నెహ్రూ జీవితాన్ని చదవితే భారతదేశానికి ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తి అన్నది అర్థమవుతుంది. నేటికి కూడా నెహ్రూ భారతదేశానికి ఎంత ముఖ్యమైన వారో తెలుస్తుంది. నిజానికి ఆయనపై రావలసినన్ని జీవితచరిత్రలు రాలేదు. విస్తృతమైన ఆయన జీవితంలోని విభిన్న అంశాలను రాతలో పెట్టడం సాధ్యం కాకపోవడమే దానికి కారణం కావచ్చు. ఆయన రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ఉత్తరాలు, ఆయన ప్రసంగాలు ఒక వ్యక్తి తన జీవితంలో ఇంత పరిశ్రమిస్తాడా అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. చరిత్రకారుడు జూడిత్ ఎం.బ్రౌన్ 2003లో రాసిన నెహ్రూ జీవితచరిత్ర “నెహ్రూ: ఏ పొలిటికల్ లైఫ్‌” చదివితే ఈ గొప్పదనం కొంతవరకు అర్థమవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని, 1947 తర్వాత నెహ్రూ రాసిన వ్యాసాలను రచయితకు సోనియాగాంధీ అందజేశా రు. రచయిత అద్భుతంగా, అత్యంత నిష్పక్షపాతంగా నెహ్రూ జీవిత చరిత్రను రికార్డు చేశారు.
నెహ్రూ సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఈ జీవిత
చరిత్ర పుస్తకంలో రచయిత రాసినట్లు భారతదేశంలో ధార్మిక, సామాజిక, సంప్రదాయాలను బ్రిటీషు పాలన దెబ్బతీస్తున్నప్పుడు, విద్యావంతులైన భారతీయులకు అవసరమైన అవకాశాలు కల్పిస్తున్న వాతావరణంలో నెహ్రూ పెరిగి పెద్దయ్యారు. హారో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయా ల్లో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయ భావాలు రూపుదిద్దుకున్నాయి. సామ్రాజ్యవాదం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఆయనకుండేది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్య రహితంగానే గడిచాయి. కాని మహాత్మాగాంధీ 1919-20ల్లో ప్రారంభించిన ప్రతిఘటనలతో ఆయన రాజకీయాలవైపు ఆకర్షించబడ్డారు. ఆ తర్వాతి నుంచి జాతీయోద్యమంలో అతివాదులకు, మితవాదులకు మధ్య పోరాట వ్యూహాలు, ఎత్తుగడల విషయమై చర్చల పరంపర ప్రారంభమైంది. అలాగే సహాయనిరాకరణ గురించి, సంపూర్ణ స్వరాజ్యం కోసం డిమాండ్ లేదా పరిమిత ఫలితాల కోసం ప్రయత్నించడం వంటి విషయాలపై వాడి వేడి చర్చలు జరిగేవి. ఈ వాతావరణంలో నెహ్రూ స్థిరంగా గాంధీజీకి బాసటగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీని కేంద్రశక్తిగా గుర్తించారు. మహాత్మాగాంధీ రాజకీయ విధానాలు, నైతిక పరివర్తన విషయమై ఆయన పట్టుపట్టడం వంటివి చికాకు కలిగించినా గాంధీజీకి తన మద్దతును కొనసాగించారు. నెహ్రూ విధానాలపై ప్రభావం వేసిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఆయన పుట్టి పెరిగిన, హిందూ ముస్లిమ్ మిశ్రమ సంస్కృతి ఉన్న వాతావరణం. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఒక ముస్లిం పండితుని ద్వారా అరబ్బీ, పార్శీ భాషల్లోనే జరిగింది. అలహాబాద్‌లో నివసించే కశ్మీరీ కుటుంబం అది. నెహ్రూను అలహాబాద్‌లో స్థానికులుగా ఎన్నడూ భావించలేదు. అక్కడి సంకుచితమైన, ప్రాంతీయ దురభిమానాలకు దూరంగానే ఉన్నారు. నెహ్రూ అయితే ఒకవిధంగా బయటివ్యక్తిగానే ఉండేవారు. సాంస్కృతికంగా బ్రిటన్ ను మెచ్చుకునే బలమైన జాతీయవాది. భారతదేశం విదేశీపాలనలో ఉండడం పట్ల ఆయన చాలా బాధపడేవారు. కాని దేశంలోని మూఢనమ్మకాలు, అంధసంప్రదాయాలను ఏవగించుకునేవారు.
త్వరలోనే నెహ్రూ రాజకీయాల్లోను, కాంగ్రెసు వ్యవహారాల్లోను తలమునకలైపోయారు. ఆయన అధ్యయనం చాలా విస్తారమైనది. చాలా లోతయినది. జైల్లో ఉండడం కూడా అధ్యయనానికి ఉపయోగపడింది. 1921 నుంచి 1945 వరకు ఆయన తొమ్మిది సార్లు జైలుకు వెళ్ళారు. అతి తక్కువ కాలం 12రోజులు జైల్లో ఉంటే అత్యధికంగా 1041 రోజులు జైల్లో ఒకసారి ఉన్నారు. మొత్తం జీవితంలో 3259 రోజులు జైల్లో గడిపారు. అంటే జీవితంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు. ఆయన జైలు జీవితానికి తన్ను తాను అలవాటు చేసుకున్నారు. జైల్లో స్నేహాల గురించి, హాబీల గురించి రాశారు. ప్రైవసీ లేకపోవడం పట్ల చికాకును కూడా రాసుకున్నారు. అధ్యయనం ఆయనకు గొప్ప సాంత్వన నిచ్చేది. ఆయన జీవిత చరిత్ర రాసిన బ్రౌన్ ప్రకారం నెహ్రూ అనేక విషయాలపై చదివేవారు. పాలిటిక్స్, ఎకనమిక్స్, సైన్స్, లిటరేచర్, కరంట్ ఎఫైర్స్ అన్నీ చదివేవారు. జైల్లో ఉన్నప్పుడు విస్తారమైన అధ్యయనం చాలా అవసరం లేకపోతే మనస్సు కుంగి కృశించిపోతుంది అన్నారాయన. ఒకసారి ఫిబ్రవరి 1934 నుంచి సెప్టెంబరు 1935 వరకు ఆయన 188 పుస్తకాలు చదివారు. అంటే నెలకు 15 నుంచి 20 పుస్తకాలు.
ఈ విస్తారమైన, లోతయిన అధ్యయనం వల్ల ఆయన అద్భుతమైన రచయిత కాగలిగారు. ఆయన రాసుకున్న ఆటో బయోగ్రఫీ కాని, డిస్కవరి ఆఫ్ ఇండియా కాని, ఆయన రాసిన ఉత్తరాలు కాని, ప్రసంగాలు కాని అన్నింటా ఆయన ప్రతిభ కనబడుతుంది. భారతదేశంలోను, బ్రిటన్‌లోను ఆయన నివసించిన కాలం, యూరపు ప్రయాణా ల్లో ఆయన గడిపిన కాలం, ఇతర దేశాల నాయకులతో ఆయన చర్చ లు వీటన్నింటిలో ఆయన చాలా పటిష్టమైన రాజకీయ దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. వలసపాలనను తీవ్రంగా వ్యతిరేకించేవారు. దేశాల మధ్య సమానత్వం కోరుకునేవారు. దేశంలో ప్రజల మధ్య సమానత్వం కోరుకునేవారు. భూసంస్కరణలు అవసరమని భావించారు. ఆర్ధికరంగంలోను, సామాజికంగాను రాజ్యం జోక్యం చేసుకోవడం అవసరంగా భావించారు. ఒక జాతి జీవనంలో విజ్ఞాన శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారు. మతానికి ఆయనెప్పుడు ప్రాముఖ్యం ఇవ్వలేదు. జాతి నిర్మాణంలో మహిళలకు ప్రముఖపాత్ర ఉండాలని భావించేవారు. ప్రపంచపటంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం కోసం పరితపించారు. ఈ మేధోపరమైన ప్రగతి అనేది భారత భవిష్యత్తుకు ఎంతైనా అవసరం. నెహ్రూ కాంగ్రెసులో 1930 నాటికి ప్రముఖ స్థాయికి ఎదిగారు. పార్టీ అధ్యక్షుడిగా, జాతీయోద్యమ నాయకుడిగా ఆయన అనేక పరిస్థితులను చూశారు. ఆందోళనలు, ప్రతిఘటనలు, సర్దుబాట్లు, అసమ్మతులు ఇలా ఎన్నెన్నో చూశారు. అప్పటికి గాంధీజీ ముఖ్యంగా అంటరానితనంపై దృష్టి పెడుతూ రాజకీయాల నుంచి వెనక్కు తొలగుతున్న కాలం అది. ఆ తర్వాత 1936లో గాంధీజీ తన వారసుడిగా నెహ్రూను ప్రకటించారు. అనేక నైపుణ్యాలున్న నెహ్రూ, భారతదేశం పట్ల పూర్తి అంకితభావం ఉన్న నాయకుడు, ఎలాంటి వర్గపరమైన ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు లేని నాయకుడు కాబట్టి ఆయనపై పూర్తిగా ఆధారపడవచ్చని గాంధీజీ విశ్వసించేవారు. నెహ్రూ ద్వారా కాంగ్రెసులో సమైక్యత సాధించవచ్చని ఆయన భావించారు. ఈ దశలో నెహ్రూ కాంగ్రెసు పార్టీలో కీలకమైన నాయకుడు మాత్రమే కాదు, ప్రజలు పెద్ద సంఖ్యలో మద్దతిస్తున్న ప్రజానాయకుడు కూడా. ప్రజలు ఆయన్ను అమితంగా గౌరవించేవారు.
1946లో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి అంగీకరించారు. ఆ తర్వాత చర్చల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు. చివరకు దేశవిభజన దశ కూడా వచ్చింది. చరిత్రకారుడు రామచంద్రగుహ రాసిన పుస్తకం “పాట్రియాట్స్ అండ్ పార్టిసాన్స్‌” లో ఇలా రాశారు, “నిస్సందేహంగా మన ప్రజాస్వామ్యసౌధానికి ప్రధాన వాస్తుశిల్పి నెహ్రూ. ఆయనే అందరికీ ఓటు హక్కు, బహుళ పార్టీ వ్యవస్థలకు పునాదులేశారు.” అని రాశారు.
దేశంలో సామాజిక మార్పు కోసం నెహ్రూ కృషి చేశారు. ప్రణాళికాబద్దమైన అభివృద్ధి ద్వారా అసమానతలను తొలగించే ప్రయత్నం చేశారు. సోషలిస్టు పంథా పరిపాలనతో, మిశ్రమ ఆర్ధికవిధానాలను అవలంబిస్తూ ఆయన చేసిన ప్రయత్నాలను ఇప్పుడు ఎవరు విమర్శించినా, ఇలాంటి విధానాల వల్ల ప్రగతి దెబ్బతిందని కొందరు వాదించినా ఆయన అవలంబించిన విధానాలకు మద్దతు కూడా చాలా ఉంది. సోవియట్ పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడం ఆయన్ను ఆకర్షించింది. భారతదేశంలో కూడా అలాంటి ప్రగతి సాధించాలని భావించారు. అయితే సోవియట్‌లో మాదిరి హింసాత్మక పరిస్థితులు లేకుండా అదంతా సాధించాలనుకున్నారు. ఇక్కడ మనం గుర్తించవలసిన వాస్తవమేమంటే, స్వతంత్ర భారతం ప్రయాణం ప్రారంభించినప్పుడు దేశంలో అక్షరాస్యత 14 శాతం. పేదరికం ఎటు చూసినా అలుముకున్న పరిస్థితులవి. అందువల్ల అనేక రంగాల్లో ప్రభుత్వం కలుగజేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని వల్ల చెప్పుకోదగ్గ ఫలితాలు కూడా లభించాయి. ముఖ్యంగా అణుశక్తి రంగంలోను, రోదసీరంగంలోను ఈ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.నెహ్రూ పోషించిన పాత్రను తగ్గించి చూపడం అన్నది, లేదా ఆయన్ను మరిచిపోవడం అన్నది దేశాన్ని తక్కువ చేయడమే అవుతుంది. చరిత్రలో ఆయన పోషించిన పాత్ర ప్రాముఖ్యం మాత్రం తగ్గదు.

* సుశీల్ ఆరన్